gold: గోల్డ్, సిల్వర్ అని టైం వేస్ట్ చేయకండి! దీని మీద ఫోకస్ పెట్టండి! సీఈవో షాకింగ్ అడ్వైజ్!
ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యుల నుంచి ఇన్వెస్టర్ల వరకు అందరూ పసిడి కొనుగోలుపైనే దృష్టి పెడుతున్నారు. అయితే, బెంగళూరు (Bengaluru) కు చెందిన ప్రముఖ ఆప్షన్స్ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్ 'సెన్సిబుల్' (Sensibull) వ్యవస్థాపకుడు అబిద్ హసన్ మాత్రం యువతకు ఒక విభిన్నమైన సలహా ఇచ్చారు. బంగారం (gold), వెండి(silver) వంటి లోహాల ధరల పెరుగుదల గురించి ఆందోళన చెందడం ఆపి, మీ నైపుణ్యాలను (Upskilling) పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.

సొంత అనుభవంతో అబిద్ హసన్ విశ్లేషణ
అబిద్ హసన్ తన వ్యక్తిగత జీవితంలోని ఒక సంఘటనను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 2000 సంవత్సరంలో ఆయన 10వ తరగతిలో ప్రతిభ కనబరిచినందుకు 8 గ్రాముల బంగారు పతకాన్ని బహుమతిగా పొందారు. అప్పట్లో ఆ బంగారం విలువ కేవలం రూ. 4,000 మాత్రమే. కానీ, నేడు 2026లో ఆ 8 గ్రాముల బంగారం(gold) విలువ దాదాపు రూ. 1.2 లక్షలకు చేరుకుంది. అయితే, అబిద్ అప్పట్లోనే ఆ మెడల్ ను అమ్మేసి వచ్చిన డబ్బుతో ఎంట్రన్స్ ఎగ్జామ్ కోచింగ్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన NIT కాలికట్ నుండి BTech, IIM అహ్మదాబాద్ నుండి మేనేజ్‌మెంట్ డిగ్రీని పూర్తి చేశారు.
బంగారం కంటే విద్యే గొప్పది
నేడు వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఆ గోల్డ్ మెడల్ అమ్మినందుకు తనకు ఎలాంటి బాధ లేదని ఆయన స్పష్టం చేశారు. "ఆ పతకం విలువ 4 వేల నుండి 1.2 లక్షలకు పెరిగి ఉండవచ్చు. కానీ, ఆ కోచింగ్ ద్వారా నేను సంపాదించిన జ్ఞానం, కెరీర్ దానికంటే ఎన్నో రెట్లు విలువైనవి" అని ఆయన పేర్కొన్నారు. ఐటీ, టెక్, స్టార్టప్ రంగాల్లో రాణించాలనుకునే యువతకు ఇది ఒక గొప్ప పాఠం. సంపద అనేది కేవలం వస్తువుల రూపంలోనే ఉండదు, మన నైపుణ్యాల రూపంలో కూడా ఉంటుందని ఆయన వివరించారు.
సోషల్ మీడియా రెస్పాన్స్ ఇలా..
అబిద్ హసన్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. చాలా మంది ఆయన వాదనతో ఏకీభవిస్తున్నారు. "ద్రవ్యోల్బణాన్ని (Inflation) ఎదుర్కోవడానికి నైపుణ్యం అనేది ఒక బలమైన కవచం" అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఆస్తులు కాలక్రమేణా పెరుగుతాయి. కానీ, నైపుణ్యాలు మనిషి జీవిత గమనాన్ని మార్చేస్తాయి. అయితే కొందరు మాత్రం నైపుణ్యం సంపాదించిన ప్రతి ఒక్కరూ అబిద్ అంతటి విజయం సాధించలేరని, కాబట్టి బంగారం వంటి ఆస్తుల సేకరణ కూడా ముఖ్యమేనని అభిప్రాయపడుతున్నారు.
యువత ఏం చేయాలి?
పెరుగుతున్న మార్కెట్ ధరలను చూసి ఫోమో (FOMO - Fear of Missing Out) లో పడవద్దని అబిద్ హసన్ సూచిస్తున్నారు. "ఈ బంగారం, వెండి గొడవను వదిలేసి, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, కొత్త వాటిని నిర్మించడంపై దృష్టి పెట్టండి" అని ఆయన గట్టిగా చెప్పారు. ముఖ్యంగా ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల్లో మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే టెక్నాలజీ, పర్సనల్ స్కిల్స్ మీద ఇన్వెస్ట్ చేయడం కంటే మించిన లాభదాయకమైన పెట్టుబడి మరొకటి లేదని ఆయన మాటల సారాంశం.


Click it and Unblock the Notifications