కరోనా ఎఫెక్ట్: ఆ నిర్ణయంతో బ్యాంకులకే లాభం!
కొన్నిసార్లు మనకు ప్రయోజనకరంగా కనిపించే నిర్ణయాలు నిజానికి నష్టాలనే తెచ్చేలా ఉండొచ్చు. ఇటీవల రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకున్న నిర్ణయం కూడా ఇలాంటిదే. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అన్ని రకాల కంపెనీలు, కార్యాలయాలు మూతపడ్డాయి. కుదిరిన కొన్ని రంగాల వారికి వర్క్ ఫ్రొం హోమ్ ఆప్షన్ ఇచ్చారు. చాలా మందికి పని లేకుండా పోయింది. వీరందరికీ కొంత ఉపశమనం కల్పించేందుకు మన రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ... ఒక మహత్తర నిర్ణయం ప్రకటించింది.
ఆర్థికంగా కష్టాల్లో ఉన్న వారందరికీ ప్రయోజనం చేకూరేలా ప్రతి ఒక్కరు వారు చెల్లించాల్సిన రుణాల ను మూడు నెలల వరకు తాత్కాలికంగా వాయిదా వేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు బ్యాంకులకు ఆదేశాలను జారీ చేసింది. ఇది ఇప్పటికే అమల్లోకి వచ్చేసింది కూడా. దీంతో ప్రజలంతా చాలా సంతోషపడ్డారు. హమ్మయ్య, మనకు భారీ ఊరట లభించింది అని ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇంతలోనే బ్యాంకులు అసలు విషయం కుండబద్దలు కొట్టాయి.

అదనపు వడ్డీ ఆదాయం...
మారటోరియం నిర్ణయంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్న విషయం కరెక్టే. కానీ, వారు వాయిదా వేసుకున్న మూడు నెలల కాలానికి చెల్లించాల్సిన వడ్డీ పై మరో వడ్డీ బాదుతారు. ఈ విషయాన్నీ బ్యాంకులు స్పష్టం చేశాయి. మనకు తాత్కాలికంగా మూడు నెలల వెసులుబాటు లభిస్తుంది కానీ ఆ తర్వాత అదనపు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ అనేది బ్యాంకులకు లాభం. ప్రస్తుతం ఎవరూ రుణాలు తిరిగి చెల్లించటం లేదు కావొచ్చు కానీ... బ్యాంకులకు మాత్రం అదనపు రాబడికి అవకాశం ఏర్పడింది. మహా అంటే లాక్ డౌన్ ఈ నెల చివరి వరకు కొనసాగించే అవకాశం ఉంది. కానీ మే నెల మొదటి వారం నుంచి అన్నీ నార్మల్ గా పనిచేస్తాయి. ఇక జూన్ నుంచి మళ్ళీ అందరూ తాము వాయిదా వేసుకున్న ఈఎంఐ లను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.. అదనపు వడ్డీ తో సహా.

ఆర్బీఐ నుంచి రూ 1.37 లక్షల కోట్లు..
బ్యాంకులకు మరో రకంగా కూడా ప్రయోజనం చేకూరింది. ఆర్బీఐ ఇటీవలే రేపో, రివర్స్ రేపో రేట్లను భారీగా తగ్గించింది. క్యాష్ రిజర్వు రేషియో (సీఆర్ ఆర్ ) కూడా 100 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో బ్యాంకులకు అదనంగా రూ 1.37 లక్షల కోట్ల నిధులు సమకూరాయి. అంటే, ప్రస్తుతం బ్యాంకులకు నిధుల కొరత అనేది లేదు. పైగా రుణాలపై అవి వడ్డీ తగ్గించి కొత్త రుణాలను మంజూరు చేసేందుకు తగిన నిధులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ సమయంలో కొత్త రుణాలు ఎవరూ తీసుకోరు కాబట్టి, బ్యాంకులకు ఆదాయం దెబ్బతింటుందని అనుకుంటారు. కానీ, ఇప్పుడు అమల్లో ఉన్న మారటోరియం వల్ల బ్యాంకులు కొత్త రుణాలు మంజూరు చేయక పోయినా.. ప్రస్తుతం బ్యాంకుల మొత్తం రుణాలపై అదనపు వడ్డీ వస్తోంది కాబట్టి వాటికి మూడు నెలల కాలానికి కొత్త రుణాలను మంజూరు చేయకపోయినా వచ్చే నష్టమేమి లేదని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ప్రభుత్వమే భరించాలి...
ఎంత మంది గమనిస్తున్నారో లేదో తెలియదు కానీ... ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు అన్నీ కూడా చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. కానీ అమల్లోకి వచ్చేప్పటికి అవి లబ్ధిదారులకు అదనపు భారాన్ని మోపేలా ఉంటున్నాయి. అందుకే, ప్రస్తుత 3 నెలల మారటోరియం సమయానికి వినియోగదారులు చెల్లించాల్సిన వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. అంత వరకు ఆర్బీఐ నుంచి అదనపు కరెన్సీ ముద్రణ ద్వారా ఈ నిర్ణయాన్ని అమలు చేయవచ్చని చెబుతున్నారు. అసలే ఉద్యోగాలు పోయి, ఆదాయాలు దెబ్బతిన్న ప్రజలకు బతుకే భారంగా మారిపోయింది. ఇక వారు మారటోరియం రూపంలో అదనపు వడ్డీలు ఎలా చెల్లించగలరని ప్రశ్నిస్తున్నారు. బ్యాంకులకు మాత్రమే ప్రయోజనకరంగా ఉన్న ఈ నిర్ణయాన్ని పునర్ సమీక్షించాలని కోరుతున్నారు.


Click it and Unblock the Notifications