Bengaluru: సిటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! మారనున్న ఇన్‌కమ్ టాక్స్ రూల్స్..!
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో నివసిస్తున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించబోతోంది. ముఖ్యంగా ఐటీ హబ్‌లుగా పేరొందిన బెంగళూరు (Bengaluru), హైదరాబాద్ (Hyderabad), పూణే వంటి నగరాల్లో ఇళ్ల అద్దెలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో.. ఆదాయపు పన్ను నిబంధనలను సవరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 'డ్రాఫ్ట్ ఇన్కమ్ టాక్స్ రూల్స్, 2026' ప్రకారం.. కొన్ని నగరాల్లోకి ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ (HRA) మినహాయింపు పరిమితిని పెంచే నగరాల జాబితాను విస్తరించాలని ప్రతిపాదించారు. దీనివల్ల మధ్యతరగతి ఉద్యోగుల జేబులకు పెద్ద ఎత్తున ఉపశమనం లభించనుంది.

ప్రస్తుత నిబంధనలు ఏమిటి?
ప్రస్తుతం అమలులో ఉన్న ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. దేశాన్ని రెండు రకాలుగా విభజించారు. మెట్రో నగరాలైన ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నైలలో నివసించే వారు తమ బేసిక్ శాలరీలో 50 శాతం వరకు HRA మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలు టెక్నాలజీ పరంగా ఎంత ఎదిగినా ఇప్పటికీ వీటిని నాన్ - మెట్రో నగరాల జాబితాలోనే ఉంచారు. దీనివల్ల ఇక్కడ నివసించే వారు కేవలం 40 శాతం వరకు మాత్రమే HRA మినహాయింపు పొందుతున్నారు. ఈ వ్యత్యాసం వల్ల బెంగళూరు లాంటి నగరాల్లో భారీ అద్దెలు కడుతున్నా.. టాక్స్ రూపంలో ఎక్కువ నష్టపోవాల్సి వస్తోంది.
కొత్తగా చేరనున్న నగరాలు ఇవే!
ప్రభుత్వ తాజా ప్రతిపాదన ప్రకారం.. 50 శాతం HRA మినహాయింపు పరిమితిని మరో నాలుగు నగరాలకు విస్తరించనున్నారు. అవేంటంటే..
• బెంగళూరు (Bengaluru)
• హైదరాబాద్ (Hyderabad)
• పూణే (Pune)
• అహ్మదాబాద్ (Ahmedabad)
ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే పాత పన్ను విధానాన్ని (Old Tax Regime) ఎంచుకునే ఉద్యోగులకు పన్ను భారం గణనీయంగా తగ్గుతుంది. తద్వారా వారి చేతికి వచ్చే జీతం (Take-home salary) పెరుగుతుంది. ఆధునిక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా అద్దెలు విపరీతంగా పెరిగిన నగరాలను కూడా మెట్రో హోదాకు సమానంగా గుర్తించాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
HRA మినహాయింపు ఎవరికి వర్తిస్తుంది?
ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ HRA వెసులుబాటు కేవలం 'పాత పన్ను విధానం' (Old Tax Regime) అనుసరించేవారికి మాత్రమే లభిస్తుంది. సెక్షన్ 10(13A) కింద ఈ మినహాయింపును పొందవచ్చు. కొత్త పన్ను విధానం (New Tax Regime) ఎంచుకున్న వారికి దాదాపు అన్ని రకాల మినహాయింపులు తొలగించబడ్డాయి. కాబట్టి వారికి ఈ మార్పు వల్ల ఎలాంటి లాభం ఉండక పోవచ్చు.
మొత్తంగా చూస్తే.. గత దశాబ్ద కాలంలో బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలు స్టార్టప్, ఐటీ హబ్‌లుగా రూపాంతరం చెందాయి. ఇక్కడ జీవన వ్యయంతో పాటు అద్దెలు కూడా ముంబై, ఢిల్లీ స్థాయికి చేరుకున్నాయి. అందుకే ఈ చారిత్రాత్మక మార్పు ఉద్యోగులకు ఎంతో అవసరమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఈ ప్రతిపాదన అమలైతే పాత పన్ను విధానం వైపు మరికొంత మంది మొగ్గు చూపే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications