UPI News: దేశంలో నగదు చెల్లింపుల స్వరూపాన్ని డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ పూర్తిగా మార్చేసింది. ప్రధానంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూపీఐ చెల్లింపుల విధానం ఊహించని స్వీకరణను ప్రజల నుంచి పొందింది.
ప్రస్తుతం యూపీఐ చెల్లింపుల వ్యవస్థ అనేక కొత్త సేవలను ప్రజలకు దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తోంది. కొన్ని నెలల కిందట రూపే క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ చెల్లింపులను దేశవ్యాప్తంగా అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అలాగే దీని తర్వాత ఏటీఎం మెషిన్లలో డెబిట్ కార్డ్ లేకుండానే యూపీఐ ద్వారా డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు చర్యలు వేగవంతం అయ్యాయి. ప్రపంచ దేశాలు సైతం సులభతరమైన చెల్లింపుల విధానంగా యూపీఐని గుర్తించిన సంగతి తెలిసిందే.

ఇటీవల రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా UPI Now Pay Later సేవలను బ్యాంకులు తమ కస్టమర్లకు ఆఫర్ చేసేందుకు మద్ధతును ప్రకటించింది. దీంతో దేశంలో తొలిసారిగా ప్రైవేటు రంగంలోని బ్యాంకింగ్ దిగ్గజాలైన హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐలు తమ ఖాతాదారులకు కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. దీని ప్రకారం వారు తమ బ్యాంక్ ఖాతాలో డబ్బు లేనప్పటికీ యూపీఐ ద్వారా చెల్లింపులు చేసేందుకు వెసులుబాటుకు కల్పిస్తున్నాయి. దీంతో 'యూపీఐ నౌ పే లేటర్' అనే కొత్త సదుపాయాన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టాయి. ఇప్పటి వరకు యూపీఐ వినియోగదారులు తమ సేవింగ్స్ ఖాతా, క్రెడిట్ కార్డ్ లేదా ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతాను UPIకి లింక్ చేయడం ద్వారా మాత్రమే చెల్లింపులు చేసేవారు.
ఈ సౌకర్యం కింద కస్టమర్లకు నిర్థేశించిన పరిమితి వరకు జీరో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ యూపీఐ చెల్లింపులు చేసుకునేందుకు బ్యాంకులు అనుమతిస్తున్నాయి. దీనికోసం బ్యాంకులు తమ కస్టమర్‌లకు 'ముందస్తు ఆమోదం పొందిన క్రెడిట్ లైన్'ని అందిస్తాయి. దీనిని ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న పేమెంట్ యాప్స్ ద్వారా తమ లింక్ చేసిన బ్యాంక్ ఇచ్చిన సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఇలా వాడిన ఓవర్ డ్రాఫ్ట్ మెుత్తంపై ఎంత వడ్డీ వసూలు చేయాలనే నిర్ణయాన్ని RBI బ్యాంకులకే వదిలేసింది. అందువల్ల మంచి క్రెడిట్ హిస్టరీ ఉన్న ఖాతాదారులకు బ్యాంకులు ముందుగా ఈ సౌకర్యాన్ని అందించవచ్చని తెలుస్తోంది. దీనికి సంబంధించిన షరతులు బ్యాంకులను బట్టి మారే అవకాశం ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications