బెంగుళూరులో ఇంటికి OC అవసరం లేదు.. కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం
కర్ణాటక ప్రభుత్వం గృహనిర్మాణదారులకు పెద్ద ఊరటనిచ్చే వార్తను అందించింది. ఇకపై కర్ణాటకలో 3 అంతస్తుల భవనాలకు OC మినహాయింపు ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (UDD) తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకలో 1,200 చదరపు అడుగుల స్థలంలో నిర్మించే మూడు అంతస్తుల భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (OC) తప్పనిసరి కాదు.
సిధ్దరామయ్య సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చిన్న చిన్న గృహనిర్మాణదారులకు భారీ ఉపశమనం కలిగించనుంది. ఇప్పటివరకు రియల్ ఎస్టేల్ యజమానులు భవన నిర్మాణం పూర్తయిన తర్వాత OC పొందడం కోసం అనుమతులు, పత్రాలు, ఫీజులు చెల్లించాల్సి ఉండేది. దాని కోసం కాళ్లు అరిగేలా ఆఫీసులు చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ భాద పోయింది. కర్ణాటక ప్రభుత్వం తాజాగా ఈ నిబంధనను సడలించడం వల్ల గృహ యజమానులకు నివాసాలు నిర్మించడం మరింత సులభతరం కానుంది.

రాష్ట్ర అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (UDD) నిబంధనలు ఏంటంటే.. భూమి పరిమాణం గరిష్టంగా 1,200 చదరపు అడుగులు ఉండాలి. ఇక నిర్మాణం అయిన బిల్డింగ్ లు అయితే గ్రౌండ్ ఫ్లోర్ + రెండు అంతస్తులు లేదా స్టిల్ట్ + మూడు అంతస్తులు వరకు ఉండాలి. అయితే నివాస భవనాలకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది.
ఈ తాజా నిర్ణయం కోసం గ్రేటర్ బెంగళూరు గవర్నెన్స్ చట్టం 2024, కర్ణాటక మున్సిపల్ కార్పొరేషన్స్ చట్టం 1976, గ్రామీణాభివృద్ధి శాఖ బిల్డింగ్ బై-లాజ్‌లలో పలు సవరణలు ప్రతిపాదించనుంది సిద్ధరామయ్య ప్రభుత్వం. ఈ విషయమై అదనపు ప్రధాన కార్యదర్శి తుషార్ గిరినాథ్ అధ్యక్షతన నేడు కీలక సమావేశం జరిగింది.
కర్ణాటక రాష్ట్రంలో OC పొందే ప్రక్రియ కఠినతరం కావడంతో చిన్న స్థాయి గృహ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి నిర్మాణం అనుమతుల కోసం ఆలస్యం కావడం, అధికారుల లంచాలు, అదనపు వ్యయాలు భారం వంటి సమస్యలు వారిని వెంటాడుతున్నాయి. ఈ సవరణ వల్ల ఆ సమస్యలన్నీ తగ్గిపోనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణరంగం వేగం పుంజుకోనుంది.
ఈ నిర్ణయంతో Bengaluru నగరంలో చిన్న స్థాయి గృహ యజమానులకు సమయంతో పాటుగా డబ్బు కూడా ఆదా కానుంది. అలాగే రియల్ ఎస్టేట్ మార్కెట్లో చిన్న గృహాలకు డిమాండ్ పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఏదేమైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చిన్న స్థాయి గృహనిర్మాణ రంగానికి ఊపునివ్వనుంది. ముఖ్యంగా బెంగళూరు వంటి నగరాల్లో 30x40 స్థలాలపై గృహ నిర్మాణం చేస్తున్న వారికి ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications