Bengaluru: నీటి కొరత, లిఫ్ట్ గొడవలు, కోతుల బెడద.. బెంగళూరు హోమ్ ఓనర్ లిస్ట్ చేసిన 17 నైట్‌మేర్స్!
సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితకాల కల. ముఖ్యంగా బెంగళూరు (Bengaluru) లాంటి మెట్రో సిటీలో ఒక ఐటీ ఉద్యోగి సొంతంగా ఫ్లాట్ కొన్నాడంటే సమాజంలో అదో పెద్ద సక్సెస్ కింద లెక్క. కానీ, ఆ కల కాస్తా కంటిమీద కునుకు లేకుండా చేసే కలగా మారితే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి చేదు అనుభవాన్నే ఎదుర్కొన్నాడు ఓ బెంగళూరు నివాసి. ఐటీ హబ్‌లో ఫ్లాట్ కొని ఏడాది పూర్తయిన సందర్భంగా, తను అనుభవించిన 17 ఘోరమైన సమస్యలను (Nightmares) సోషల్ మీడియా వేదికగా పంచుకోగా, అది కాస్తా ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
రూ.లక్షలు పెట్టి ఇల్లు కొన్నాక కూడా ప్రశాంతత కరువైందని, చివరకు ఇల్లు కొనడం అనేది ఒక "జీవితకాల ఆందోళనకు సబ్‌స్క్రిప్షన్" లాంటిదని సదరు యజమాని వాపోయాడు.

నీటి కొరత నుండి కోతుల బెడద వరకు.. ఆ 17 సమస్యలు ఏంటి?
దాదాపు 94 ఫ్లాట్లు ఉన్న ఒక పెద్ద మల్టీస్టోరీ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఇల్లు కొన్న ఈ ఓనర్, అక్కడ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఇలా లిస్ట్ చేశాడు..
- వాటర్ ట్యాంకర్ బిల్లుల గొడవలు: అపార్ట్‌మెంట్‌లో తీవ్రమైన నీటి కొరత ఉంది. కానీ, కొందరు నివాసితులు వాటర్ ట్యాంకర్ బిల్లులు కట్టడానికి నిరాకరిస్తున్నారు.
- ట్రాన్స్‌ఫార్మర్ ఖర్చులు: సొసైటీలో కొత్తగా రూ.5 లక్షల ఖర్చుతో ట్రాన్స్‌ఫార్మర్ వేయించాల్సి వస్తే, దానికి డబ్బులు ఇవ్వకుండా ఒకరిపై ఒకరు బ్లేమ్ గేమ్ ఆడుకుంటున్నారు.
- నాసిరకం ఇంటీరియర్ & గోడల చెమ్మ: పెద్ద పేరున్న ఇంటీరియర్ కంపెనీలకు లక్షలు ఇస్తే దారుణమైన వర్క్ ఇచ్చారని, అప్పుడే గోడలకు చెమ్మ (Dampness) చేరుతోందని పేర్కొన్నాడు.
- వింత మెయింటెనెన్స్ మైండ్‌సెట్: నెలకు కేవలం రూ.1,500 మెయింటెనెన్స్ ఫీజు కడుతూ, అపార్ట్‌మెంట్ మాత్రం లగ్జరీ ఫైవ్-స్టార్ రేంజ్‌లో మెయింటైన్ అవ్వాలని కొందరు కోరుకోవడం.
- ఇతర సమస్యలు: ఫ్లాట్ కొనే సమయంలో లంచాలు ఇవ్వాల్సి రావడం, కోతులు వచ్చి పైపులను పాడు చేయడం, లిఫ్ట్ ఇబ్బందులు వంటివి ఈ లిస్ట్‌లో ఉన్నాయి.
మెడకు తాడులా మారిన EMI భారం!
ఈ పోస్ట్‌లో ఆ ఓనర్ చెప్పిన ఒక మాట అందరినీ ఆలోచింపజేస్తోంది. "మనకు వచ్చే జీతంతో పోలిస్తే హోమ్ లోన్ ఈఎంఐ (EMI) చాలా తక్కువ మొత్తమే కావచ్చు, కానీ అది మెడ చుట్టూ లూజ్‌గా ఉన్న ఉరితాడు లాంటిది. బిగుతుగా లేకపోయినా.. మెడ చుట్టూ ఒక తాడు ఉందనే భయం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది" అని ఎమోషనల్ అయ్యాడు.
సోషల్ మీడియాలో వెల్లువెత్తిన స్పందనలు
ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "బ్రదర్.. మనమిద్దరం ఒకే సొసైటీలో ఉంటున్నామా ఏంటి? మా దగ్గర కూడా ఇదే పరిస్థితి" అని ఒకరు కామెంట్ చేయగా.. "భారతదేశంలో బిల్డర్లు, సొసైటీల తప్పులను మనం 'చల్తా హై' (సర్దుకుపోవడం) అని వదిలేయడం వల్లే ఈ అన్యాయాలు జరుగుతున్నాయి. అదే వెస్ట్రన్ దేశాల్లో అయితే ఇలాంటి నాసిరకం పనులకు బిల్డర్లపై కోర్టుల్లో కేసులు వేసి కోట్లలో నష్టపరిహారం లాగుతారు" అని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరు (Bengaluru) లో ఇల్లు కొనాలనుకునే వారు కేవలం లొకేషన్ మాత్రమే కాదు.. ఇలాంటి ప్రాక్టికల్ సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఈ ఘటన నిరూపిస్తోంది.


Click it and Unblock the Notifications