Bengaluru: జీతం పెరగడం లేదా? ఈ యువతి ఫార్ములా ఫాలో అయితే జాక్‌పాట్ కొట్టినట్టే!
చాలామంది ప్రొఫెషనల్స్ మనసులో ఉండే అతిపెద్ద ప్రశ్న.. "మనం కష్టపడి పని చేస్తే దానికి తగ్గ ప్రతిఫలం వస్తుందా?" అని. రాత్రింబవళ్లు కష్టపడతాం, డెడ్‌లైన్లు మీట్ అవుతాం, అదనపు బాధ్యతలు తీసుకుంటాం.. తీరా ఇంక్రిమెంట్ టైమ్ వచ్చేసరికి ఆశించిన ఫలితం ఉండదు. అయితే బెంగళూరు (Bengaluru) కు చెందిన ఒక చార్టర్డ్ అకౌంటెంట్ (CA) షేర్ చేసిన తన 5 ఏళ్ల ప్రయాణం ఇప్పుడు ఇంటర్నెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 5 ఏళ్లలో తన జీతాన్ని రూ. 7 లక్షల నుండి రూ. 24 లక్షలకు ఎలా పెంచుకోవాలో ఆమె వివరించిన తీరు ప్రతి ఉద్యోగికి ఒక పాఠంలా మారింది.

మొదటి ఎదురుదెబ్బ, మొదటి అడుగు
ఆమె తన కెరీర్ ప్రారంభంలో రూ. 7 లక్షల జీతానికి చేరింది. ఆర్టికల్‌షిప్ తర్వాత కష్టపడి పనిచేసినా, మొదటి ఏడాది అప్రైజల్‌లో ఆమెకు ఒక్క రూపాయి కూడా పెరగలేదు. చాలామంది ఇక్కడే నిరాశ చెంది మౌనంగా ఉండిపోతారు. కానీ ఆమె అలా చేయలేదు. తన రెజ్యూమ్ అప్‌డేట్ చేసి, రెండో ఏడాదిలోనే కంపెనీ మారింది. ఆ ఒక్క నిర్ణయంతో ఆమె శాలరీ రూ. 9 లక్షలకు (29% పెరుగుదల) చేరింది.
మారితేనే మర్యాద.. మారకపోతే మూలకే!
మూడో ఏడాదిలో ఆమెకు ఉన్న కంపెనీలోనే 33% హైక్ రావడంతో జీతం రూ. 12 లక్షలకు చేరింది. అయితే నాలుగో ఏడాదిలో మళ్లీ కథ మొదటికి వచ్చింది.. కేవలం 8% పెరుగుదలతో రూ. 13 లక్షల వద్దే ఆగిపోయింది. గీత దాటని గ్రోత్ చూసి ఆమె మళ్లీ ధైర్యంగా మరో కంపెనీకి మారింది. ఫలితం షాకింగ్! ఏకంగా 84% జంప్‌తో ఐదో ఏడాదిలో ఆమె ప్యాకేజీ రూ. 24 లక్షలకు చేరుకుంది.
ఆమె చెప్పిన అసలైన సూత్రం
"కంపెనీ కోసం మీరు కష్టపడుతున్నప్పుడు, దానికి తగ్గ జీతం మీరు పొందాలి. మీకు తక్కువ జీతం ఇస్తున్నారనిపిస్తే నోరు విప్పి అడగండి. ఒకవేళ అక్కడ రాకపోతే కొత్త దారి వెతుక్కోండి" అని ఆమె స్పష్టంగా చెప్పింది. ఒకే కంపెనీలో ఏళ్ల తరబడి ఉంటే వచ్చే వార్షిక ఇంక్రిమెంట్ల కంటే, వ్యూహాత్మకంగా కంపెనీలు మారడం వల్లే పెద్ద ఎత్తున శాలరీ పెరుగుతుందని ఆమె తన అనుభవంతో నిరూపించింది.
మార్కెట్ విలువ తెలుసుకోండి
ప్రస్తుతం బెంగళూరు (Bengaluru) లాంటి మెట్రో నగరాల్లో కేవలం విధేయత (Loyalty) మాత్రమే గ్రోత్ ఇవ్వదని, మార్కెట్ విలువను బట్టి మనం డిమాండ్ చేయాలని ఆమె కథనం చెబుతోంది. స్కిల్స్ పెంచుకోవడం ఎంత ముఖ్యమో, మన విలువను గుర్తించని చోట నుంచి బయటకు రావడం కూడా అంతే ముఖ్యం. మీ జీతం మీ శ్రమకు తగ్గట్టుగా లేకపోతే, నెక్స్ట్ స్టెప్ వేయడానికి ఏమాత్రం వెనుకాడకండి. ఇప్పుడు ఈమె సక్సెస్ ఫార్ములాపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కొంతమంది ఇది ప్రాక్టికల్ అని సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు తరచుగా జాబ్ మారడం వల్ల డెప్త్ తగ్గుతుందని వాదిస్తున్నారు. ఏది ఏమైనా, ఈ బెంగళూరు CA స్టోరీ మాత్రం యువతకు ఒక వేక్-అప్ కాల్ లా మారింది.


Click it and Unblock the Notifications