కరోనా దెబ్బకు చిన్న కంపెనీలు దివాలా తీసే స్థితి .. అదే జరిగితే బ్యాంకులకు షాక్
కరోనా మహమ్మారి ప్రభావం చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా భారీ నుండి మధ్యతరహా చిన్న పరిశ్రమల దాకా పడింది . కరోనా కోరల్లో చిక్కుకుని అన్ని రంగాల కంపెనీలూ ఆర్థికంగా చితికి పోతున్నాయి. నష్టాల ఊబిలో చిక్కుకుపోతున్నాయి. బయట పడతామో లేదో తెలీని స్థితికి చేరుకుంటున్నాయి. ఈ లాక్‌డౌన్‌తో పెద్ద పరిశ్రమల కంటే భారీగా దెబ్బ తింటుంది పూర్తిగా కుదేలవుతుంది మాత్రం చిన్న చిన్న కంపెనీలే .

కరోనా దెబ్బకు దివాలా అంచులలో చిన్న పరిశ్రమలు
కరోనా దెబ్బకు చిన్న చిన్న వ్యాపార సంస్థల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది. కొన్ని సంస్థలైతే దివాలా తీసే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. చాలా సంస్థలు ఆర్ధిక నష్టాలతో కోలుకోలేక ప్రమాదం అంచున ఉన్నాయి . అదే జరిగితే చిన్న చిన్న కంపెనీలు దివాలా తీసి మూత పడితే మొదటి షాక్ బ్యాంకులకు తగులుతుంది. చిన్న చిన్న సంస్థలకు రుణాలిచ్చి ఆ రుణాలను తిరిగి వారు చెల్లించకుండానే దివాలా తీస్తే వీటి నుంచి బ్యాంకులకు రావలసిన రూ.2.32 లక్షల కోట్ల రుణాలు మొండి బకాయిలుగా ఎన్‌పీఏ లు గా మారే ప్రమాదం ఉందని ట్రాన్స్ యూనియన్ సిబిల్ ఒక నివేదికలో పేర్కొంది.

పెద్ద సంస్థలతో పోలిస్తే చిన్న చిన్న రిటైల్ సంస్థల ఖర్చులే ఎక్కువ
ఇక ఆ నివేదిక ప్రకారం ముఖ్యంగా ‘రిటైల్' రంగంపై ఖర్చుల భారం బాగా పెరిగిందని పేర్కొంది . లాక్‌డౌన్‌తో రిటల్ వ్యాపార సంస్థల ఖర్చులు 10 నుంచి 35 శాతం వరకు పెరిగి పోయాయని నివేదిక వెల్లడించింది .పెద్ద పెద్ద సంస్థలతో పోలిస్తే చిన్న చిన్న రిటైల్ సంస్థలపై ఈ భారం మరింత ఎక్కువగా ఉందని పేర్కొంది . పెద్ద పెద్ద రిటైల్ సంస్థల నిర్వహణ ఖర్చులు 10-15 శాతం పెరిగితే, చిన్న చిన్న రిటైల్ సంస్థల ఖర్చులు మాత్రం 30-35 శాతం పెరిగాయని అంచనా వేస్తున్నారు .

లాక్ డౌన్ తీసేసినా ఆంక్షలతో రిటైల్ రంగానికి తీవ్ర నష్టం
ఇక లాక్ డౌన్ నిబంధనలు తొలగించినా సరే చిన్న చిన్న సంస్థలు కోలుకునే పరిస్థితి లేదని , సామాజిక దూరం, టోకెన్ విధానంతో సహా అనేక నిబంధనలు పాటించాల్సి రావడం రిటైల్ రంగానికి మరింత నష్టం అని తెలుస్తుంది . ఇక ప్రతి ఒక్కరిలో భవిష్యత్ విషయంలో ఒక ఆందోళన ఉంది . కరోనా మబ్బులు ఎప్పుడు తొలగుతాయో అని ఆందోళనలో ఉన్న ప్రజలు ఆచి తూచి అత్యవసరం అనుకుంటేనే వ్యయం చేస్తారు. ఇక ఈ పరిస్థితులు కూడా చిన్న చిన్న కంపెనీలకు ఇబ్బందిగా మారతాయని భావిస్తున్న పరిస్థితి లేకపోలేదు. అందుకే చాలా కంపెనీలు దివాలా దిశగా పయనిస్తున్నాయన్న అంశం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది.


Click it and Unblock the Notifications