బెంగళూరు ప్రయాణికులకు గూడ్ న్యూస్.. ఈ రూట్లలో రెండు కొత్త బస్సులను ప్రవేశపెట్టిన BMTC.. టైమింగ్స్ ఎప్పుడంటే..
భారత ఐటీ రాజధాని, సిలికాన్ సిటీ బెంగళూరు నగరంలో దినదినాభివృద్ధి చెందుతున్న పౌర అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా, వేగవంతంగా మార్చేందుకు బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC) కీలక నిర్ణయం తీసుకుంది. Bengaluru నగరంలోని ప్రధాన వాణిజ్య ప్రాంతాలు, విద్యాసంస్థలు, నివాస సముదాయాలు, పారిశ్రామిక కేంద్రాలను అనుసంధానిస్తూ అనేక కొత్త బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
జూలై 22, 23 తేదీలలో ప్రవేశపెట్టిన ఈ నూతన మార్గాలు ప్రయాణికులకు లాస్ట్-మైల్ కనెక్టివిటీని అందించడంలో, రోజూ ప్రయాణించే పౌరుల సమయాన్ని ఆదా చేయడంలో ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. ప్రైవేటు వాహనాల వినియోగాన్ని తగ్గించి.. ప్రజా రవాణాను ప్రతి ఒక్కరికీ సౌకర్యవంతంగా మార్చాలనే బిఎమ్‌టిసి ఆశయానికి ఈ నిర్ణయం ఒక నిదర్శనంగా నిలుస్తోంది.

జూలై 22వ తేదీన సంస్థ రెండు కీలకమైన రూట్లను ప్రారంభించింది. వీటిలో మొదటిది రూట్ నంబర్ 213WB. ఈ బస్సు బనశంకరి TTMC నుండి ప్రారంభమై మరలవాడి వరకు ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణ మార్గంలో కోననకుంటె క్రాస్, కగ్గలిపుర, హారోహళ్లి, దొడ్డ సాదేనహళ్లి క్రాస్, అగర, మల్లిగే మెట్టిలు, చిక్కమరలవాడి వంటి ముఖ్యమైన ప్రాంతాలు కవర్ అవుతాయి.
ఈ రూట్ కోసం ప్రస్తుతం ఒక బస్సును కేటాయించిన యాజమాన్యం.. ఇది ప్రతిరోజూ నాలుగు వన్-వే ట్రిప్పులను నడుపుతుందని తెలిపింది. ప్రయాణికుల వసతి కోసం సమయాలను కూడా అనుకూలంగా రూపకల్పన చేశారు. బనశంకరి TTMC నుండి మొదటి సర్వీస్ ఉదయం 6:20 గంటలకు ప్రారంభమై.. చివరి బస్సు సాయంత్రం 4:55 గంటలకు అందుబాటులో ఉంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో మరలవాడి నుండి మొదటి బస్సు ఉదయం 8:00 గంటలకు.. చివరి బస్సు సాయంత్రం 7:35 గంటలకు బయలుదేరుతుంది.
అదే రోజున ప్రవేశపెట్టిన మరో ముఖ్యమైన మార్గం రూట్ నంబర్ 213VB. ఇది హారోహళ్లి నుండి బన్నికుప్పె సర్కిల్ మధ్య ప్రయాణిస్తుంది. ఈ మార్గం ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాలు, కళాశాలలను అనుసంధానించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. హారోహళ్లి ఇండస్ట్రియల్ ఏరియా, కీరనగెరె గేట్, దయానంద సాగర్ మెడికల్ కాలేజ్, ఆటం ఫ్యాక్టరీ మీదుగా ఈ బస్సు బన్నికుప్పె సర్కిల్‌కు చేరుకుంటుంది. పరిశ్రమల కార్మికులు, విద్యార్థులు ఎక్కువగా ప్రయాణించే మార్గం కావడంతో బిఎమ్‌టిసి ఈ రూట్‌కు రెండు బస్సులను కేటాయించింది. ఇవి ప్రతిరోజూ దాదాపు 40 వన్-వే ట్రిప్పులతో నిరంతరం ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
ఇక జూలై 23వ తేదీన బిఎమ్‌టిసి పీణ్య పారిశ్రామిక ప్రాంత వాసుల కోసం వృత్తాకార (సర్క్యులర్) సర్వీసులను ప్రారంభించింది. ఇందులో 'చక్ర-7' సర్వీస్.. పీణ్య 2వ దశ నుండి ప్రారంభమై చేతన్ సర్కిల్, కాళికా నగర్, ఆంధ్రహళ్లి, తీగలపాళ్య, మంజుశ్రీ గార్మెంట్స్ మీదుగా తిరిగి పీణ్య 2వ దశకు చేరుకుంటుంది. ఇందులో రెండు బస్సులు సేవలందిస్తాయి. మొదటి బస్సు ఉదయం 6:20 గంటలకు ప్రారంభం కాగా.. చివరి బస్సు రాత్రి 8:50 గంటల వరకు తిరుగుతుంది.
దీనికి అనుబంధంగా వ్యతిరేక దిశలో నడిచే 'చక్ర-7A' సర్వీస్‌ను కూడా బిఎమ్‌టిసి అందుబాటులోకి తెచ్చింది. ఇది పీణ్య 2వ దశ నుండి బయలుదేరి మంజుశ్రీ గార్మెంట్స్, తీగలపాళ్య, ఆంధ్రహళ్లి, కాళికా నగర్, చేతన్ సర్కిల్ మీదుగా తిరిగి పీణ్య 2వ దశకు వస్తుంది. దీనికి కూడా రెండు బస్సులు కేటాయించారు. ఈ మార్గంలో మొదటి బస్సు ఉదయం 6:30 గంటలకు.. చివరి బస్సు రాత్రి 9:00 గంటలకు నడుస్తుంది.
ఈ కొత్త సర్వీసుల విస్తరణ వల్ల శివారు ప్రాంతాలు, పారిశ్రామిక ప్రాంతాలలో నివసించే వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రజలకు రవాణా కష్టాలు చాలావరకు తీరుతాయి. ప్రధాన రహదారులు, మెట్రో స్టేషన్లు, అంతర్గత వీధుల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరచడం ద్వారా ప్రయాణ భారాన్ని తగ్గించడమే బిఎమ్‌టిసి యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. భవిష్యత్తులో ప్రయాణికుల రద్దీ, అవసరాలను బట్టి ఈ మార్గాల్లో సర్వీసుల సంఖ్యను మరింత పెంచే ఆలోచనలో అధికారులు ఉన్నారు.


Click it and Unblock the Notifications
