Bengaluru: జీతం ఎంత వచ్చినా చాలట్లేదు.. బెంగళూరులో బతకడం ఇంత ఖరీదా? వైరల్ అవుతున్న పోస్ట్!
ప్రస్తుత రోజుల్లో యుద్ధాలు, ద్రవ్యోల్బణం వల్ల సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. పెట్రోల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతుంటే, పొదుపు చేయడం అనేది ఒక కలగా మారుతోంది. తాజాగా ఐటీ హబ్ బెంగళూరు (Bengaluru) లో ఉంటున్న ఒక దంపతుల నెలవారీ ఖర్చుల చిట్టా సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. నెలకు ఏకంగా రూ. 1,30,000 ఖర్చవుతోందని వారు షేర్ చేసిన వివరాలు చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
ఆ లక్షా ముప్పై వేలు ఎక్కడికి వెళ్తున్నాయి?
రాధిక, ఏకాంశ్ అనే ఇద్దరు ప్రొడక్ట్ మేనేజర్లుగా పనిచేస్తూ, ఖాళీ సమయంలో కంటెంట్ క్రియేట్ చేస్తుంటారు. వారు షేర్ చేసిన లెక్కల ప్రకారం.. నెలకు కేవలం అద్దెకే రూ. 56,000 కడుతున్నారు. ఇక కరెంట్, ఇంటర్నెట్ బిల్లులు రూ. 15,000 అవుతుండగా, సబ్‌స్క్రిప్షన్లకే రూ. 3,000 ఖర్చు చేస్తున్నారు.

వారి ఖర్చుల చిట్టా ఇలా ఉంది..
- గ్రోసరీస్ (నిత్యావసరాలు): రూ. 15,000
- బయట తినడం (Dining out): రూ. 10,000
- షాపింగ్: రూ. 15,000
- ప్రయాణం (Commute): రూ. 6,000
- పనిమనిషి జీతం: రూ. 10,000
వీటన్నిటికీ తోడు వెకేషన్లు, లగ్జరీ వస్తువుల ఖర్చులు కలపకుండానే నెలకు రూ. 1.30 లక్షలు ఖర్చవుతోందని వారు వాపోతున్నారు.
ఐటీ సిటీలో పొదుపు సాధ్యమేనా?
"బెంగళూరులో జీతాలు ఎక్కువగా ఉండవచ్చు, కానీ జీవన వ్యయం కూడా అంతే స్థాయిలో ఉంది. డబ్బు దాచుకోవడం ఇప్పుడు మునుపటి కంటే చాలా కష్టమైపోయింది" అని నళిని అనే యూజర్ ఎక్స్‌లో ఈ వివరాలను పంచుకున్నారు. ఈ పోస్ట్ చూసిన మరికొందరు టెక్కీలు కూడా తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఏటా రూ. 1 కోటి సంపాదించే ఒక వ్యక్తి కూడా.. పెరుగుతున్న ఖర్చుల వల్ల పిల్లల్ని కనడానికి భయపడుతున్నానని చెప్పడం ఈ కాలపు ఆర్థిక ఇబ్బందులకు అద్దం పడుతోంది.
నెటిజన్ల విమర్శలు: ఇది లగ్జరీనా? అవసరమా?
అయితే ఈ ఖర్చులపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది బెంగళూరు ఖర్చు కాదు, వారి 'తప్పుడు ఆర్థిక నిర్ణయాల' ఫలితం అని చాలా మంది విమర్శిస్తున్నారు. "రూ. 800 కే ఇంటర్నెట్ వస్తుంటే, వీరికి రూ. 15,000 కరెంట్, నెట్ బిల్లు ఎలా వస్తోంది?" అని కొందరు ప్రశ్నిస్తుంటే.. "నెలకు రూ. 10 వేలు బయట తిండికి, రూ. 15 వేలు షాపింగ్‌కు పెట్టడం లగ్జరీ కాక ఇంకేంటి?" అని మరికొందరు మండిపడుతున్నారు.
నిజమే, టియర్-1 నగరాల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయన్నది వాస్తవమే అయినా, బడ్జెట్ ప్లానింగ్ సరిగ్గా లేకపోతే ఎంత జీతం వచ్చినా నెల ఆఖరికి చేతిలో రూపాయి మిగలదన్నది ఈ బెంగళూరు (Bengaluru) దంపతుల ఉదంతం నిరూపిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఇటీవల 'పొదుపు' ప్రాధాన్యత గురించి మాట్లాడటం, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఎంత అవసరమో ఈ వైరల్ వార్త చూస్తుంటే అర్థమవుతోంది.


Click it and Unblock the Notifications