బెడిసికొట్టిన బైక్ టాక్సీ నిషేధం..బెంగుళూరులో ప్రయాణికుల తెలివిని చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Bengaluru Bike Taxi Ban Backfires: కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధరామయ్య ప్రభుత్వం బైక్ టాక్సీ సేవలను నిషేధించిన సంగతి విదితమే.ఈ నిషేధంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఇంటి నుండి ఆఫీసుకు వెళ్లాలంటే వారి జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఆటోవాలాలు ఇష్టం వచ్చినట్లుగా ఛార్జీలు పెంచేశారు. దీంతో ప్రయాణికులకు గత్యతరం లేక వేరే మార్గాలను ఆశ్రయిస్తున్నారు. పార్సిల్ సర్వీసుల పేరుతో రైడ్ బుక్ చేసుకుని చాలామంది కార్యాలయాలకు వెళుతున్నారు.
ఇక బెంగుళూరు నగరంలో అయితే ప్రజల అవస్థలు అన్నీ ఇన్నీ కావు.బైక్ టాక్సీ సేవల నిషేధం తర్వాత చాలామంది తమ సొంత వాహనాలను బయటకు తీస్తున్నారు. దీంతో నగరంలో విపరీతమైన ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఇక మరికొందరు పార్సిల్ సర్వీసుల పేరుతో బుక్ చేసుకుని ఆఫీసులకు వెళ్లి వస్తున్నారు. అయితే ఇప్పుడు వారికి కొత్త సమస్య వచ్చి పడింది. తాజాగా నగరంలోని ప్రయాణికులకు రైడ్‌లను అందిస్తున్న రైడర్ల నుండి మీకు ఈ రోజు రైడ్ కావాలా అంటే నేరుగా వారి మొబైల్ ఫోన్లకు వాట్సాప్ సందేశాలు వస్తున్నాయి.

ఒకసారి ప్రయాణం తర్వాత ఆ నంబర్ ని రైడర్ సేవ్ చేసుకుంటున్నారు. అనంతరం ఆనంబరుకు రైడ్ కావాలంటే చెప్పండి అంటూ వాట్సాప్ ద్వారా సంప్రదిస్తున్నారు. దీంతో ప్రయాణికులు తమ నంబర్లు ఎక్కడ విద్రోహ కార్యకలాపాలకు ఉపయోగిస్తారోనని ఆందోళన చెందుతున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే బెంగళూరులో ప్రభుత్వం అమలు చేసిన బైక్ టాక్సీ నిషేధం ఆచరణలో విఫలమవుతోంది. టెక్ పార్కులు, మెట్రో స్టేషన్లు, ఆఫీసుల ప్రాంతాలలో ప్రయాణికులు ఇంకా అనధికారిక రైడ్‌లను బుక్ చేసుకుంటున్నారు. ఇదంతా యాప్‌లకు ప్రత్యామ్నాయంగా వాట్సాప్ ద్వారా జరుగుతోంది. ప్రయాణికుడికి రైడ్ అవసరమైతే, పార్శిల్ బుక్ చేసినట్లు చూపించి, దానిని రద్దు చేసి, నేరుగా వాట్సాప్ ద్వారా సమన్వయం చేసుకుని రైడ్ చేయిస్తున్నారు.
ప్రస్తుతం కోరమంగళ, సిల్క్ బోర్డ్, బెల్లందూర్, ఎలక్ట్రానిక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాలు ఈ అనధికారిక రైడ్ నెట్‌వర్క్‌లకు హబ్‌గా మారాయి. ప్రయాణికులు రోజూ ప్రయాణించే మార్గాల కోసం తమ రైడర్ల నంబర్‌లను సేవ్ చేసుకుంటున్నారు.ఈ తాత్కాలిక రైడ్‌లు ఆటోలతో పోలిస్తే చౌకగా, వేగంగా అందుబాటులో ఉంటాయి. కానీ ప్రయాణికులు తమ గోప్యతపై ఆందోళన చెందుతున్నారు. తమ నంబర్ ఎలా సేవ్ అవుతుందో తెలియక, అనుమతి లేకుండా యాదృచ్ఛిక సందేశాలు రావడం వింతగా అనిపిస్తోందని వారు అంటున్నారు.
వసంత్ నగర్‌కు చెందిన పుష్ప మాట్లాడుతూ.. రైడ్‌లు చౌకగానే ఉన్నాయి కానీ, నాకు అవసరం లేదన్నా సందేశాలు రావడం విచిత్రంగా ఉంది. నా నంబర్ ఎవరు, ఎప్పుడు సేవ్ చేసారో కూడా తెలియదని చెప్పారు. ప్రస్తుతం బెంగళూరులో ఆటో ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. కేవలం 2 కి.మీ దూరానికి రూ. 120-150 వసూలు చేస్తున్నారు. ఇటువంటి ఖరీదైన పరిస్థితే ప్రయాణికులను అనధికారిక రైడ్‌ల వైపు వెళ్లేలా చేస్తోంది. దీనిపై ప్రభుత్వం ఒక పరిష్కార మార్గాన్ని తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.


Click it and Unblock the Notifications