Banks: సెప్టెంబర్ 11న బ్యాంకులు బంద్.. వరుసగా నాలుగు రోజులు మూతపడనున్న బ్యాంకులు..!
బ్యాంక్ యూనియన్ల సమ్మె నేపథ్యంలో సెప్టెంబర్ 11న దేశవ్యాప్తగా బ్యాంకులు మూతపడనున్నాయి. ఐదు రోజుల బ్యాంకింగ్ వారాన్ని అమలు చేయాలన్న తమ ప్రధాన డిమాండ్‌పై అనుకూలమైన నిర్ణయం లేదా స్పష్టమైన కాలపరిమితి లభించే వరకు సమ్మెను వాయిదా వేయబోమని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) పేర్కొంది. ప్రధాన కార్మిక కమిషనర్ (కేంద్ర) కార్యాలయంలో యూఎఫ్‌బీయూ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్‌ఎస్) మరియు కార్మిక అధికారుల ప్రతినిధులతో తాజా రాజీ చర్చలు జరిగాయి. సెప్టెంబర్ 11-13 తేదీలలో న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ నాయకుల సదస్సును దృష్టిలో ఉంచుకుని సమ్మె పిలుపును పునఃపరిశీలించాలని డీఎఫ్‌ఎస్ ప్రతినిధి బ్యాంక్ యూనియన్లకు విజ్ఞప్తి చేశారు.
అయితే ఐదు రోజుల పని వారాన్ని అమలు చేయడానికి అనుకూలమైన నిర్ణయం లేదా స్పష్టమైన కాలపరిమితి లేనంత వరకు సమ్మెను వాయిదా వేయలేమని యూనియన్లు స్పష్టం చేశాయి.
దేశంలోనే అతిపెద్ద రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), సెప్టెంబర్ 11 సమ్మెకు సంబంధించి UFBU నుంచి నోటీసు అందుకున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. సమ్మె రోజున తమ శాఖలు, కార్యాలయాలు యధావిధిగా పనిచేసేలా ఏర్పాట్లు చేశామని, అయినప్పటికీ బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రభావం పడొచ్చని ఎస్బీఐ హెచ్చరించింది. నగదు అవసరాల కోసం ఏటీఎంలు, డిపాజిట్ వెండింగ్ మెషిన్లను వినియోగించుకోవాలని ఖాతాదారులను కోరింది.

ప్రత్యామ్నాయంగా తమ కస్టమర్ సర్వీస్ పాయింట్లనూ వినియోగించుకోవాలని సూచించింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఇతర డిజిటల్ వేదికలు యథావిధిగా అందుబాటులో ఉంటాయని SBI స్పష్టం చేసింది. సెప్టెంబర్ 11న సమ్మె, 12 రెండో శనివారం, 13న ఆదివారం, 14న వినాయక చవితి. దీంతో బ్యాంకులకు వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు మూత పడనున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో పని ఉన్నవారు. సెలవులను బట్టి ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 11న ప్రైవేట్ బ్యాంకులు యథావిధిగా పని చేయనున్నాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంకు, యాక్సెస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యెస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంకులు రేపు పని చేయనున్నాయి. కాగా బ్యాంకు ఉద్యోగులు లేవనెత్తిన ఆందోళనల నేపథ్యంలో, ప్రభుత్వ రంగ బ్యాంకుల సీనియర్ అధికారులకు ఇచ్చే పనితీరు ఆధారిత ప్రోత్సాహక (PLI) పథకం అమలును ప్రభుత్వం సెప్టెంబర్ 7న 2025-26 ఆర్థిక సంవత్సరానికి నిలిపివేసింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
