Bengaluru: ఆగండి.. ఇల్లు కొనేముందు ఇది చదవండి! టెక్ నగరాల్లో మారుతున్న రియల్ ఎస్టేట్ సీన్!
గత కొన్నేళ్లుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన రియల్ ఎస్టేట్ రంగానికి ఇప్పుడు కాస్త బ్రేకులు పడ్డాయి. ముఖ్యంగా మన బెంగళూరు (Bengaluru), హైదరాబాద్ (Hyderabad) , గుర్గావ్ వంటి టెక్ హబ్ లలో ఇళ్ల అమ్మకాలు మునుపటి కంటే నెమ్మదించాయి. ఒకప్పుడు సైట్ విజిట్ చేసిన కొద్ది రోజుల్లోనే డీల్ క్లోజ్ చేసేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. రీసెంట్ గా జరిగిన కొన్ని పరిణామాల వల్ల చాలామంది పెట్టుబడులు పెట్టేందుకు భయపడుతున్నారు. ముఖ్యంగా ఐటీ రంగంలో వస్తున్న ఉద్యోగాల కోతలు (Layoffs), స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న ఒడిదుడుకులు మధ్యతరగతి , ఎగువ మధ్యతరగతి కొనుగోలుదారుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి.

పెరిగిన సందిగ్ధత.. ఆలస్యమవుతున్న నిర్ణయాలు
సాధారణంగా బెంగళూరులోని వైట్‌ఫీల్డ్, ఔటర్ రింగ్ రోడ్ లేదా హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో ఇళ్లు కొనేవారిలో ఎక్కువ మంది ఐటీ నిపుణులే ఉంటారు. వీరి ఆదాయం ప్రధానంగా జీతాలు, బోనస్‌లు , స్టాక్ ఆప్షన్స్ (ESOPs) మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం టెక్ రంగంలో నెలకొన్న అనిశ్చితి వల్ల "ముందు ఉద్యోగం భద్రంగా ఉంటుందా?" అనే ఆలోచనలో పడ్డారు సామాన్యులు. దీనివల్ల పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ఇళ్ల కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేస్తున్నారు.
గణాంకాలు ఏం చెబుతున్నాయి?
తాజా నివేదికల ప్రకారం.. 2024తో పోలిస్తే 2025 లో దేశవ్యాప్తంగా ఇళ్ల అమ్మకాలు దాదాపు 12 శాతం తగ్గాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో జనవరి నెలలో రిజిస్ట్రేషన్లు 14 శాతం పడిపోవడం గమనార్హం. బెంగళూరు విషయానికి వస్తే ఇక్కడ కూడా అమ్మకాలు సుమారు 5 శాతం మేర తగ్గాయి. గతంలో కంటే ఇళ్ల ధరలు విపరీతంగా పెరగడం కూడా కొనుగోలుదారులు వెనకడుగు వేయడానికి ఒక కారణం.
డెవలపర్లు ఏమంటున్నారు?
ఈ పరిస్థితిపై రియల్ ఎస్టేట్ డెవలపర్లు భిన్నంగా స్పందిస్తున్నారు. "డిమాండ్ లేదని కాదు, కానీ కస్టమర్లు నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నారు" అని వారు చెప్తున్నారు. గతంలో ఒకటి రెండు సార్లు సైట్ చూసి అడ్వాన్స్ ఇచ్చేసేవారు. ఇప్పుడు నాలుగైదు సార్లు పరిశీలించి, మార్కెట్ క్లారిటీ వచ్చాక కానీ ముందుకు రావడం లేదు. ముఖ్యంగా అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టుల కంటే, వెంటనే దిగడానికి సిద్ధంగా ఉన్న (Ready-to-move-in) ఇళ్లపైనే అందరూ ఆసక్తి చూపుతున్నారు.
ప్రస్తుతానికి మార్కెట్ కాస్త స్తబ్దుగా ఉన్నప్పటికీ.. ఇది తాత్కాలికమేనని నిపుణులు భావిస్తున్నారు. ఐటీ కంపెనీల్లో నియామకాలు మళ్ళీ పుంజుకుని, స్టాక్ మార్కెట్ స్థిరపడితే మళ్ళీ రియల్ ఎస్టేట్ జోరందుకుంటుంది. అప్పటివరకు బిల్డర్లు కూడా కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకోవడానికి కొత్త వ్యూహాలతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మీరు కూడా ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తుంటే, మీ ఆర్థిక స్థితిగతులను, ఆదాయ వనరులను ఒకసారి సరిచూసుకుని అడుగు వేయడం మంచిది.


Click it and Unblock the Notifications