బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఉబర్, ఓలా, రాపిడో సర్వీసులపై నిషేధం ఎత్తేసిన హైకోర్టు..
బెంగళూరు నగర ప్రయాణికులకు గుడ్ న్యూస్..బైక్ టాక్సీలపై విధించిన నిషేధాన్ని కర్ణాటక హైకోర్టు శుక్రవారం (జనవరి 23) రద్దు చేసింది. ఈ తీర్పుతో ఉబర్, ఓలా, రాపిడో వంటి యాప్-ఆధారిత అగ్రిగేటర్లు మరోసారి బెంగళూరు సహా రాష్ట్రవ్యాప్తంగా బైక్ టాక్సీ సేవలను ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. ట్రాఫిక్ సమస్యలు, చివరి మైలు కనెక్టివిటీ లోపం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న నగరానికి ఇది ఒక పెద్ద ఉపశమనంగా ప్రయాణికులు భావిస్తున్నారు.
చీఫ్ జస్టిస్ విభు బఖ్రు, జస్టిస్ సిఎం జోషిలతో కూడిన డివిజన్ బెంచ్.. ఈ అంశంపై గతంలో ఇచ్చిన సింగిల్ జడ్జి ఉత్తర్వులను పక్కన పెట్టింది. మోటార్ వాహనాల చట్టం ప్రకారం మోటార్ సైకిళ్లను కేవలం వ్యక్తిగత వినియోగ వాహనాలుగా మాత్రమే చూడలేమని, అవసరమైన నిబంధనలను పాటిస్తే వాటిని రవాణా వాహనాలుగా కూడా నమోదు చేయవచ్చని కోర్టు స్పష్టం చేసింది. మోటార్ సైకిళ్ల వర్గీకరణ ఆధారంగా మాత్రమే రిజిస్ట్రేషన్ లేదా పర్మిట్లను తిరస్కరించడానికి అధికారులకు హక్కు లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది.
ఈ తీర్పులో భాగంగా.. Bengaluru బైక్ టాక్సీ యజమానులు తమ వాహనాలను రవాణా వాహనాలుగా నమోదు చేసుకోవడానికి దరఖాస్తులు చేసుకునే స్వేచ్ఛ ఉందని కోర్టు పేర్కొంది. అలాగే, కాంట్రాక్ట్ క్యారేజ్ కార్యకలాపాలకు అవసరమైన పర్మిట్లను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రాంతీయ రవాణా అధికారం భద్రత, ప్రయాణికుల రక్షణ వంటి అంశాలపై అవసరమైన షరతులు విధించవచ్చని, అయితే అవి మోటార్ సైకిళ్లు రవాణా వాహనాలుగా పనిచేయకుండా అడ్డుకునేలా ఉండకూడదని కోర్టు స్పష్టంగా తెలిపింది.

ఉబెర్ ఇండియా సిస్టమ్స్, ANI టెక్నాలజీస్ (ఓలా), రోపెన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్ (రాపిడో)తో పాటు బైక్ టాక్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దాఖలు చేసిన అప్పీళ్ల నేపథ్యంలో ఈ తీర్పు వెలువడింది. మోటార్ వాహనాల చట్టంలోని సెక్షన్ 93 కింద స్పష్టమైన మార్గదర్శకాలు లేవన్న కారణంతో.. ఏప్రిల్ 2025లో బైక్ టాక్సీ కార్యకలాపాలను నిలిపివేస్తూ ఇచ్చిన ముందస్తు ఉత్తర్వులను వారు సవాలు చేశారు. భద్రత, శాంతిభద్రతల సమస్యలు.. ఆటో, టాక్సీ యూనియన్ల నిరసనల నేపథ్యంలో అప్పట్లో నిషేధం విధించబడింది.
అయితే, తాజా తీర్పులో డివిజన్ బెంచ్ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మోటార్ వాహనాల చట్టం ద్విచక్ర వాహనాలను కూడా కాంట్రాక్ట్ క్యారేజీలుగా పనిచేయడానికి అనుమతిస్తుందని, కాబట్టి పూర్తిస్థాయి నిషేధానికి చట్టపరమైన ఆధారం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న మోటార్ సైకిల్ రిజిస్ట్రేషన్ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, అగ్రిగేటర్లు కొత్త పర్మిట్ దరఖాస్తులు సమర్పించుకునే వెసులుబాటును కూడా కోర్టు కల్పించింది.
ఈ తీర్పుతో బైక్ టాక్సీ రంగంలో పనిచేస్తున్న వేలాది డ్రైవర్లు, చిన్న వ్యాపారులకు ఊరట అంశంగా మారింది. దీంతో పాటుగా బెంగళూరులో రవాణా వ్యవస్థను మరింత పోటీతత్వంగా, సమర్థవంతంగా మార్చే అవకాశాన్ని కల్పిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ ఒత్తిడికి ప్రత్యామ్నాయంగా, తక్కువ ఖర్చుతో వేగవంతమైన ప్రయాణ సాధనంగా బైక్ టాక్సీలు మళ్లీ కీలక పాత్ర పోషించనున్నాయి.


Click it and Unblock the Notifications