Bear Market: బేర్ మార్కెట్ అంటే ఏమిబేర్ మార్కెట్ అంటే ఏమిటి, ఇంతటి భారీ నష్టాల్లో షేర్లు కొనవచ్చా?
కరోనా వైరస్ భయాందోళనలతో ప్రపంచ మార్కెట్లు తీవ్రనష్టాల్లో ఉన్నాయి. భారత మార్కెట్లు గతంలో కనీవినీ ఎరగని విధంగా నష్టపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం 42,000 దాటి చూసిన సెన్సెక్స్ ఇప్పుడు 33,000కు దిగువన ఉంది. నిఫ్టీ 10,000కు దిగువన ఉంది. అమెరికా, జపాన్, చైనా.. ఇలా ఆ దేశం ఈ దేశం అనకుండా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు బేర్‌మంటున్నాయి. ఇప్పటికే అమెరికా బేర్ మార్కెట్ పరిధిలోకి వెళ్లాయి. నిఫ్టీ కూడా బేర్ మార్కెట్ పరిధిలోకి చేరింది. అసలు బేర్ మార్కెట్ అంటే ఏమిటి...?
కరోనా వైరస్ దెబ్బకు పాతాళానికి మార్కెట్లు, మరిన్ని కథనాలు

అమ్మకాలు ఎక్కువగా జరిగితే.. బేర్
ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్‌ని మహమ్మారిగా ప్రకటించిన తర్వాత ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. ఈ ప్రభావం భారత మార్కెట్లపై పడ్డాయి. దీంతో సెన్సెక్స్ దాదాపు 3,000 పాయింట్లు, నిఫ్టీ 900 పాయింట్లు నష్టపోయింది. పలు మార్కెట్లు బేర్ పరిధిలోకి వెళ్లాయి. అమ్మకాలు ఎక్కువగా జరిగే వాటిని బేర్ మార్కెట్ అంటారు.

20 శాతం పడిపోతే..
ఏదైనా ఒక స్టాక్ లేదా సూచీ ఇటీవలి కాలంలో అత్యధికంగా ట్రేడైన తర్వాత ఆ మార్క్ నుండి 20 శాతం కిందకు పడిపోతే దానిని బేర్ మార్కెట్‌గా వ్యవహరిస్తారు. సూచీలు లేదా స్టాక్స్‌లో భారీ అమ్మకాలకు ఇది సూచిక.

రిలయన్స్, టీసీఎస్, బ జాజ్, హెచ్‌డీఎఫ్‌సీ..
గురువారం నాటి భారీ నష్టాల నేపథ్యంలో నిఫ్టీలో 43 స్టాక్స్ బేర్ మార్కెట్ పరిధిలోకి ఎంటర్ అయ్యాయి. HDFC బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి పెద్ద కంపెనీలు కూడా ఈ పరిధిలోకి వచ్చాయి. ఉదయం నిఫ్టీ 50లోని 43 బేర్ మార్కెట్ పరిధిలో ఉన్నాయి. ఈ కంపెనీల స్టాక్స్ 20 శాతం పైగా పడిపోయాయి. HDFC బ్యాంకు, TCS, బ్రిటానియా, ICICI బ్యాంకు, HDFC, టైటాన్ కంపెనీ, బజాజ్ ఫిన్ సర్వ్ ఉన్నాయి.

ఇవన్నీ పడిపోయాయి..
నిఫ్టీ బ్యాంకు, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఆటో, నిఫ్టీ సీపీఎస్ఈలు ఇప్పటికే బేర్ మార్కెట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇటీవల ట్రేడ్ అయిన అత్యధిక మొత్తం కంటే 20 శాతం కంటే పైగా పడిపోయాయి.

అమెరికా, జపాన్ బేర్ మార్కెట్లోకి..
అమెరికాలో కూడా బేర్ మార్కెట్లోకి ప్రవేశించాయి. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత మరోసారి ఇలాంటి పరిస్థితి వచ్చింది అమెరికాకు. జపాన్ కూడా బేర్ మార్కెట్లో చేరిపోయింది.

బేర్ మార్కెట్‌కు కారణాలు..
నాలుగు దశాబ్దాల క్రితం అధిక వడ్డీ రేట్లు, పెరిగిన ద్రవ్యోల్భణం కారణంగా బేర్ మార్కెట్ పరిస్షితులు ఎదురయ్యాయి. 2,000 సంవత్సరంలో టెక్ మార్పులు, 2008లో ఆర్థిక సంక్షోభం, ఇప్పుడు కరోనా వైరస్, చమురు యుద్ధం వంటి వివిధ కారణాలతో మార్కెట్లు బేర్ మంటున్నాయి.

షేర్లు కొనుగోలు చేయవచ్చా?
ఇప్పుడు మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. తక్కువగా షేర్లు వస్తున్నాయని కొనుగోలు చేయాలా లేక నష్టాల్లో ఉన్నాయని ఊరుకోవాలా అనే సంధిగ్ధం నెలకొంటుంది. ఇలాంటి సమయాల్లో కొనుగోలు చేయకపోవడమే మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తుంటారు.

దీర్ఘకాలిక పెట్టుబడిదారు అయితే మంచి అవకాశం
ఇప్పటికే షేర్లను కొనుగోలు చేసినవారు తమ సంపదను కోల్పోయి ఉంటారు. వీటిని అమ్మితే వచ్చేదేమీ ఉండదు. కానీ దీర్ఘకాలిక పెట్టుబడిదారు అయితే ఇది మంచి అవకాశం. అయితే ప్రతి షేర్ మళ్లీ పుంజుకుంటుందని చెప్పలేం. ఏదైనా షేర్ మరీ నష్టాల్లోకి వెళ్లినా లేదా కంపెనీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నా చెప్పలేని పరిస్థితి. కానీ నిలకడగా ఉండే కంపెనీల షేర్లు మాత్రం కొనుగోలు చేస్తే దీర్ఘకాలంలో లాభదాయకమే. తక్కువ రేటుకు మంచి కంపెనీల షేర్లు కొనుగోలు చేయవచ్చు. గతంలో ఇలాంటి సమయంలో షేర్లు కొనుగోలు చేసి సంపాదించిన వారు ఉన్నారు. అన్నీ చూసుకోకుంటే నష్టపోయే అవకాశాలు ఎక్కువ.


Click it and Unblock the Notifications