భారత ఆర్థిక వ్యవస్థపై ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకింగ్ సెక్టార్ తీవ్ర ఒత్తిడిలో ఉందని, దీనిని ప్రభుత్వం కూడా బయటపడేసే పరిస్థితుల్లో లేదన్నారు. కార్లు, బైక్స్ డిమాండ్ తగ్గడాన్ని ఆయన ప్రస్తావించారు. మన ఆర్థిక వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోందనేందుకు ఆటోమొబైల్ పరిశ్రమ పడిపోవడమే కారణమన్నారు. జైపూర్ లిటరేచర్ ఫెస్టివెల్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రజలు ఖర్చులకు వెనుకాడుతున్నారు
ప్రస్తుతం ఆర్థిక రంగం అత్యంత ఆందోళన కలిగించే అంశమని అభిజిత్ బెనర్జీ అన్నారు. ఇటీవలి కాలంలో ఫైనాన్షియల్ సెక్టార్ తీవ్ర ఒత్తిడిలో ఉందన్నారు. బ్యాంకులను బెయిలవుట్ చేసే పరిస్థితి కనిపించడం లేదని, ప్రభుత్వానికి ఇది ఖరీదైనదని, అలాగే లాంగ్ ప్రెసెస్‌తో కూడుకున్నదని చెప్పారు. కార్లు, బైక్స్ కొనుగోలు తగ్గడం కూడా మందగమనానికి అద్దం పడుతున్నాయన్నారు. ప్రజలు ఖర్చుకు వెనుకాడుతున్నారన్నారు.

పట్టణాల నుంచి నిధులు పంపించడం తగ్గిపోతుంది
ఇటీవలి కాలంలో జీడీపీ భారీగా పడిపోయిందని అభిజిత్ బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పేదరిక నిర్మూలన ప్రయత్నాలను దెబ్బ తీస్తుందని చెప్పారు. పట్టణ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయని, మందగమనంతో పట్టణాల్లో తక్కువ నైపుణ్యాలు ఉన్న పనులలో ఉన్న గ్రామీణ ప్రజలు ఇళ్లకు పంపించే నిధులు బాగా పడిపోతాయన్నారు. దీని ప్రభావం గ్రామీణ పేదరిక నిర్మూలన పైనా ఉంటుందన్నారు.

ఇన్వెస్టర్లు వెనక్కి వెళ్లే ప్రమాదం
ప్రభుత్వ ఆర్థిక గణాంకాలపై నమ్మకం పోతే ఆర్థిక విధానాలు పని చేయడం కూడా కష్టమవుతుందని అభిజిత్ బెనర్జీ అన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో ఆందోళన చెందాలన్నారు. విశ్వసనీయ గణాంకాలు లేకపోతే విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.


Click it and Unblock the Notifications