బెంగళూరులో రూ.19 వేలకే 2BHK ఫ్లాటా? ఇదెక్కడి వింత అంటున్న సామాన్యులు!
ఐటీ హబ్ బెంగళూరు (Bengaluru) అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆకాశాన్ని తాకే ఇండ్ల అద్దెలు, భారీ ఖర్చులు. అక్కడ సామాన్యుడు బ్రతకడం చాలా కష్టం అనే టాక్ ఉంది. కానీ, ఒక 22 ఏళ్ల కార్పొరేట్ ఉద్యోగి షేర్ చేసిన తన నెలవారీ ఖర్చుల వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చకు దారితీశాయి. సనికా కుల్కర్ణి అనే యువతి ఇన్స్టాగ్రామ్‌లో "నేను బెంగళూరులో బ్రతకడానికి ఎంత ఖర్చు పెడుతున్నాను" అంటూ పెట్టిన పోస్ట్ నెటిజన్ల మైండ్ బ్లాక్ చేస్తోంది. ఆమె నెలకు కేవలం రూ.43,000 లతోనే సిటీలో దర్జాగా బ్రతికేస్తోందట!
అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆమె నెలవారీ బడ్జెట్‌లో కరెంట్ బిల్లు అక్షరాలా సున్నా రూపాయలు! "ప్రభుత్వ పథకం (గృహ జ్యోతి) భలే పనిచేస్తోంది, అందుకే కరెంట్ బిల్లు రూ.0 వచ్చింది, నేనేం ఫిర్యాదు చేయడం లేదు" అంటూ ఆమె క్యాప్షన్ పెట్టింది.

బడ్జెట్ లెక్కలు ఇవే.. ఎలా ప్లాన్ చేసిందంటే?
ఆమె షేర్ చేసిన వివరాల ప్రకారం ఖర్చులు ఇలా ఉన్నాయి..
- ఇంటి అద్దె: మంచి లొకేషన్‌లో ఒక షేర్డ్ 2BHK ఫ్లాట్‌లో ఉంటోంది. ఆ ఫ్లాట్ మొత్తం రెంట్ రూ.38,000 కాగా, ఈమె వాటా కింద రూ.19,000 కడుతోంది.
- పనిమనిషి & కిరాణా (Groceries): ఈమె, తన సోదరి కలిసి రూ.7,000 ఖర్చు చేస్తున్నారు. పనిమనిషి రాని రోజుల్లో తానే స్వయంగా వంట చేసుకుని ఖర్చు తగ్గిస్తానని చెప్పింది.
- రవాణా ఖర్చులు: ఆటో ప్రయాణాల కోసం నెలకు రూ.7,000 అవుతోంది. పెట్రోల్ ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చు మునుపటి కంటే ఎక్కువైందని వాపోయింది.
- రెస్టారెంట్లు & కేఫ్‌లు: బెంగళూరులో మంచి మంచి కేఫ్‌లు ఎక్కువగా ఉండటంతో బయట తినడానికి నెలకు రూ.5,000 ఖర్చు పెడుతోంది.
- షాపింగ్ & సొంతూరికి ప్రయాణం: దీనికోసం మరో రూ.5,000 కేటాయించింది.
ఇంటర్నెట్ ప్రశ్న.. 'ఇది ఏ బెంగళూరు బాస్?'
ఈ పోస్ట్ కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చాలా మందికి ఈ లెక్కలు అస్సలు నమ్మశక్యంగా అనిపించడం లేదు. "ఒక్కసారి బయటికి వెళ్లి తింటేనే రూ.10,000 బిల్లు అవుతుంది.. అలాంటిది నెల మొత్తానికి రూ.5,000 ఎలా సరిపోతుంది?" అని ఒకరు ప్రశ్నించారు.
మరికొందరైతే అసలు రూ.19,000 లకే 2BHK ఫ్లాట్ ఏ ఏరియాలో దొరుకుతుందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. "పనిమనిషి, గ్రాసరీస్ కలిపి 7 వేలేనా? షాపింగ్, ఊరెళ్లడం కలిపి 5 వేలా? నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నీకు బెంగళూరు లో బ్రతకడానికి ఏదో సీక్రెట్ కోడ్ తెలిసి ఉంటుంది" అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఈ రోజుల్లో బెంగళూరు (Bengaluru) లాంటి మెట్రో సిటీలో నెలకు రూ.43,000 తో మేనేజ్ చేయడం అంటే నిజంగా గొప్ప విషయమే. లొకేషన్ ఎంపిక, ప్రభుత్వ పథకాలను వాడుకోవడం, అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా బడ్జెట్‌ను కంట్రోల్‌లో ఉంచవచ్చని ఈ యువతి నిరూపించింది. అయితే, అందరికీ ఇలాంటి లైఫ్ స్టైల్ వర్తించకపోవచ్చు, అందుకే సోషల్ మీడియాలో దీనిపై ఇంతలా చర్చ జరుగుతోంది.


Click it and Unblock the Notifications