ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్యాస్ సంక్షోభం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ముఖ్యంగా బెంగళూరు (Bengaluru) వంటి నగరాల్లోని అనేక హోటళ్లు , రెస్టారెంట్లు కమర్షియల్ ఎల్‌పీజీ (LPG) సిలిండర్ల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. వంట గ్యాస్ (LPG) సరఫరా నిలిచిపోవడంతో కొన్ని చోట్ల వ్యాపారాలు కూడా ఆగిపోయే పరిస్థితి వచ్చింది. అయితే బెంగళూరులోని కొన్ని కమ్యూనిటీ కిచెన్లు , రెస్టారెంట్లు మాత్రం ఈ సంక్షోభం తమపై ఎలాంటి ప్రభావం చూపకుండా హాయిగా వంటలు సాగిస్తున్నాయి. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

బెంగళూరు (Bengaluru)లో మధ్యాహ్న భోజన పథకం కింద వేలాది మంది పాఠశాల విద్యార్థులకు భోజనం అందించే అదమ్య చేతన , అక్షయ పాత్ర ఫౌండేషన్లు ఈ సంక్షోభంలోనూ దీటుగా నిలబడ్డాయి. దానికి కారణం వారు ఏళ్ల క్రితమే తీసుకున్న 'స్థిరమైన ఇంధన' (Sustainability) నిర్ణయాలే. అదమ్య చేతన సంస్థ గత 16 ఏళ్లుగా పెట్రోలియం ఇంధనాలపై ఆధారపడటం తగ్గించింది. వ్యవసాయ వ్యర్థాలతో తయారు చేసిన 'బ్రిక్వెట్స్' (Briquettes) ద్వారా వీరు ఆవిరిని ఉత్పత్తి చేసి వంటలు చేస్తున్నారు. దీనివల్ల గ్యాస్ కొరత ఉన్నా రోజుకు 40,000 మందికి భోజనం అందించడం వీరికి సాధ్యమవుతోంది. అటు అక్షయ పాత్ర కూడా బెంగళూరులోని తన ఆరు కిచెన్లలో మూడింటిని పూర్తిగా బయోమాస్ ఇంధనంతోనే నడుపుతోంది.
వంట గదిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)
బ్రిగేడ్ రోడ్డులోని జస్ట్ బిఎల్ఆర్ (Just BLR) అనే రెస్టారెంట్ గ్యాస్ సిలిండర్లతో పని లేకుండా పూర్తిగా ఎలక్ట్రిక్ , ఏఐ (AI) నియంత్రిత యంత్రాలతో వంట చేస్తోంది. ఇక్కడ కూరగాయలు కోయడం నుంచి బిర్యానీ వండటం వరకు అన్నీ ఆటోమేటిక్ మిషన్లే చూసుకుంటాయి. రెసిపీని మిషన్ లో ఫీడ్ చేస్తే చాలు.. అదే ఉష్ణోగ్రతను , సమయాన్ని నియంత్రిస్తూ రుచికరమైన వంటను 5 నిమిషాల్లోనే సిద్ధం చేస్తుంది. అంతేకాదు దీంతో రకరకాల డ్రింక్స్ కూడా తయారుచేయొచ్చు. ఇదంతా ఆటోమేటిక్ మెషీన్ల ద్వారానే జరుగుతుంది. దీనివల్ల గ్యాస్ పై ఆధారపడటం సున్నా.
సోలార్, విండ్ పవర్ తో హోటళ్లు
ఎలక్ట్రానిక్స్ సిటీలోని 'ది ఒటెర్రా' (The Oterra) వంటి పెద్ద హోటళ్లు తమ కిచెన్ ఆపరేషన్లను పూర్తిగా ఎలక్ట్రిక్ సిస్టమ్స్ కు మార్చేశాయి. వీరికి కావలసిన విద్యుత్తు సౌర , పవన శక్తి ద్వారా అందుతోంది. పదేళ్ల క్రితమే కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు వీరు తీసుకున్న ఈ నిర్ణయం.. ఇప్పుడు ఎల్‌పీజీ (LPG) కొరత సమయంలో వారికి పెద్ద వరంగా మారింది.
ఏదేమైనా బెంగళూరు (Bengaluru) లాంటి మహానగరంలో ఇంధన సంక్షోభం ఎదురైనప్పుడు ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు అందరికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. గ్యాస్ సిలిండర్లపై మాత్రమే ఆధారపడకుండా పర్యావరణహితమైన, సాంకేతికతతో కూడిన పద్ధతులను అనుసరిస్తే ఏ సంక్షోభాన్ని అయినా తట్టుకోవచ్చని ఈ కిచెన్లు నిరూపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications