Go First: గో ఫస్ట్ దివాలాతో మునిగిన బ్యాంక్స్.. ఎన్ని వేల కోట్లంటే..?
Go First: వాడియా గ్రూప్ యాజమాన్యంలోని గో ఫస్ట్ విమానయాన సంస్థ నిన్న దివాలా ప్రక్రియకు దాఖలు చేసింది. విమానాలను నడిపేందుకు సైతం డబ్బు కొరత ఏర్పడటంతో కంపెనీ తాత్కాలికంగా తన సేవలను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.
భారతీయ విమానయాన సంస్థ గో ఫస్ట్ రుణదాతలకు ఏకంగా రూ.6,521 కోట్ల మేర బకాయి పడినట్లు తన దివాలా దాఖలు పత్రాల్లో వెల్లడించింది. అయితే ఏప్రిల్ 30 నాటికి చెల్లించాల్సిన బకాయిలను కంపెనీ డిఫాల్ట్ చేయలేదని వెల్లడించింది. కంపెనీ స్వచ్చందంగా దివాలా కోసం ఫైల్ చేయాలనే ఎయిర్‌లైన్ ప్లాన్‌ల గురించి రుణదాతలకు తెలియదు.

తాజా పరిస్థితుల నేపథ్యంలో రుణదాతలు ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించేందుకు సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీ వెల్లడించిన సమాచారం ప్రకారం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, IDBI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, డ్యూయిష్ బ్యాంక్‌లు గో ఫస్ట్ సంస్థకు రుణాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రభావం ఎంత వరకు ఉంటుందనే దానిపై బ్యాంకులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
దివాలా తీసిన గో ఫస్ట్ విమానయాన కంపెనీకి మెుత్తంగా రూ.11,463 కోట్ల మేర అప్పులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న ఆస్తులు అప్పుల చెల్లింపులకు సరిపోవని తెలుస్తోంది. కంపెనీ ఆపరేషనల్ క్రెడిటార్లకు చెల్లింపులను డిఫాల్ట్ చేసింది. ఇందులో విక్రేతలకు రూ.1,202 కోట్లు, విమానాల అద్దెదారులకు రూ.2,660 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇదే క్రమంలో ఎయిర్‌క్రాఫ్ట్ లీజు ఒప్పందాలను రద్దు చేయడానికి లీజర్‌ల నుంచి నోటీసులు అందాయని.. విమానాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సదరు కంపెనీలు చర్యలు ప్రారంభించాయని గో ఫస్ట్ తన ఫైలింగ్స్‌లో వెల్లడించింది.


Click it and Unblock the Notifications