Bengaluru: అత్యాశకు పోతే ఇంతే! రూ. 75 వేల అద్దె ఆశించి.. రూ. 5 లక్షలు పోగొట్టుకున్నాడు!
కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) అంటేనే ఐటీ కంపెనీలు, ట్రాఫిక్ జామ్ లు, ఆకాశాన్నంటే అద్దెలు గుర్తొస్తాయి. గత రెండేళ్లుగా ఇక్కడ ఇళ్ల అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. తాజాగా వైట్‌ఫీల్డ్ ప్రాంతంలోని ఒక ఇంటి యజమాని తన అత్యాశ వల్ల ఏకంగా రూ. 5 లక్షలకు పైగా ఆదాయాన్ని కోల్పోయిన ఉదంతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

ఒక్కో గదికి రూ. 25 వేల డిమాండ్
రెడిట్ (Reddit) వేదికగా ఒక అద్దెదారు పంచుకున్న వివరాల ప్రకారం.. అతను వైట్‌ఫీల్డ్ ప్రాంతంలోని ఒక విశాలమైన 3BHK ఫ్లాట్ లో నివసిస్తున్నాడు. ఆ యజమాని ప్రతి గదికి రూ. 25,000 చొప్పున మొత్తం ఫ్లాట్‌కు రూ. 75,000 అద్దె ఆశించాడు. కానీ, ఆ ప్రాంతంలో సాధారణంగా ఒక గది అద్దె రూ. 20,000 లోపే ఉంది. యజమాని పట్టుదల కారణంగా అదనంగా ఉన్న రెండు గదులు ఏడాది కాలంగా ఎవరూ చేరక ఖాళీగానే ఉండిపోయాయి.
లెక్క తప్పిన యజమాని స్కెచ్
ఒక్కో గదికి అదనంగా రూ. 5,000 ఆశించిన సదరు యజమాని.. ఆ గదులు ఖాళీగా ఉండటం వల్ల ఎంత నష్టపోయాడో చూడండి..
- ఏడాది పొడవునా రెండు గదులు ఖాళీగా ఉండటం వల్ల నెలకు రూ. 40,000 చొప్పున ఆదాయం కోల్పోయాడు.
- ఏడాది మొత్తానికి ఇది సుమారు రూ. 4.8 లక్షల నష్టం.
- నిర్వహణ ఖర్చులు ఇతరత్రా కలిపితే ఆ నష్టం రూ. 5 లక్షలు దాటిపోయింది. చివరికి పరిస్థితి అర్థం చేసుకున్న యజమాని.. ఇప్పుడు అద్దెను రూ. 18,000 కి తగ్గించాడు. అయినప్పటికీ కొత్త అద్దెదారులు ఇంకా ఫైనల్ కాలేదు.
2022 మైండ్‌సెట్ ఇంకా మారలేదా?
"బెంగళూరు యజమానులు ఇంకా 2022 నాటి పీక్ మార్కెట్ రోజుల్లోనే బతుకుతున్నారు. కానీ, ఇప్పుడు మార్కెట్ మారింది" అని ఆ అద్దెదారు వ్యాఖ్యానించాడు. సరఫరా పెరగడం వల్ల ఇప్పుడు అద్దెదారులకు బేరమాడే (Bargaining power) శక్తి పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. కేవలం వెయ్యి రూపాయల డిమాండ్ కోసం మొండిగా వ్యవహరించి, వేల రూపాయల నెలసరి ఆదాయాన్ని కోల్పోవడం తెలివైన పని కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
అద్దెదారుల మధ్య చర్చ
వైరల్ అయిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "ఒక స్వతంత్ర భవనంలో 2BHK ఇల్లే రూ. 20,000 కి దొరుకుతున్నప్పుడు.. ఒక ఫ్లాట్ లో సింగిల్ రూమ్ కోసం రూ. 18,000 నుంచి రూ. 25,000 ఎవరు ఇస్తారు?" అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు.. యజమాని అద్దె తగ్గించిన విషయం తెలుసుకున్న పాత అద్దెదారుని "మరి నువ్వు కూడా నీ అద్దె తగ్గించమని అడగవచ్చు కదా" అని సలహా ఇస్తున్నారు. దానికి అతను స్పందిస్తూ.. కొత్త అద్దెదారులు చేరిన తర్వాత కచ్చితంగా తన అద్దెను కూడా తగ్గించమని అడుగుతానని సమాధానమిచ్చాడు.
మొత్తంగా చూస్తే.. బెంగళూరులో రియల్ ఎస్టేట్, అద్దె మార్కెట్ ఇప్పుడు కస్టమర్ల వైపు మొగ్గు చూపుతోంది. ఇంటి యజమానులు వాస్తవ పరిస్థితులను గమనించకపోతే ఇలాంటి నష్టాలు తప్పవని ఈ ఉదంతాన్ని బట్టి అర్థమవుతోంది.


Click it and Unblock the Notifications