Bengaluru: బెంగళూరులో ఫుడ్ ధరలకు రెక్కలు! దోశ, ఇడ్లీ రేట్లు ఎంత పెరిగాయో తెలుసా?
సిలిండర్ ధరలు పెరగడం సామాన్యుడికి భారమనే విషయం మనందరికీ తెలిసిందే. కానీ, ఇప్పుడు ఆ ప్రభావం బెంగళూరు (Bengaluru) నగరంలోని హోటల్ తిండిపై కూడా పడింది. సిలిండర్ల కొరత, పెరుగుతున్న ఖర్చులతో బెంగుళూరులోని చిన్న, పెద్ద హోటళ్లు తమ మెనూ ధరలను సవరించాయి. పొద్దున్నే తినే ఇడ్లీ నుంచి మధ్యాహ్నం భోజనం వరకు అన్నింటిపై ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పెరిగిన ధరలు ఎంతంటే?
బెంగుళూరులో చాలా ప్రాంతాల్లో హోటల్ యజమానులు ప్రతి ఐటమ్ మీద రూ.5 నుంచి రూ.10 వరకు పెంచారు. ముఖ్యంగా దోశ, ఇడ్లీ, చపాతీ వంటి రెగ్యులర్ టిఫిన్ల ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. కస్టమర్లు ధరల పెంపు పట్ల అసంతృప్తిగా ఉన్నప్పటికీ, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రేట్లకే భోజనం చేస్తున్నారు. నగరంలోని కదంబ హోటల్ వంటి ప్రముఖ హోటల్స్ సైతం తమ ఆపరేషన్ ఖర్చులు తట్టుకోలేక ధరలు పెంచక తప్పలేదని చెబుతున్నాయి.
గ్యాస్ కష్టాలు.. కట్టెల పొయ్యిలే శరణ్యం!
కేవలం గ్యాస్ ధరలు పెరగడమే కాకుండా, కమర్షియల్ ఎల్పీజీ (LPG) సిలిండర్ల కొరత కూడా వేధిస్తోంది. వారానికి ఒక సిలిండర్ కూడా దొరకడం కష్టమవుతుండటంతో, హోటల్ యజమానులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. దావణగెరె బెన్నె దోశ, హోటల్ సన్మాన్ వంటి చోట్ల వంట కోసం ఎలక్ట్రిక్ స్టీమర్లు , కట్టెల పొయ్యిలను వాడుతున్నారు. బసవగౌడ మిలిటరీ హోటల్ వంటి నాన్-వెజ్ హోటళ్లు బిర్యానీ వండటానికి ఇప్పుడు పాతకాలం నాటి కట్టెల పొయ్యిలనే వాడుతున్నాయి. గ్యాస్ కొరత వల్ల ఇలాంటి మార్పులు చేసుకోవడం తప్పనిసరి అని యజమానులు వాపోతున్నారు.
హోటల్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం
హోటల్ యజమానుల సంఘం ప్రతినిధుల ప్రకారం, నిర్వహణ ఖర్చులు దాదాపు 10 నుంచి 15 శాతం వరకు పెరిగాయి. కేవలం గ్యాస్ మాత్రమే కాదు, కరెంటు బిల్లులు, వాటర్ ఛార్జీలు కూడా పెరగడం హోటల్ నిర్వహణను కష్టతరం చేస్తోంది. నూనె, పప్పు ధాన్యాల ధరలు కూడా ఆకాశాన్ని తాకడంతో, ధరలు పెంచకపోతే హోటల్ మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వినియోగదారుల పరిస్థితి
మధ్యతరగతి ఉద్యోగులు, బ్యాచిలర్లు , రోజూ బయట తినే వారు ఈ ధరల పెంపుతో ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ, ఇతర నగరాలతో పోలిస్తే బెంగళూరు (Bengaluru) లో తిండి ధరలు పెరిగినప్పటికీ తప్పని పరిస్థితిలో భరిస్తున్నామని కస్టమర్లు అంటున్నారు. ఆయిల్ కంపెనీలు సరఫరాలో ఇబ్బంది లేదని చెప్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం చిన్న హోటళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.
మొత్తానికి బెంగళూరులోని హోటల్ పరిశ్రమ ఇప్పుడు ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పెరిగిన గ్యాస్ ధరలు, కరెంటు బిల్లులతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా తోడవ్వడంతో హోటల్ యజమానులు తమ మనుగడ కోసం కస్టమర్లపై భారాన్ని వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు హోటల్ నిర్వహణ గడ్డుకాలంగా మారగా, మరోవైపు సామాన్య మధ్యతరగతి ప్రజలు తమ నెలవారీ ఖర్చులను ఎలా సర్దుబాటు చేసుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వం లేదా చమురు కంపెనీలు తక్షణమే స్పందించి గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించకపోతే, రాబోయే రోజుల్లో సామాన్యుడు బయట హోటల్‌లో భోజనం చేయడం ఒక కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.


Click it and Unblock the Notifications