బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలకు చెక్..అయిదేళ్ల తర్వాత హోసకెరేహళ్లి ఫ్లైఓవర్ అందుబాటులోకి..
బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న హోసకెరేహళ్లి ఫ్లైఓవర్ చివరకు పూర్తి దశకు చేరుకుంది. ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై ఐదేళ్లుగా కొనసాగుతున్న ఈ ప్రాజెక్ట్ నవంబర్ మధ్యనాటికి ప్రజల వినియోగానికి సిద్ధం కానుందని అధికారులు ధృవీకరించారు. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే జంక్షన్లలో ఒకటైన PES కాలేజ్ ప్రాంతం వద్ద ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే..రవాణా సౌకర్యాలకు పెద్ద ఊరట లభించనుంది.
500 మీటర్ల పొడవైన ఈ ఫ్లైఓవర్ నిర్మాణం మొదట 2020లో ప్రారంభమైంది. అయితే నిధుల కొరత, కాంట్రాక్టర్ల మార్పులు, నిరంతర వర్షాల కారణంగా పనులు అనేకసార్లు నిలిచిపోయాయి. ఇప్పుడు, గ్రేటర్ Bengaluru అథారిటీ (GBA) ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి 15 రోజుల గడువు నిర్ణయించింది. పట్టణాభివృద్ధి అదనపు ప్రధాన కార్యదర్శి తుషార్ గిరి నాథ్ PES కళాశాల సమీపంలో ప్రాజెక్టు స్థలాన్ని పరిశీలించి, కాంట్రాక్టర్లను రాబోయే 15 రోజుల్లో అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

ఆయన మాట్లాడుతూ.. నిర్మాణంలో చివరి దశకు చేరుకున్నాం. వర్షాల కారణంగా ఆలస్యం జరిగింది కానీ ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోయాయని పేర్కొన్నారు.బీబీఎంపీ చీఫ్ కమిషనర్ మహేశ్వర్ రావు కూడా కాంట్రాక్టర్లకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు. ఫ్లైఓవర్ రెండువైపులా దెబ్బతిన్న సర్వీస్ రోడ్లను మరమ్మతు చేయడం, అలాగే నిర్మాణం పూర్తయిన తర్వాత శిధిలాల తొలగింపు, వ్యర్థాల పారవేత తప్పనిసరిగా చేయాలని ఆయన ఆదేశించారు.
ఈ ఫ్లైఓవర్ ప్రారంభమైన తర్వాత PES కాలేజ్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం ఓఆర్‌ఆర్‌లో ప్రధాన ట్రాఫిక్ బాటిల్‌నెక్‌గా ఉంది, ముఖ్యంగా పీక్ అవర్స్‌లో వందలాది వాహనాలు నిలిచిపోతున్నాయి. హోసకెరేహళ్లి ఫ్లైఓవర్ ప్రారంభం తర్వాత.. మైసూరు రోడ్ - బనశంకరి - రాజరాజేశ్వరి నగర్ మార్గాలపై ప్రయాణించే వాహనదారులకు స్పష్టమైన ఉపశమనం లభించనుంది. ట్రాఫిక్ సమయం 25 శాతం వరకు తగ్గుతుందని ట్రాఫిక్ పోలీసులు అంచనా వేస్తున్నారు.
కర్ణాటక ప్రభుత్వం ఇటీవల డబుల్ డెక్కర్ వైయడక్ట్ ప్రాజెక్ట్‌ను ఆమోదించింది, ఇది బెంగళూరులోని మెట్రో ఫేజ్-3 పనులకు మార్గం సుగమం చేసింది. ఈ ప్రాజెక్ట్ కింద బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) రెండు ప్రధాన కారిడార్లలో ఎలివేటెడ్ మెట్రో లైన్లు, ఫ్లైఓవర్లను నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 28.5 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ నగరంలోనే అతి పొడవైనదిగా రికార్డు సృష్టించనుంది.
ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్లైఓవర్ల ఖర్చు కిందివిధంగా పంచబడుతుంది. 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం నుండి, 10 శాతం స్థానిక పట్టణ సంస్థల నుండి, మిగతా 40 శాతం రుణాల ద్వారా సమకూర్చబడుతుంది.ఈ విధానం ప్రాజెక్ట్‌లను వేగవంతంగా పూర్తి చేయడంలో సహాయపడుతుందని అధికారులు పేర్కొన్నారు. ఐదేళ్లుగా వాయిదా పడుతున్న హోసకెరేహళ్లి ఫ్లైఓవర్ ఇప్పుడు పూర్తికావడంతో, బెంగళూరులోని ఓఆర్‌ఆర్ మార్గంలో ట్రాఫిక్ భారం గణనీయంగా తగ్గనుంది. నవంబర్ మధ్యన ఈ ఫ్లైఓవర్ ప్రారంభమైతే, నగర రవాణా వ్యవస్థకు ఇది ఒక పెద్ద ఊతమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications