భారతదేశ ఐటీ రాజధాని సిలికాన్ సిటీ బెంగళూరులో ఇల్లు అద్దెకు తీసుకోవాలంటే సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. వచ్చిన జీతమంతా ఇంటి అద్దెకే పెట్టాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.తాజాగా బెంగళూరులో ఒక 2BHK ఫ్లాట్ నెలకు రూ. 70 వేల అద్దెతో పాటు రూ. 5 లక్షల డిపాజిట్ ఓనర్ అడిగిన వార్త సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. తూర్పు బెంగళూరులోని పణత్తూరు ప్రాంతంలో ఉన్న ఈ అపార్ట్‌మెంట్‌ను ఒక యజమాని ప్రీమియం లివింగ్‌కి ఉదాహరణగా చూపిస్తూ అద్దెకు పెట్టారు. అయితే నెటిజన్లు మాత్రం ఇది మితిమీరిన రేటు అని, యూరప్‌లో కూడా ఇంత ఖరీదైన అద్దెలు లేవని చర్చకు తెరలేపారు.
సాధారణంగా ముంబై, ఢిల్లీ అద్దెలతో పోలిస్తే బెంగళూరును కొంత చవకైన మార్కెట్‌గా పరిగణించేవారు. అయితే మహమ్మారి తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఐటీ ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు రావడం.. టెక్ హబ్‌ల దగ్గర గృహాల డిమాండ్ పెరగడంతో పాటుగా కొత్తగా నిర్మాణాలు తగ్గిపోవడం వంటి అంశాలు నగరంలో అద్దెలను విపరీతంగా పెంచేశాయి. అందుకే చాలా మంది ఇప్పుడు బెంగళూరు ముంబై కంటే భిన్నంగా లేదని వ్యాఖ్యానిస్తున్నారు.

తాజాగా సోషల్ మీడియాలో చర్చకు దారి తీసిన పోస్ట్ ప్రకారం.. అద్దెకు పెట్టిన ఫ్లాట్ విస్తీర్ణం 1,205 చదరపు అడుగులు మాత్రమే. అయినప్పటికీ యజమాని ఖరీదైన ఫర్నిషింగ్ కారణంగా అద్దెను రెట్టింపు చేసినట్లు కనిపిస్తోంది. ఒక Reddit వినియోగదారు ఇదే డబ్బుతో EMI చెల్లిస్తే దాదాపు రూ.80 లక్షల రుణంతో ఇల్లు కొనవచ్చు. రూ. 70 వేలు అద్దె చెల్లించడంలో అసలు ప్రయోజనం లేదని పేర్కొన్నారు. మరొక నెటిజన్ ఇక్కడ సాధారణంగా 2BHKలకు రూ.45 వేల కంటే ఎక్కువ అద్దె చెబితే అది కూడా చాలా ఎక్కువే. ఇప్పుడు రూ. 70 వేలు అంటే పూర్తిగా దారుణమని అన్నారు.
మహమ్మారి ముందు.. 2019లో గేటెడ్ కమ్యూనిటీలలోని 2BHK ఫ్లాట్‌లు నెలకు రూ. 25 వేలనుంచి రూ. 30 వేల మధ్యనే దొరికేవి. ఇప్పుడు అదే ఇళ్లకు రూ. 45 వేల నుంచి రూ. 55 వేల మధ్య అడుగుతున్నారు. ప్రీమియం ప్రాజెక్టులలో అయితే ఇంకా ఎక్కువ రేట్లు ఉన్నాయని డేటా చెబుతోంది. కొంతమంది యజమానులు ఇలా ఎక్కువ ధరలు అడగడం మొదలుపెడితే.. దానిని కొత్త ప్రమాణంగా ఇతర యజమానులు కూడా అనుసరించే అవకాశం ఉందని అద్దెదారులు భయపడుతున్నారు.
ఇందిరానగర్, వైట్‌ఫీల్డ్, సర్జాపూర్ వంటి ప్రధాన ఐటీ హబ్‌ల దగ్గర అద్దెలు 40 శాతం నుంచి 50 శాతం వరకు పెరిగిన ఉదాహరణలు ఉన్నాయి. మార్కెట్ నిపుణుల ప్రకారం, ప్రస్తుతం కొన్ని 4BHK ఫ్లాట్‌లు నెలకు రూ. 2 లక్షల వరకు అద్దెను చూస్తున్నాయి. రియల్ ఎస్టేట్ కంపెనీల ప్రకారం.. లక్ష రూపాయలకు మించి అద్దె ఒప్పందాలు ఇప్పుడు కొత్త సాధారణంగా మారుతున్నాయి.
రియాల్టీ ఇండస్ట్రీ విశ్లేషకులు చెబుతున్న వివరాల ప్రకారం.. Bengaluru లో ఇంత భారీ అద్దె చెల్లించటం కంటే EMIతో ఇల్లు కొనడం బెటర్. ఎందుకంటే అద్దె దిగుబడి (rent yield) ఇంకా ఆస్తి ధరలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. అద్దెకు తీసుకున్నవారు ఆస్తి యజమానులకు లాభం చేకూరుస్తున్నా, తామే ఎక్కువ ఖర్చు చేస్తున్నట్టే అవుతుందని చెబుతున్నారు. బెంగళూరు వేగంగా పెరుగుతున్న నగరం కావడం..సరైన గృహాల సరఫరా లేకపోవడంతో పాటుగా.. ఐటీ ఉద్యోగుల డిమాండ్ ఎక్కువ కావడం వల్ల అద్దెలు మరింత పెరిగే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే చాలా మంది మధ్య తరగతి కుటుంబాలు ఈ ధరలకు అద్దె ఇళ్లలో ఉండటం కష్టమని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications