బెంగళూరులో సింగిల్‌గా బతకాలంటే నెలకు రూ. లక్ష కావాలి.. సోషల్ మీడియాలో యువతి పోస్టుపై హాట్ డిబేట్
బెంగళూరులో ఒంటరిగా జీవించడం ఎంత ఖర్చుతో కూడుకున్నదో వివరిస్తూ.. ఓ యువతి చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే బెంగళూరుకు మారిన శ్రద్ధా సైని అనే యువతి.. తాను నెలకు చేసే ఖర్చుల పూర్తి వివరాలను ఇన్‌స్టాగ్రామ్ వీడియో రూపంలో పంచుకుంది. ఈ వీడియో ద్వారా Bengaluru మెట్రో నగరంలో సింగిల్ లైఫ్ ఖర్చుల వాస్తవ పరిస్థితిని ఆమె బయటపెట్టడంతో దీనిపై హాట్ డిబేట్ నడుస్తోంది.
ఈ వీడియోలో.. శ్రద్ధా సైని తన నెలవారీ జీవన వ్యయాలను విడివిడిగా వివరించింది. ఆమె చెప్పిన ప్రకారం.. అద్దె, విద్యుత్, నీరు వంటి యుటిలిటీ బిల్లులు, అపార్ట్‌మెంట్ నిర్వహణ ఖర్చులు, ఇంటి శుభ్రపరిచే సేవలు, కిరాణా సామాగ్రి వంటి ప్రాథమిక అవసరాలకే నెలకు దాదాపు రూ. 40 వేల వరకు ఖర్చవుతుందని వెల్లడించింది. దీంతో పాటుగా రోజువారీ ప్రయాణ ఖర్చుల గురించి కూడా ఆమె మాట్లాడింది. ప్రతి ఉదయం కార్యాలయానికి వెళ్లేందుకు ఆటోలో ప్రయాణిస్తానని, అందుకు రోజుకు సుమారు రూ. 50 ఖర్చవుతుందని చెప్పింది. సాయంత్రం మాత్రం నడిచే ఇంటికి వస్తానని తెలిపింది. ఈ విధంగా రోజువారీ ప్రయాణ ఖర్చులు నెలకు సుమారు రూ. 1,000 వరకు ఉంటాయని వివరించింది.

అయితే, వారాంతాల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుందని సైని చెప్పింది. షాపింగ్ చేయడం, స్నేహితులను కలవడం, బయటికి వెళ్లడం వంటి అవసరాల కోసం క్యాబ్‌లను వినియోగిస్తానని, దీనివల్ల నెలకు మరో రూ. 5 వేలు అదనపు ఖర్చు అవుతుందని తెలిపింది. ఆహార ఖర్చులు కూడా తన బడ్జెట్‌లో కీలకమైన భాగమని ఆమె పేర్కొంది. బయట తినడం, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్‌ల ద్వారా ఆహారం ఆర్డర్ చేయడం కోసం నెలకు సుమారు రూ. 6 వేల వరకు ఖర్చవుతుందని తెలిపింది.
ఇవే కాకుండా, ఐక్లౌడ్, ఆపిల్ మ్యూజిక్ వంటి ఆటో-డెబిట్ సబ్‌స్క్రిప్షన్‌లకు నెలకు కలిపి దాదాపు రూ.2,000 ఖర్చవుతుందని వివరించింది. వ్యక్తిగత ఖర్చుల విషయానికి వస్తే, బట్టలు, మేకప్, షూస్ వంటి వాటికి ప్రతి నెలా సుమారు రూ. 25 వేల వరకు వెచ్చిస్తానని ఆమె చెప్పింది. దీనితో పాటు, తనపై నెలకు దాదాపు రూ. 18 వేలు EMI భారం కూడా ఉందని వెల్లడించింది.
ఈ అన్ని ఖర్చులను కలిపి చూసుకుంటే.. తాను నెలకు దాదాపు రూ. 1 లక్ష వరకు ఖర్చు చేస్తున్నట్టు శ్రద్ధా సైని చెప్పింది. తాజాగా బెంగళూరుకు మారిన కారణంగా ఇంకా ఖర్చులకు అలవాటు పడుతున్నానని, ప్రస్తుతం పెద్దగా పొదుపు చేయలేకపోతున్నానని ఆమె అంగీకరించింది. ఇప్పటికి సేవింగ్స్ అనేవి లేవు. నగర జీవనానికి ఇంకా సర్దుబాటు అవుతున్నానని ఆమె పేర్కొంది.
ఈ వీడియోకు సోషల్ మీడియాలో భారీ స్పందన వచ్చింది. కొందరు తమ నెలవారీ ఖర్చులను షేర్ చేస్తూ ఆమెకు మద్దతుగా నిలవగా, మరికొందరు ఇంత ఖర్చు అవసరమా? ఇది స్థిరమైన జీవన విధానమా? అంటూ ప్రశ్నించారు. ఒక యూజర్ తన అనుభవాన్ని పంచుకుంటూ.. తాను డబుల్ షేరింగ్ రూమ్‌లో ఉండి నెలకు కేవలం రూ. 25 వేల నుంచి రూ. 26 వేల మధ్యే ఖర్చు చేస్తున్నానని వ్యాఖ్యానించారు.
మరో వినియోగదారు అయితే.. షాపింగ్, ఫుడ్ డెలివరీలపై ఖర్చు తగ్గించి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకుంటే పొదుపు సాధ్యమని సూచించారు. ఏదేమైనా ఈ యువతి చేసిన వీడియో ఇప్పుడు బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో జీవన వ్యయం ఎంత పెరిగిందో చూపిస్తూ.. యువతలో ఖర్చులు-పొదుపులపై కొత్త చర్చకు దారితీసిందని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications