Bengaluru: బిజినెస్ చేయాలని ఉన్నా ధైర్యం సరిపోవట్లేదా? మీరు కూడా ఈ ట్రాప్‌లో ఉన్నారేమో చూసుకోండి!
సొంతంగా ఒక వ్యాపారం ప్రారంభించాలనేది ప్రతి ఉద్యోగికి ఉండే కల. కానీ, ఆ కల నిజం చేసుకునే లోపే చాలా మంది రిటైర్మెంట్ వయసుకు వచ్చేస్తారు. దీనికి కారణం ఐడియా లేకపోవడం కాదు.. డబ్బు లేకపోవడం అంతకంటే కాదు. మరి ఇంకేంటి? దీనినే 'కంఫర్ట్ ట్రాప్' (Comfort Trap) అని పిలుస్తున్నారు బెంగళూరు (Bengaluru) కు చెందిన ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ మీనల్ గోయల్. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

ఏంటి ఈ 'కంఫర్ట్ ట్రాప్'?
చాలా మంది ఉద్యోగులు బిజినెస్ ప్రారంభించడానికి ఒక టార్గెట్ పెట్టుకుంటారు. "నా దగ్గర పది లక్షల సేవింగ్స్ ఉండాలి" అని మొదలు పెడతారు. కానీ, జీతం పెరిగే కొద్దీ ఆ టార్గెట్ కూడా పెరుగుతుంది.
- మొదటి ఏడాది: 10 లక్షలు సేవింగ్స్ కావాలి అంటారు.
- రెండో ఏడాది: జీతం పెరగగానే.. "ఇంకో ఐదు లక్షలు ఉంటే సేఫ్" అని టార్గెట్ ను 15 లక్షలు చేస్తారు.
- మూడో ఏడాది: ప్రమోషన్ వస్తుంది, కార్ లోన్ తీసుకుంటారు. ఇప్పుడు "ఈఎంఐలు ఉన్నాయి.. ఉద్యోగం వదలలేను" అని వాయిదా వేస్తారు.
- ఐదో ఏడాది: పెళ్లి, పిల్లలు.. ఇక "బిజినెస్ రిటైర్మెంట్ తర్వాతే" అని ఒక ముగింపు పలికేస్తారు.
ఈ గొలుసుకట్టు ఆలోచనలే 98 శాతం మంది ఎంటర్‌ప్రెన్యూర్ కలలను చంపేస్తున్నాయని మీనల్ తన లింక్డ్‌ఇన్ పోస్టులో పేర్కొన్నారు.
జీతం పెరిగితే బిజినెస్ చేయడం కష్టమే!
సాధారణంగా ఎక్కువ జీతం ఉంటే బిజినెస్ ఈజీగా చేయవచ్చు అనుకుంటాం. కానీ, మీనల్ అభిప్రాయం ప్రకారం.. నెలకు రూ. 5 లక్షలు సంపాదించే వ్యక్తి కంటే, రూ. 20 లక్షలు సంపాదించే వ్యక్తికే రిస్క్ తీసుకోవడం కష్టం. ఎందుకంటే ఆదాయం పెరిగే కొద్దీ మన జీవనశైలి (Lifestyle) కూడా ఖర్చులతో నిండిపోతుంది. బాధ్యతలు పెరుగుతాయి. పోగొట్టుకోవడానికి చాలా ఉంది అనే భయం మనల్ని వెనక్కి లాగుతుంది.
పీక్ శాలరీలో ఆమె ఎందుకు రిజైన్ చేశారు?
మీనల్ గోయల్ తన వ్యక్తిగత అనుభవాన్ని కూడా పంచుకున్నారు. ఆమె ఏడాదికి రూ. 28 లక్షల ప్యాకేజీ ఉన్న సమయంలో ఉద్యోగానికి రాజీనామా చేశారు. "నా దగ్గర 50 లక్షల సేవింగ్స్ ఉన్నాయని నేను రిజైన్ చేయలేదు. ఇంకొక్క ఏడాది కంఫర్ట్ జోన్‌లో ఉంటే, అది నా కలను ఇంకో ఏడాది వాయిదా వేస్తుందని నాకు అర్థమైంది" అని ఆమె చెప్పుకొచ్చారు.
స్టార్ట్ నౌ.. స్టార్ట్ స్మాల్
బిజినెస్ చేయడానికి సరైన సమయం అంటూ ఏదీ ఉండదు. మీరు ఎప్పుడు మొదలు పెట్టాలని నిర్ణయించుకుంటే అదే సరైన సమయం. సేవింగ్స్ టార్గెట్లు ఎప్పటికీ పెరుగుతూనే ఉంటాయి, భయానికి వంద కారణాలు దొరుకుతాయి. కానీ, మీరు ఇప్పుడే మొదలు పెట్టకపోతే.. ఐదేళ్ల తర్వాత కేవలం ఒక ఉద్యోగిగా మాత్రమే మిగిలిపోతారు. కాబట్టి, భయపడుతూనే మొదలు పెట్టండి.. చిన్నగా మొదలు పెట్టండి.. కానీ ఇప్పుడే మొదలు పెట్టండి. ఐదేళ్ల తర్వాత "నేను ప్రయత్నించాను" అని గర్వంగా చెప్పుకునేలా ఉండాలి తప్ప, "వచ్చే ఏడాది చేస్తా" అని ప్లానింగ్ లోనే ఉండిపోకూడదని ఆమె సలహా ఇచ్చారు.


Click it and Unblock the Notifications