నెట్టింట సెన్సేషన్‌గా మారిన బెంగళూరు సీఈఓ పోస్ట్! ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' పై జరుగుతున్న ఆసక్తికర చర్చ!
ఇటీవల బెంగళూరు(bengaluru)కు చెందిన 'అఫ్లాగ్' (Aflog) సంస్థ సీఈఓ రోహిత్ ష్రాఫ్ లింక్డ్‌ఇన్ లో పెట్టిన ఒక పోస్ట్ పారిశ్రామిక వర్గాల్లో పెద్ద దుమారాన్నే లేపింది. "భారత్‌లో వ్యాపారాన్ని నిర్మించాలనే కల ఇక చాలు.. 2026 నాటికి నేను విదేశాలకు వెళ్లిపోతాను" అని ఆయన చేసిన ప్రకటన 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' (Ease of Doing Business) పై మళ్ళీ కొత్త చర్చకు దారితీసింది. ఇది కేవలం ఒక వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కాకుండా.. నేటి తరం వ్యాపారవేత్తలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పన్నుల భారం.. అనుమానపు చూపులు!
రోహిత్ తన పోస్ట్ లో ప్రధానంగా పన్నుల విధానంపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. గడిచిన 12 నుండి 18 నెలల్లో తన వ్యాపారాల ద్వారా సుమారు రూ.4 కోట్ల రూపాయలను జీఎస్టీ (GST), ఆదాయపు పన్ను రూపంలో చెల్లించానని ఆయన తెలిపారు. అయినప్పటికీ.. వ్యవస్థ నిజాయితీగా పన్నులు కట్టే వారిని ప్రోత్సహించాల్సింది పోయి పదేపదే నోటీసులు పంపుతూ వారిని అనుమానంతో చూడటం సరికాదని ఆయన పేర్కొన్నారు. కేవలం 4-5 శాతం మంది మాత్రమే ఆదాయపు పన్ను కడుతున్న దేశంలో మళ్ళీ మళ్ళీ వారిపైనే ఒత్తిడి తీసుకురావడం వ్యవస్థలోని లోపమని ఆయన విశ్లేషించారు.
వ్యవస్థాపక సవాళ్లు.. నిపుణుల విశ్లేషణ
వ్యాపారవేత్తలు తమ వ్యాపార వృద్ధిపై దృష్టి పెట్టాల్సింది పోయి రోజువారీ కంప్లయన్సెస్ (నియమ నిబంధనలు), ఆడిట్లు, అధికారుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోవడానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందని ఆయన వాపోయారు. వ్యవస్థలోని ఈ సంక్లిష్టత వల్ల చాలా మంది స్టార్టప్ ఫౌండర్లు తమ ప్రధాన కార్యాలయాలను (Headquarters) విదేశాలకు మార్చడానికి లేదా భారత్ వదిలి వెళ్లడానికి మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల దేశం విలువైన టాలెంట్ ను, ట్యాక్స్ రెవెన్యూను కోల్పోయే ప్రమాదం ఉందని పారిశ్రామికవేత్తలు హెచ్చరిస్తున్నారు.
నెటిజన్ల రియాక్షన్
రోహిత్ పోస్ట్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. కొంతమంది ఈ పోస్ట్ కు మద్దతుగా మాట్లాడుతున్నారు. "నిజాయితీగా ట్యాక్స్ కట్టే మధ్యతరగతి, వ్యవస్థీకృత రంగాలను టార్గెట్ చేయడం సులభం కాబట్టి అధికారులు వారిపైనే పడుతున్నారు. ఇది మారాలి" అని కొందరు ఫౌండర్లు మద్దతు తెలిపారు.
ఇక మరికొందరు వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. "నిబంధనలు అందరికీ వర్తిస్తాయి. వాటిని వేధింపులుగా చూడకూడదు. దేశం ఎదుగుతున్న తరుణంలో ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదు" అని విమర్శించారు.
ఇకపోతే కొందరు నిపుణులు.. రోహిత్ ష్రాఫ్ వ్యాఖ్యలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినవి కాకుండా వ్యవస్థలో మార్పు కోరుతూ చేసినవిగా చూడాలి అని అభిప్రాయపడుతున్నారు.
పరిష్కారం ఏది?
ఏదేమైనా భారతదేశం 'బిలియన్ డాలర్ ఎకానమీ'గా ఎదగాలంటే.. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టే వారికి స్నేహపూర్వక వాతావరణం కల్పించడం చాలా అవసరం. నిబంధనలను సరళతరం చేయడం, డిజిటల్ పద్ధతిలో విచారణలను ముగించడం వంటి చర్యల ద్వారా మాత్రమే పారిశ్రామికవేత్తల్లో భరోసా నింపగలమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications