Bengaluru: వర్షపు నీటితో లక్షల్లో లాభం! బెంగళూరులో ఒక అపార్ట్‌మెంట్ చేస్తున్న అద్భుత ప్రయోగం ఇది!
బెంగళూరు(Bengaluru)లో నీటి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా అపార్ట్‌మెంట్లలో ఉండేవారు వేల రూపాయలు ఖర్చు చేసి వాటర్ ట్యాంకర్లను కొనుగోలు చేయాల్సి వస్తోంది. అయితే బెంగళూరులో ఓ వ్యక్తి తన అపార్ట్‌మెంట్‌లో చేసిన ఒక చిన్న ప్రయోగం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక సాదాసీదా టెక్నాలజీతో ఏకంగా నెలకు లక్ష రూపాయల వరకు నీటి బిల్లును తగ్గించి చూపిస్తున్నారు.

సాధారణంగా నగరాల్లో అపార్ట్‌మెంట్లలో నివసించే వారికి నీటి కష్టాలు సహజం. బోర్లు ఎండిపోవడం, మున్సిపల్ నీరు సరిపోకపోవడంతో ట్యాంకర్లపై ఆధారపడటం మనం చూస్తుంటాం. బెంగళూరులోని 'మెట్రోపాలిస్ గురుకృప' అపార్ట్‌మెంట్ పరిస్థితి కూడా ఒకప్పుడు అలాగే ఉండేది. కానీ, అక్కడ నివసించే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గణేష్ షాన్‌భాగ్ ఆలోచన ఆ అపార్ట్‌మెంట్ దశనే మార్చేసింది.
సమస్య నుంచి పుట్టిన ఆలోచన
2018 ప్రాంతంలో బెంగళూరులో తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడింది. గణేష్ ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో బోర్ బావులు ఎండిపోయాయి. 88 ఫ్లాట్లు ఉన్న ఆ అపార్ట్‌మెంట్‌లో నీటి కోసం నెలకు సుమారు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ట్యాంకర్లకు ఖర్చు చేయాల్సి వచ్చేది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలనే పట్టుదలతో గణేష్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ (RWH) అంటే వర్షపు నీటి సంరక్షణపై దృష్టి పెట్టారు.
ఖర్చు తక్కువ.. లాభం ఎక్కువ
చాలామంది వర్షపు నీటి సంరక్షణ అంటే లక్షల రూపాయల ఖర్చు అవుతుందని భయపడతారు. కానీ గణేష్ కేవలం 3 లక్షల రూపాయల కంటే తక్కువ పెట్టుబడితో తన అపార్ట్‌మెంట్‌లో ఈ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఆయన వాడిన టెక్నాలజీ చాలా సింపుల్. భవనం పైకప్పు మీద పడే వర్షపు నీటిని పైపుల ద్వారా భూగర్భంలోని ట్యాంకులకు మళ్లించారు. ఇందులో ముఖ్యంగా ఆయన 'డిస్క్ ఫిల్టర్లను' ఉపయోగించారు. ఇవి తక్కువ ధరకే లభిస్తాయి , వీటిని శుభ్రం చేయడం కూడా చాలా సులభం.
ఫలితం ఎలా ఉందంటే?
ఈ సిస్టమ్ ఏర్పాటు చేసిన తర్వాత వర్షాకాలంలో అపార్ట్‌మెంట్ వాసులకు ట్యాంకర్ల అవసరమే లేకుండా పోయింది. ఏడాదిలో దాదాపు 7 నెలల పాటు కేవలం వర్షపు నీటితోనే వారు సరిపెట్టుకుంటున్నారు. దీనివల్ల నెలకు సుమారు లక్ష రూపాయల వరకు ఆదా అవుతోంది. కేవలం తన అపార్ట్‌మెంట్‌కే పరిమితం కాకుండా, గణేష్ ఇప్పటివరకు బెంగళూరులోని సుమారు 300 పైగా అపార్ట్‌మెంట్లకు ఉచితంగా సలహాలు అందించి, అక్కడ కూడా ఈ విధానాన్ని అమలు చేయడంలో సాయపడ్డారు.
పర్యావరణానికి మేలు
ఈ పద్ధతి వల్ల కేవలం డబ్బు ఆదా అవ్వడమే కాదు, భూగర్భ జల మట్టం కూడా పెరుగుతుంది. అదనంగా ఉన్న నీటిని ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి పంపిస్తున్నారు. "మనం వర్షపు నీటిని వృధాగా డ్రైనేజీల్లోకి పంపిస్తున్నాం, అదే నీటిని ఒడిసిపడితే మన నీటి కష్టాలు తీరుతాయి" అని గణేష్ చెబుతున్నారు.


Click it and Unblock the Notifications