Bengaluru: బెంగళూరులో అద్దె ఇల్లు కావాలా? లక్షల డిపాజిట్ అడుగుతున్న ఓనర్లు.. షాక్‌లో నెటిజన్లు!
భారతదేశ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరు (Bengaluru) లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో.. ఇళ్ల అద్దెలు కూడా అంతే వేగంగా ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఒక వ్యక్తికి, ఒక ఇంటి యజమానికీ మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అద్దె ఇంటి కోసం ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తికి ఎదురైన అనుభవం చూస్తే.. బెంగళూరులో సామాన్యుడు ఇల్లు తీసుకోవడం ఇంత కష్టమా? అన్న అనుమానం కలుగుతోంది.

అసలు ఏం జరిగింది?
ఒక వ్యక్తి బెంగళూరులో 2BHK ఫ్లాట్ కోసం వెతుకుతూ ఒక యజమానికి మెసేజ్ చేశాడు. దానికి ఆ యజమాని ఇచ్చిన రిప్లై చూసి ఆ వ్యక్తి బిత్తరపోయాడు. ఆ ఓనర్ చెప్పిన వివరాల ప్రకారం.. నెలవారీ అద్దె రూ. 60,000, మెయింటెనెన్స్.. రూ. 5,000, ఇక సెక్యూరిటీ డిపాజిట్ అయితే అక్షరాలా రూ. 10 లక్షలు! అంతేకాకుండా కనీసం మూడేళ్ల పాటు ఆ ఇంట్లోనే ఉంటామని గ్యారెంటీ ఇవ్వాలని (Lease Commitment) సదరు యజమాని కండిషన్ పెట్టాడు. 60 వేల అద్దెకు 10 లక్షల డిపాజిట్ ఏంటని ఆ వ్యక్తి రెడిట్ (Reddit) వేదికగా తన గోడు వెళ్లబోసుకున్నాడు.
నిబంధనలు ఏం చెబుతున్నాయి?
నిజానికి, కొత్త అద్దె చట్టాల ప్రకారం సెక్యూరిటీ డిపాజిట్ అనేది రెండు నెలల అద్దెకు సమానంగా ఉండాలి. ఈ రూల్ బెంగళూరు (Bengaluru) సహా.. అన్ని నగరాలకు వర్తిస్తుంది. కానీ, కొన్ని చోట్ల యజమానులు మాత్రం ఆ చట్టాలను అస్సలు పట్టించుకోవడం లేదు. సదరు అద్దెదారు ఈ చట్టం గురించి ప్రస్తావించగా.. "నా ఇల్లు - నా ఇష్టం" అన్నట్టుగా యజమానులు వ్యవహరిస్తున్నారని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అదుపు తప్పుతున్న అద్దె మార్కెట్
వైట్‌ఫీల్డ్ (Whitefield), బ్రూక్‌ఫీల్డ్ లేదా మరతహళ్లి వంటి ప్రాంతాల్లో 2BHK లేదా 3BHK ఇళ్ల కోసం వెతుకుతున్న వారికి ఇప్పడు చుక్కలు కనిపిస్తున్నాయి. 60 వేల రూపాయల బడ్జెట్ పెట్టినా సరే.. సరైన ఇల్లు దొరకడం లేదని, దొరికినా ఇలాంటి విడ్డూరమైన డిపాజిట్లు అడుగుతున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
సోషల్ మీడియా స్పందన
ఈ పోస్ట్‌పై స్పందించిన నెటిజన్లు తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు..
- ఐక్యత అవసరం: అందరూ కలిసి ఇలాంటి అధిక డిపాజిట్లు అడిగే ఇళ్లను తిరస్కరిస్తే తప్ప, యజమానుల ధోరణి మారదని ఒకరు అభిప్రాయపడ్డారు.
- చట్టం వర్తించదా?: ప్రభుత్వం జోక్యం చేసుకుని అద్దె నియంత్రణ చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
- డిపాజిట్ వ్యాపారం: అద్దెదారుల నుంచి లక్షల రూపాయలు డిపాజిట్ తీసుకొని, వాటిని వడ్డీలకు తిప్పుకుంటూ యజమానులు సొమ్ము చేసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి.
బెంగళూరులో ఇల్లు వెతకడం ఒక సాహసం!
టెక్ సిటీలో ఇల్లు దొరకడం ఇప్పుడు కేవలం డబ్బుతో కూడిన పని మాత్రమే కాదు, అది మానసిక ఒత్తిడితో కూడిన వ్యవహారంగా మారింది. బెంగళూరు (Bengaluru) అద్దె మార్కెట్ ఇంతలా అదుపు తప్పడం వల్ల మధ్యతరగతి ప్రజలు నగరం వెలుపల నివసించడానికి మొగ్గు చూపుతున్నారు. ఏదేమైనా సిటీల్లో అద్దెకు దిగేముందు నిబంధనలు క్షుణ్ణంగా చదువుకోవడం, భారీ డిపాజిట్ల విషయంలో జాగ్రత్తగా ఉండటం ఎంతైనా మంచిది.


Click it and Unblock the Notifications