Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నాయి. వాస్తవానికి ప్రపంచ మార్కెట్ల నుంచి ఉన్న సపోర్ట్ కారణంగా నేడు సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు రికార్డు గరిష్ఠాలను తాకాయి.
నేడు బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు తమ బుల్‌రన్‌ను కొనసాగించాయి. ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ 74,245 మార్కును చేరుకోగా.. నిఫ్టీ సూచీ 22,523 వద్ద సరికొత్త రికార్డు జీవితకాల గరిష్ఠాలను తాకాయి. దీంతో ఒక పక్క ర్యాలీ కొనసాగుతుండగా.. మరో పక్క ఇన్వెస్టర్లు మాత్రం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మార్కెట్లు ఈ స్థాయిల వద్ద కరెక్షన్ కు గురవుతాయనే భయాలు వారిని వెంటాడుతున్నాయని నిపుణులు చెబుతున్నాయి. దీంతో అనేక మంది ముందస్తుగానే లాభాల స్వీకరణకు మెుగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.

వాస్తవానికి దేశీయ మార్కెట్ల ర్యాలీకి బలమైన కారణం.. యూఎస్ సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ 2024లో రేట్ల కోతలకు అవకాశం ఉందని వార్తలు రావటమే. అయితే ఇది ఎప్పటి నుంచి జరుగుతుందనే విషయం మాత్రం తెలియదు. దీంతో బుల్లిష్ సెంటిమెంట్ చెక్కుచెదరకుండా, నిఫ్టీ తదుపరి కొన్ని సెషన్లలో తన రికార్డు రన్‌ను కొనసాగించవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ప్రభుదాస్ లిల్లాధర్ టెక్నికల్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ వైశాలి పరేఖ్ ప్రకారం నిఫ్టీ రానున్న కాలంలో 22,700-23,000 స్థాయిలకు చేరుకోవచ్చని అంచనా వేశారు.
ఈ క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం 10 గంటల సమయంలో ప్లాట్ ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 3 పాయింట్ల నష్టంలో కొనసాగుతుండగా.. నిఫ్టీ 5 పాయింట్ల లాభంలో ఉంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 85 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 238 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతోంది.


Click it and Unblock the Notifications