Gold: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద బంగారం ఎంత ఉందో తెలుసా..!
బంగారం ధరలు గత కొంత కాలంగా పెరుగుతోంది. ఏడాదిన్నర క్రితం నుంచి ఇప్పటి వరకు పసిడి ధర భారీగా పెరిగింది. దీనికి ప్రధాన కారణం.. అంతర్జాతీయ పరిస్థితులు, పలు సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోలు చేయడమని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తుంటాయి. ప్రపంచంలోని వివిధ దేశాల వద్ద భారీగా పసిడి నిల్వలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చైనా భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 10 కేంద్ర బ్యాంకుల్లో భారీగా పసిడి నిల్వలు ఉన్నాయి. యూఎస్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, జపాన్, భారత్, టర్కీ దేశాల సెంట్రల్ బ్యాంకుల వద్ద రూ.26,500 టన్నుల బంగారం ఉంది.
ఇందులో భారత్ వద్ద 880.52 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గత మంగళవారం పార్లమెంట్ లో ఒక ప్రకటన చేసింది. ఈ ప్రకటన సందర్భంగా భారతీయుల వద్ద ఎంత బంగారం ఉందని ప్రశ్నించగా.. దేశంలోని మతపరమైన ప్రదేశాలు, కుటుంబాల వద్ద ఎంత బంగారం ఉందనే సమాచారం తమ వద్ద లేదని ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం పేర్కొన్నారు. 2026 జూన్ 26 నాటి డేటా ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద 880.52 మెట్రిక్ టన్నుల బంగారం ఉందని ప్రకటించారు.

2025 మార్చి 31 నాటికి ఆర్‌బిఐ వద్ద 879.58 మెట్రిక్ టన్నుల బంగారం ఉందని పంకజ్ చౌదరి వివరించారు. అంతకు ముందు 2024 మార్చి 31 నాటికి, ఆర్‌బిఐ వద్ద 822.10 మెట్రిక్ టన్నుల బంగారం ఉండేదని గుర్తు చేశారు. అయితే భారతీయుల వద్ద భారీగా ఉన్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. భారతీయ ఇళ్లలో 34, 600 టన్నుల బంగారం ఉందని అధ్యయనాలు పేర్కొన్నాయి. భారతీయ ఇళ్లలో ఉన్న బంగారం నిల్వల విలువ దాదాపు 5 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువే. అంటే ఇది భారత జీడీపీ కంటే ఎక్కువ. భారత జీడీపీ దాదాపు 4.1 ట్రిలియన్ డాలర్లు. ఇక మన వద్ద బంగారంలో సుమారు 67 శాతం ఆభరణాల రూపంలోనే ఉంది.
చాలా దేశాల్లో పసిడిని పెట్టుబడిగా చూస్తారు. కానీ.. ఇండియాలో బంగారాన్ని స్టేటస్ గా చూస్తారు. సంప్రదాయ ఆచారాల్లో భాగంగా చూస్తారు. బాబు లేదా పాప పుడితే బారసాలకు బంగారం పెడతారు. పుట్టిన రోజు చేస్తే బంగారం పెడతారు. ఆడ బిడ్డకు ఫంక్షన్ చేస్తే బంగారం పెడతారు. ఇక పెళ్లి చేస్తే మామూలుగా ఉండదు. అందుకే భారతీయల్లో బంగారం భాగమైందని చెబుతారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications