బెంగళూరు ఎయిర్‌పోర్టుకు వెళ్లాలంటే ట్రాఫిక్‌తో నరకమే.. ఆ టన్నెల్ రోడ్ పైనే ప్రభుత్వం గంపెడాశలు..
దక్షిణ భారతదేశంలోనే అత్యంత రద్దీగా ఉండే Bengaluru కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA) నుండి బయటకు వచ్చే ప్రయాణికులకు.. బెంగళూరు రోడ్ల దుస్థితి చేదు అనుభవాన్ని మిగులుస్తోంది. కర్ణాటక ప్రభుత్వం హెబ్బాల్ మీదుగా రూ. 17,780 కోట్ల అంచనా వ్యయంతో 17 కిలోమీటర్ల హెబ్బాల్-సిల్క్ బోర్డ్ టన్నెల్ రోడ్, రూ. 1,139 కోట్ల వ్యయంతో 2.2 కిలోమీటర్ల హెబ్బాల్ జంక్షన్-వెటర్నరీ కాలేజ్ టన్నెల్ అనే రెండు భారీ సొరంగ ప్రాజెక్టులపై దృష్టి పెట్టినప్పటికీ.. విమానాశ్రయానికి వెళ్లే కీలకమైన హెన్నూర్-బాగలూర్, బుడిగెరె ప్రత్యామ్నాయ మార్గాలు మాత్రం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయి.
మనీకంట్రోల్ నిర్వహించిన వాస్తవ తనిఖీల్లో ఈ రెండు మార్గాల్లో పెద్ద పెద్ద గుంతలు, అసంపూర్తి ఫుట్‌పాత్‌లు, సరిపోని వీధి దీపాలు, మురుగునీటి పారుదల సమస్యలు, పూడిక పేరుకుపోవడం, లేన్ గుర్తులు లేకపోవడం వంటి అనేక లోపాలు వెలుగుచూశాయి. 2027 ఫిబ్రవరిలో జరగనున్న ప్రతిష్టాత్మక 'ఏరో ఇండియా' ప్రదర్శన సమయానికి కూడా ఈ రహదారులను సిద్ధం చేయకపోవడంపై కర్ణాటక రాష్ట్ర ట్రావెల్స్ ఆపరేటర్స్ అసోసియేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

హెన్నూర్-బాగలూర్ ప్రధాన రహదారిపై బి-స్మైల్ చేపట్టిన వైట్-టాపింగ్ పనులు 2024 చివరలో ప్రారంభమైనప్పటికీ.. జూలై 2026 నాటి లక్ష్యంతో సహా పలు గడువులను దాటిపోయి ఇంకా అసంపూర్తిగానే మిగిలాయి. ఈ మార్గాన్ని పరిశీలించి పెండింగ్ పనులను, ప్రత్యేకించి ఫుట్‌పాత్ నిర్మాణాలను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించినట్లు జీబీఏ చీఫ్ కమిషనర్ ఎం. మహేశ్వర రావు తెలిపారు.
అయితే, రోడ్డు కాంక్రీటీకరణ వల్ల కొన్ని ప్రాంతాలు విపరీతంగా ఎత్తు కావడం, నాసిరకం డ్రైనేజీల వల్ల నీరు నిలవడం, గెడ్డలహళ్లి రైల్వే అండర్‌పాస్ వద్ద ప్రమాదకర గుంతలు ఏర్పడటం, కన్నూరు దాటిన తర్వాత వీధి దీపాలు లేకపోవడం వంటి సమస్యలను స్థానికులు ఎత్తిచూపుతున్నారు. గత మే నెలలో ఈ రహదారిపై జరిగిన బస్సు ప్రమాదంలో 15 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోవడం ఇక్కడి ట్రాఫిక్ నిబంధనల విఫలానికి అద్దం పడుతోంది.
మరోవైపు, తూర్పు బెంగళూరులోని వైట్‌ఫీల్డ్, కేఆర్ పురం, హోస్కోట్ నివాసితుల కోసం కేఆర్‌డీసీఎల్ (KRDCL) ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన ఎస్‌ఆర్‌సి (SRC) సంస్థ నిర్మిస్తున్న బుడిగెరె తూర్పు విమానాశ్రయ కారిడార్ ప్రాజెక్ట్ 2019 జూన్‌లో ప్రారంభమై 2021 డిసెంబర్ నాటికే పూర్తికావాల్సి ఉంది. ఈ 15 కిలోమీటర్ల ప్రాజెక్టులో 90 శాతం భూసేకరణ పరిపరిహారాలు పూర్తయినప్పటికీ, బెట్టకోట రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని 1 కిలోమీటరు స్థలం, హైకోర్టు స్టే పరిధిలోని సింగనహళ్లి, మైలనహళ్లి భాగాలు, కడరాయప్పనహళ్లిలోని భవనాల నష్టపరిహారం పెండింగ్‌లో ఉండటంతో మొత్తం 5.1 కిలోమీటర్ల పనులు నిలిచిపోయాయి.
బెట్టకోట అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా చిక్కబళ్లాపుర జిల్లా పర్గోడులో 5 ఎకరాల భూమిని కేటాయించినప్పటికీ.. మిగిలిన 5.1 కిలోమీటర్ల స్థలాన్ని ఒకేసారి పూర్తిగా అప్పగిస్తేనే పనులు పునఃప్రారంభిస్తామని కాంట్రాక్టర్ స్పష్టం చేశారు. దీనికి తోడు డ్రైనేజీ సమస్యలు, పొరుగు ప్రాంతాల్లో నిర్మాణాలు పెరిగి వర్షపు నీరు రోడ్డుపైకి రావడం, ఇతర రాష్ట్రాలకు ముడి రాళ్లు, ఎం-శాండ్ రవాణాపై తమిళనాడు విధించిన నిషేధం వల్ల మెటీరియల్ కొరత ఏర్పడటం వంటి అంశాలు ఈ ప్రాజెక్టును మరింత ఆలస్యం చేస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications

