ఖాతాదారులకు బ్యాంకుల ఛార్జీల మోత.. గత 4 ఏళ్లలో ఎంత వసూలు చేశాయో తెలుసా..?
Bank Charges: ప్రస్తుతం భారత బ్యాంకింగ్ రంగం మంచి జోరు మీద ఉంది. జూన్ తో ముగిసిన త్రైమాసికానికిగాను దాదాపు బ్యాంకులన్నీ పాజిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేశాయి. అయితే ఇందులో కొంత భాగం ఖాతాదారుల ముక్కుపిండి వసూలు చేసింది కావడం గమనార్హం. వివిధ రకాల ఛార్జీలు వినియోగదారులపై బాది భారీ మొత్తాన్ని బ్యాంకులు వెనకేసుకున్నట్లు తెలుస్తోంది.
దేశంలోని ప్రభుత్వం రంగ బ్యాంకులతోపాటు ప్రైవేటు రంగానికి చెందిన HDFC, ICICI, యాక్సిస్, ఇండస్ ఇండ్, IDBIలు ఈ ఛార్జీల ద్వారా పెద్ద మొత్తంలో లబ్ధి పొందినట్లు సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖే ప్రకటించింది. 2018 నుంచి 35 వేల కోట్లకు పైగా వినియోగదారుల నుంచి ఛార్జీల రూపంలో వసూలు చేస్తున్నట్లు పార్లమెంటుకు వెల్లడించింది.

ఖాతాలో మినిమం బాలన్స్ మెయింటెనె చేయనందుకు, పరిమితికి మించి ATM ద్వారా లావా దేవీలు జరిపినందుకు, SMS సేవలు అందించినందుకుగాను ఈ మొత్తాన్ని వసూలు చేసినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగత్ కరద్ రాజ్యసభకు వివరించారు. కనీస నిల్వ కేటగిరీ నుంచి 21 వేల కోట్లు, ATM ఛార్జీలు కింద 8 వేల కోట్లు, SMS సేవల ద్వారా 6 వేల కోట్లకు పైగా సేకరించినట్లు రాతపూర్వకంగా తెలియజేశారు.
ప్రధానమంత్రి జన్ ధన్ ఖాతాలు మినహా అన్ని రకాల సేవింగ్స్ అకౌంట్స్ లో మినిమం బాలన్స్ ఉంచాల్సి ఉంటుంది. నెలకు 5 ATM లావాదేవీలను ఆయా బ్యాంకులు ఉచితంగా అందిస్తున్నాయి. పరిమితికి మించి డ్రా చేస్తే ట్రాన్సాక్షన్ కు 21 చొప్పున సమర్పించుకోవాల్సి వస్తుంది. ఇక బ్యాంకు ఖాతా ద్వారా జరిగే ప్రతి లావాదేవీలను ఎప్పటికప్పుడు కస్టమర్స్ మెసేజ్ రూపంలో పొందడం కోసం బ్యాంకులు SMS ఛార్జీలను విధిస్తున్నాయి.


Click it and Unblock the Notifications