Bengaluru: ఆఫీస్ వదిలి 3 గంటలైనా రోడ్డు మీదే ఉన్నాడు.. గూగుల్ మ్యాప్స్ చూపించిన రూట్ చూసి మైండ్ బ్లాక్!
భారతదేశ సిలికాన్ వ్యాలీగా పిలవబడే బెంగళూరు (Bengaluru) నగరం ఐటీ ఉద్యోగాలకే కాదు.. అక్కడి ట్రాఫిక్ పద్మవ్యూహానికి కూడా ప్రపంచవ్యాప్తంగా అంతే ఫేమస్. అక్కడ రోడ్డు మీదకు బండి తీయాలంటేనే ఐటీ ఉద్యోగులు వణికిపోతుంటారు. తాజాగా దీనికి సంబంధించిన ఒక లైవ్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (X) లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
వరుణ్ రంగరాజన్ అనే వ్యక్తి బెంగళూరులోని బెల్లందూర్ ఏరియా నుండి సాయంత్రం 5:17 గంటలకు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. కానీ, రాత్రి 8:52 గంటల సమయం దాటినా అతను ఇంకా రోడ్డు మీదే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి ఉన్నాడు. అంటే దాదాపు 3 గంటల కంటే ఎక్కువ సమయం అతను కేవలం రోడ్డు మీద నరకం చూశాడు.

2 కిలోమీటర్ల దూరానికి గంటన్నర సమయం!
వరుణ్ తన ఎక్స్ పోస్ట్‌లో ఆవేదన వ్యక్తం చేస్తూ.. కల్యాణ్ నగర్ నుండి మాన్యతా టెక్ పార్క్ (Manyata Tech Park) మధ్య ఉన్న కేవలం 2 నుండి 3 కిలోమీటర్ల దూరాన్ని దాటడానికి తనకు ఏకంగా గంటన్నర సమయం పట్టిందని తెలిపాడు. "నేను సాయంత్రం 5:17 కి బెల్లందూర్ వదిలాను. ఇప్పటికీ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పైనే ఇరుక్కుపోయాను. ఇంత ఘోరంగా జామ్ అయినా కూడా రోడ్డు మీద ఒక్కటంటే ఒక్క ట్రాఫిక్ పోలీస్ కూడా కనిపించలేదు. నేను గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి చూస్తే.. కార్లో వెళ్లడం కంటే నడుచుకుంటూ వెళ్లినా అదే సమయానికి ఇంటికిచేరిపోవచ్చని చూపించింది" అంటూ బెంగళూరు ట్రాఫిక్ పరిస్థితిని ఎండగట్టాడు.
TomTom ట్రాఫిక్ ఇండెక్స్ ఏం చెబుతోంది?
ఇది కేవలం ఒక వరుణ్ సమస్య మాత్రమే కాదు.. రోజూ లక్షలాది మంది బెంగళూరు (Bengaluru) వాహనదారులు పడుతున్న బాధ. గ్లోబల్ రేటింగ్స్ ఇచ్చే 'టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్' ప్రకారం.. ప్రపంచంలోనే అత్యధిక ట్రాఫిక్ రద్దీ ఉన్న నగరాల్లో బెంగళూరు ప్రపంచంలోనే రెండో స్థానంలో, భారతదేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడి సగటు కాంగెస్టిన్ లెవెల్ (రద్దీ శాతం) ఏకంగా 74.4 శాతంగా నమోదైంది.
- సగటు వేగం: ఈ నగరంలో కేవలం 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలన్నా సగటున 36 నిమిషాల 9 సెకన్ల సమయం పడుతుంది.
- రష్ అవర్స్ (Rush Hours): ఇక ఉదయం, సాయంత్రం ఆఫీస్ వేళల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. సాయంత్రం వేళల్లో 10 కి.మీ దూరం వెళ్లడానికి 45 నిమిషాల 27 సెకన్లు పడుతుంది. ఈ సమయంలో బండ్ల సగటు వేగం గంటకు కేవలం 13.2 కిలోమీటర్లు మాత్రమే!
అసలు కారణం ఇదే: బెంగళూరు నగరంలో జనాభా, ఐటీ కంపెనీలు, వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం.. దానికి తగ్గట్టుగా రోడ్లు, ఫ్లైఓవర్లు వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడమే ఈ ఘోరమైన ట్రాఫిక్ జామ్‌లకు ప్రధాన కారణమని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఈ వైరల్ పోస్ట్ చూసిన తోటి నెటిజన్లు కూడా "బెంగళూరులో బతికే కంటే.. ట్రాఫిక్ లోనే సగం జీవితం అయిపోతోంది" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications