ముంబై: బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల కార్యాలయాల పని వేళలను రిజర్వుబ్యాంక్ సవరించింది. కొత్త వేళలను వెల్లడించింది. ఈ మేరకు భారతీయ రిజర్వుబ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఓ కీలక ప్రకటనను విడుదల చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇదివరకు కుదించిన బ్యాంకుల సమయాన్ని మళ్లీ పునరుద్ధరించనున్నట్లు పేర్కొన్నారు. సమయాన్ని కుదించిన బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు ఇది వర్తిస్తుందని శక్తికాంత దాస్ తెలిపారు.
దీనితోపాటు- ఏటీఎంలల్లో కార్డు రహిత నగదు విత్‌డ్రాలను కూడా అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు చెప్పారు. గవర్నర్ శక్తికాంత దాస్ విడుదల చేసిన ఈ ప్రకటన ప్రకారం- బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల కార్యకలాపాలు ఉదయం 9 గంటలకే ప్రారంభమౌతాయి. ఈ నెల 18వ తేదీ నుంచి కొత్త పని వేళలు అందుబాటులోకి వస్తాయి. అరగంట ముందుగానే అవి తెరచుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం వేళ ఎన్నిగంటలకు వాటిని మూసివేయాల్సి ఉంటుందనేది ఈ ప్రకటనలో పొందుపరచలేదు.

అరగంట ముందుగా తెరచుకోవాల్సి రావడం వల్ల ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలను అందించినట్టువుతుందని, వారి సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని గవర్నర్ వివరించారు. ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాపైనా ఆయన కీలక ప్రకటన చేశారు. త్వరలో అన్ని బ్యాంకుల ఖాతాదారులు తమ వద్ద కార్డు లేకపోయినా ఏటీఎంల నుంచి నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనికి యూనైటెడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ)లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండటం తప్పనిసరి చేసినట్లు వివరించారు.
దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను త్వరలోనే ఖరారు చేస్తామని వెల్లడించారు. కార్డ్‌లెస్ ట్రాన్సాక్షన్స్ వల్ల వినియోగదారులు మోసాలకు గురి కాబోరని, వాటిని అరికట్టడానికే ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకుని రానున్నామని చెప్పారు. జాతీయ, ప్రైవేటు బ్యాంకులన్నీ ఒకేదఫాలో ఖాతాదారుల కోసం కార్డ్‌లెస్ ఏటీఎం లావాదేవీలను అమలు చేసేలా మార్గదర్శకాలు, విధి విధానాలను రూపొందిస్తామని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications