బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్.. తిండి కోసం విలవిలలాడుతున్న ఫుడ్ ప్రేమికులు..
ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో గ్యాస్ ధరలు అమాంతం పెరిగాయి.తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో హోటళ్లు, రెస్టారెంట్ల కార్యకలాపాలు మార్చి 10 నుండి తీవ్ర అంతరాయాలను ఎదుర్కొనే అవకాశం ఉందని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ సోమవారం ప్రకటించింది. వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ల సరఫరా అకస్మాత్తుగా పూర్తిగా నిలిచిపోవడంతో నగరంలోని ఆహార వ్యాపార రంగం సంక్షోభంలో పడింది. నగరవ్యాప్తంగా వేలాది హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు ఈ గ్యాస్ సరఫరాపైనే ఆధారపడటంతో వంట కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది.
అసోసియేషన్ ప్రకారం.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణలు, పెరుగుతున్న ఇంధన ఖర్చులు, సరఫరా గొలుసులో ఏర్పడిన అంతరాయాల కారణంగా ఈ సంక్షోభం ఏర్పడింది. నగరంలోని 3 వేల కంటే ఎక్కువ హోటళ్లు మరియు రెస్టారెంట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సంస్థ.. పరిస్థితి త్వరగా పరిష్కారం కాకపోతే అనేక వంటశాలలు మూతపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

గ్యాస్ సరఫరా పూర్తిగా ఆగిపోయింది. అందువల్ల రేపటి నుండి హోటళ్లను నడపడం అసాధ్యం. మేము సేవలను నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చిందని అసోసియేషన్ ప్రకటించింది. హోటళ్లు మూసివేయబడితే నగరంలోని సాధారణ ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, వైద్య రంగానికి చెందిన నిపుణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని వారు పేర్కొన్నారు. ఎందుకంటే ఈ వర్గాల చాలామంది రోజువారీ ఆహారం కోసం రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లపై ఆధారపడుతున్నారు.
పరిశ్రమ ప్రతినిధులు చమురు మార్కెటింగ్ కంపెనీలపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో కనీసం 70 రోజుల పాటు గ్యాస్ సరఫరా నిరంతరంగా కొనసాగుతుందని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పుడు అకస్మాత్తుగా సరఫరాను నిలిపివేయడం హోటల్ రంగానికి పెద్ద దెబ్బగా మారిందని అసోసియేషన్ తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు.
బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు పిసి రావు మీడియాతో మాట్లాడుతూ.. హోటల్ యజమానులు సేవలను నిలిపివేయాలనే ఉద్దేశం లేదని, కానీ ఇంధనం లేకపోవడంతో ఇది అనివార్యమైందని తెలిపారు. మంగళవారం నుంచి హోటళ్లలో గ్యాస్ అందుబాటులో ఉండదు. అందువల్ల ఆహారం, ఇతర రిఫ్రెష్‌మెంట్‌లను కూడా అందించలేమని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రులు, స్థానిక పార్లమెంటు సభ్యులకు ఇప్పటికే లేఖలు పంపామని, సమస్యను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశామని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. వాణిజ్య LPG ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కమర్షియల్ LPG సిలిండర్ ధరను రూ. 115 పెంచగా, గృహ LPG సిలిండర్ ధరను రూ.60 పెంచింది. ధరల పెరుగుదలతో పాటు సరఫరా నిలిచిపోవడం హోటల్ రంగంపై మరింత ఒత్తిడిని పెంచుతోంది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. LPG ధరల పెరుగుదల అధికంగా ఉందని ఆయన విమర్శించారు.ఈ ధరల పెరుగుదల సాధారణ ప్రజలకు ప్రత్యక్ష దెబ్బ. ఇది సరైన నిర్ణయం కాదని ఆయన అన్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు భారతదేశానికి ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతున్నాయని కూడా ఆయన సూచించారు.
ఫిబ్రవరి చివరలో అమెరికా-ఇజ్రాయెల్ దళాలు, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో, ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి ప్రాంతంలో అంతరాయాలు ఏర్పడ్డాయి. భారతదేశం దిగుమతి చేసుకునే LPGలో దాదాపు 60 శాతం ఈ మార్గం ద్వారా రవాణా అవుతుండటంతో, ఆ ప్రభావం ఇప్పుడు దేశీయ సరఫరాపై కూడా పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో బెంగళూరులో హోటల్ పరిశ్రమకు తక్షణ ఉపశమనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వ్యాపార వర్గాలు కోరుతున్నాయి. లేకపోతే నగరంలోని ఆహార రంగం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.


Click it and Unblock the Notifications