ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్‌ను మే 17వ తేదీ వరకు పొడిగించడంతో పాటు వివిధ కారణాలు మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీశాయి. గత వారం లాభాల్లో ముగిసిన మార్కెట్లు ఈ రోజు నష్టాల బాట పట్టాయి. ఉదయమే నష్టాలతో ప్రారంభమైంది. సాయంత్రం క్లోజింగ్ సమయానికి సెన్సెక్స్ 2002 పాయింట్లు నష్టపోయి 31,715 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 566 పాయింట్లు కోల్పోయి 9,293 వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 6 శాతం మేర నష్టపోయాయి. డాలరుతో రూపాయి మారకం వ్యాల్యూ 75.71 వద్ద ఉంది.

రూ.6 లక్షల కోట్లు ఆవిరి
మార్కెట్ భారీగా నష్టపోవడంతో ఇన్వెస్టర్లు ఈ ఒక్కరోజే రూ.6 లక్షల కోట్లు నష్టపోయారు. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.129.41 లక్షల కోట్ల (ఏప్రిల్ 30) నుండి రూ.123.69 లక్షల కోట్లకు పడిపోయింది. ఇది నాలుగో అతిపెద్ద సింగిల్ డే లాస్. టాప్ 4 సెన్సెక్స్ నష్టాలు ఇవే..
23 మార్చి 2020న సెన్సెక్స్ 3,934.72 పాయింట్లు నష్టపోయింది.
12 మార్చి 2020న సెన్సెక్స్ 2,919.26 పాయింట్లు నష్టపోయింది.
16 మార్చి 2020న సెన్సెక్స్ 2,713.41 పాయింట్లు నష్టపోయింది.
4 మే 2020 (ఈరోజు) 2,002.27 పాయింట్లు నష్టపోయింది.
9 మార్చి 2020 1,941 పాయింట్లు నష్టపోయింది.
24 ఆగస్ట్ 2015న 1,624 పాయింట్లు నష్టపోయింది.
28 ఫిబ్రవరి 2020 1448 పాయింట్లు నష్టపోయింది.
21 జనవరి 2008న 1408 పాయింట్లు నష్టపోయింది.
30 మార్చి 2020న 1375 పాయింట్లు నష్టపోయింది.
01 ఏప్రిల్ 2020న 1203 పాయింట్లు నష్టపోయింది.
24 అక్టోబర్ 2008న 1070 పాయింట్లు నష్టపోయింది.
21 ఏప్రిల్ 2020న 1011 పాయింట్లు నష్టపోయింది.

లాక్ డౌన్ కొనసాగింపు
మార్కెట్ నష్టాలకు పలు కారణాలు ఉన్నాయి. కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్‌ను మే 17వ తేదీ వరకు పొడిగించింది. దేశంలోను కేసుల సంఖ్య పెరుగుతోంది. దీనికి తోడు అంతర్జాతీయ పరిమాణామాలు మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీశాయి. ఆటో సేల్స్ జీరోకు పడిపోవడం కూడా మార్కెట్‌ను దెబ్బకొట్టింది.

అమెరికా - చైనా పోరు
కరోనా వైరస్ పైన అమెరికా - చైనా మధ్య వివాదం ముదురుతోంది. కరోనాకు డ్రాగన్ దేశమే కారణమని అమెరికా ఆరోపణలు గుప్పిస్తోంది. గత ఏడాది ట్రేడ్ వార్ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం పడింది. ఆ తర్వాత కుదురుకుంటున్నట్లు కనిపించింది. కానీ కరోనా రూపంలో ఆ రెండు దేశాల మధ్య మరోసారి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రెండు టాప్ ఎకానమీల మధ్య పోరు మార్కెట్ సెంటిమెంటును బలంగా దెబ్బతీసింది.

లాభాల క్షీణత.. మార్చి కంటే ఈ క్వార్టర్‌పై ఎక్కువ ప్రభావం
రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందూస్తాన్ యూనీలీవర్ వంటి దిగ్గజ కంపెనీల మార్చి క్వార్టర్ లాభాలు క్షీణించాయి. దలాల్ స్ట్రీట్ పైన ఈ ప్రభావం పడింది. ఈ కంపెనీల షేర్లు దాదాపు 7 శాతం నష్టపోయాయి. మార్చిలో కేవలం వారం రోజులు మాత్రమే లాక్ డౌన్ కొనసాగింది. దాని ప్రభావం ఎంతో కనిపిస్తోంది. ఏప్రిల్ - జూన్ క్వార్టర్ పూర్తిగా లాక్ డౌన్‌లో ఉంది. ప్రస్తుత క్వార్టర్ అంతకంటే దారుణంగా ఉంటుందని ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు.

అంతర్జాతీయ మార్కెట్లు వీక్
అంతర్జాతీయ మార్కెట్లు కూడా నష్టాల్లో కూరుకుపోయాయి. చమురు ధరలు పడిపోయాయి. యూఎస్ స్టాక్ ఫ్యూచర్స్ 1.7 శాతం మేర నష్టపోయాయి. సురక్షిత పెట్టుబడిగా భావించే డాలర్ వారం గరిష్టానికి చేరుకుంది. సౌత్కొరియా, హాంగ్ కాంగ్ మార్కెట్లు 3.5 శాతం మేర నష్టపోయాయి. ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ 200 కూడా 0.5 శాతం నష్టపోయింది.


Click it and Unblock the Notifications