Byju’s News: బైజూస్‌ను కోర్టుకు లాగిన బీసీసీఐ.. బకాయిల సెటిల్మెంట్..
Byju's News: బైజూస్ బకాయిపడ్డ స్పాన్సర్‌షిప్ మెుత్తంపై BCCI చట్టపరమైన చర్యలకు దిగింది. ఇప్పటికే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎడ్‌టెక్ స్టార్టప్ దీంతో తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది.
దాదాపు రూ.160 కోట్ల పెండింగ్‌లో ఉన్న స్పాన్సర్‌షిప్ బకాయిలపై BCCI బైజూస్‌ని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కి లాగింది. ఈ వివాదాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని స్టార్టప్ చూస్తోంది. ఈ విషయంలో వ్రాతపూర్వక ఒప్పందం లేనప్పటికీ.. BCCIతో తన స్పాన్సర్‌షిప్ ఒప్పందాన్ని గౌరవించేందుకు బైజూస్ నిబద్ధతను వ్యక్తం చేసింది. దీనిని పరిష్కరించుకుంటామంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం.

బైజూ తన స్పాన్సర్‌షిప్ హక్కులను BCCIతో నవంబర్ 2023 వరకు పొడిగించింది. అయితే ఈ ఏర్పాటును ముందుగానే ముగించాలని కోరింది. ఈ క్రమంలో డ్రీమ్ 11 సంస్థ టీమ్ ఇండియా ప్రధాన స్పాన్సర్‌గా బాధ్యతలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కంపెనీ ఆర్థిక ఒత్తిళ్లను తగ్గించడానికి, బకాయిల పరిష్కారానికి ప్రాధాన్యతలో భాగంగా US-ఆధారిత ఎపిక్ ప్లాట్‌ఫారమ్ వంటి ఆస్తులను విక్రయిస్తున్నట్లు నివేదించబడింది.
వారం కిందట రూ.9,362.35 కోట్ల ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ చట్టాల ఉల్లంఘించినందుకు ఈడీ అధికారులు బైజూస్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్‌లకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఇదే క్రమంలో కంపెనీ తన ఖర్చులను తగ్గించుకునేందుకు భారీగా ఉద్యోగుల తొలగింపులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆలాగే కొన్ని నెలల కిందట లోన్ చెల్లింపుల విషయంలోనూ డీఫాల్ట్ అయింది.


Click it and Unblock the Notifications