యుద్ధం వస్తుందని తెలిసి ముందే భారీగా చమురును దాచి పెట్టుకున్న చైనా.. నెక్ట్స్ టార్గెట్ అదే ఇక..
చైనా వ్యూహాత్మక చతురత, ఆ దేశం తన ప్రయోజనాల కోసం ముందస్తుగా వేసే అడుగులు మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటుందని, ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మూసివేత వల్ల చమురు సరఫరాకు తీవ్ర విఘాతం కలుగుతుందని ముందే ఊహించిన China, తన దేశంలో అసాధారణ స్థాయిలో చమురు నిల్వలను సిద్ధం చేసుకుంది.
తాజా గణాంకాల ప్రకారం.. చైనా ప్రస్తుతం సుమారు 1.4 బిలియన్ బారెళ్ల చమురు నిల్వలను కలిగి ఉంది. ఇది ఎంతటి భారీ మొత్తం అంటే, అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) లోని 32 సభ్య దేశాల వద్ద ఉన్న మొత్తం నిల్వలు (1.2 బిలియన్ బారెళ్లు) కంటే కూడా చైనా వద్ద ఉన్న నిల్వలే అధికంగా ఉండటం గమనార్హం.
ప్రస్తుతం ప్రపంచ దేశాలు హార్ముజ్ జలసంధి మూసివేత వల్ల చమురు ధరలు ఆకాశాన్నంటుతుంటే ఆందోళన చెందుతున్నాయి. కానీ, డ్రాగన్ దేశం మాత్రం అత్యంత నిశ్చింతగా కూర్చుని ఉంది. ఈ సంక్షోభాన్ని ముందే పసిగట్టిన చైనా, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే తన చమురు దిగుమతులను ఏకంగా 15.8 శాతం మేర పెంచుకుంది.

అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ప్రపంచంలోని ఇతర దేశాలు చమురు కొరతతో కొట్టుమిట్టాడుతున్నా, చైనా తన నిల్వలతో దీర్ఘకాలం పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనుగడ సాగించగలదు. యుద్ధం కారణంగా పెరిగిన ధరలను తగ్గించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వ్యూహాత్మక నిల్వల నుంచి 172 మిలియన్ బారెళ్లను విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ, అమెరికా వద్ద ఉన్న మొత్తం నిల్వలు కేవలం 405 మిలియన్ బారెళ్లు మాత్రమే ఉండటం చైనా కంటే తాము ఎంత వెనుకబడి ఉన్నామో స్పష్టం చేస్తోంది.
చైనా తీరు ఎప్పుడూ తన స్వప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తుంది. ప్రపంచం మొత్తం యుద్ధం, ఆర్థిక సంక్షోభం గురించి ఆందోళన చెందుతుంటే, చైనా మాత్రం తన ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి విఘాతం కలగకుండా ముందస్తుగా రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుంది. హార్ముజ్ జలసంధి గుండా జరిగే రవాణా నిలిచిపోయినా, అంతర్జాతీయంగా బ్యారెల్ చమురు ధర 100 డాలర్లు దాటినా చైనాకు పెద్దగా నష్టం ఉండదు.
ఈ ముందస్తు ప్రణాళికే చైనాను ఇతర దేశాల కంటే భిన్నంగా నిలబెట్టింది. మిగిలిన దేశాలు ఇంధన భద్రత కోసం ప్రత్యామ్నాయాల వైపు చూస్తుంటే, చైనా ఇప్పటికే తన దగ్గర ఉన్న నిల్వలతో ప్రపంచ రాజకీయాల్లో ఒక బలమైన స్థానాన్ని సంపాదించుకుంది. డ్రాగన్ దేశం తన స్వార్థం కోసం ఎవరినైనా ఇబ్బందుల్లోకి నెట్టడానికైనా సిద్ధపడుతుందని, కానీ తనపై మాత్రం ఆ ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతుందన్న విషయం ఈ చమురు నిల్వల వ్యవహారంతో మరోసారి నిరూపితమైంది.
ప్రస్తుత ఇరాన్-అమెరికా ప్రతిష్టంభన నేపథ్యంలో చైనా వైఖరిని గమనిస్తే, ఆ దేశం ఈ సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడమే కాకుండా, భవిష్యత్తులో ప్రపంచ ఇంధన మార్కెట్‌ను శాసించే స్థాయికి చేరుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా విధిస్తున్న దిగ్బంధనాలు, యుద్ధ హెచ్చరికలు చైనాను పెద్దగా ప్రభావితం చేయలేకపోవడానికి కారణం ఈ భారీ చమురు నిల్వలేనని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications
