బెంగళూరులో బస్సులు స్ట్రైక్.. సమ్మెలోకి లక్షలాది మంది రవాణా ఉద్యోగులు..కారణం ఏంటంటే..
కర్ణాటక రాష్ట్రంలో నేడు (ఫిబ్రవరి 19) ప్రజా రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన రవాణా సంస్థలకు చెందిన ఉద్యోగులు KSRTC, BMTC, NWKRTC KKRTC నేడు సమ్మెను ప్రకటించాయి. ఫిబ్రవరి 19న బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ వద్ద బెంగళూరు చలో ర్యాలీతో పాటు రాష్ట్రవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నేడు కర్ణాటక అంతటా బస్సు సర్వీసులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
ఈ సమ్మె ప్రభావం ముఖ్యంగా Bengaluru నగరంతో పాటు ఇతర జిల్లాల్లో ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రోజువారీ ఉద్యోగాలకు వెళ్లే వారు, విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. రెండు రోజుల పాటు విధులకు హాజరు కాకుండా నిరసన చేపట్టనున్నట్లు రవాణా కార్మిక సంఘాలు ప్రకటించడంతో ప్రజా రవాణాపై ఆందోళన పెరిగింది.

ఈ నిరసనకు ప్రధాన కారణం రవాణా ఉద్యోగులకు సంబంధించిన పలు డిమాండ్లు చాలా కాలంగా పరిష్కారం కాకపోవడమే. దాదాపు 1.15 లక్షలకు పైగా రవాణా ఉద్యోగులు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో 38 నెలల జీత బకాయిల చెల్లింపు, ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతన విధానం అమలు, జనవరి 1, 2024 నుంచి సవరించిన వేతనాల అమలు, అలాగే ఉద్యోగులపై జరుగుతున్న వేధింపులకు ముగింపు పెట్టడం వంటి అంశాలు ఉన్నాయి.
వాస్తవానికి బెంగళూరు చలో కార్యక్రమం జనవరి 29న జరగాల్సి ఉండగా, రవాణా సంఘం నాయకుడు అనంత్ సుబ్బారావు మృతితో వాయిదా పడింది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ఉద్దేశంతో ఈ ర్యాలీని ఇప్పుడు ఫిబ్రవరి 19కు మార్చారు. సమ్మెపై రవాణా సంస్థల యాజమాన్యం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 19న విధులకు హాజరుకాని ఉద్యోగులపై జీతాల్లో కోతలు, వేతనాల నిలుపుదల, అనధికారిక గైర్హాజరుకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అలాగే బెంగళూరు ర్యాలీలో పాల్గొని విధులకు రాని వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశముందని స్పష్టం చేశారు.
వేలాది మంది సిబ్బంది విధులకు హాజరుకాకపోవడంతో, నేడు, రేపు కర్ణాటకలో బస్సు సర్వీసులు పాక్షికంగా మాత్రమే నడిచే అవకాశం ఉంది. ముఖ్యంగా KSRTC, BMTC బస్సులపై ఆధారపడే ప్రాంతాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనవచ్చు. ఉద్యోగులు, విద్యార్థులు, ఆసుపత్రులకు వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు ప్రయాణికులు తాత్కాలికంగా ప్రైవేట్ వాహనాలు, టాక్సీలు, యాప్ ఆధారిత క్యాబ్‌లు లేదా రైళ్లను ఉపయోగించాలని సూచిస్తున్నారు. పరిస్థితిని బట్టి జిల్లా వారీగా ప్రత్యేక సూచనలు కూడా జారీ అయ్యే అవకాశం ఉంది.
బస్ సమ్మె నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటిస్తారా అనే సందేహం తల్లిదండ్రులు, విద్యార్థుల్లో నెలకొంది. ప్రస్తుతం ఫిబ్రవరి 19 లేదా 20 తేదీలకు రాష్ట్రవ్యాప్తంగా అధికారిక సెలవులు ప్రకటించలేదు. అయితే, రవాణా సమస్యల వల్ల విద్యార్థులు లేదా సిబ్బంది ప్రయాణం కష్టమైతే, కొన్ని జిల్లాల్లో స్థానిక పరిపాలనలు లేదా విద్యాసంస్థలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఏవైనా సెలవుల ప్రకటనలు జిల్లా స్థాయిలో మాత్రమే ఉండే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications