SBI Hikes FD Rates: దేశంలోని ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తన వడ్డీ రేట్లను సవరించింది. దీంతో బ్యాంక్ కస్టమర్లు సంతోషంలో ఉన్నారు. పెరిగిన వడ్డీ రేట్ల వివరాలను పరిశీలిస్తే..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసిన స్వల్పకాలిక మెచ్యూరిటీ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను 25-75 బేసిస్ పాయింట్లను పెంచింది. దేశంలోని ఇతర బ్యాంకులు సైతం ప్రస్తుతం ఎస్బీఐ చర్యను ఫాలో అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎస్‌బీఐ రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై దృష్టి సారించి రేట్ల సవరణలను తీసుకొచ్చింది. ఈ క్రమంలో బ్యాంక్ 46 రోజుల నుంచి 179 రోజుల వరకు, 180 రోజుల నుంచి 210 రోజుల వరకు, 211 రోజుల నుంచి ఏడాది లోపు కాలానికి చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లతో సహా వివిధ కాల వ్యవధులకు చేసే డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది.

46-179 రోజుల టర్మ్ డిపాజిట్ల కోసం బ్యాంక్ మునుపటి 4.75 శాతంపై 75 బేసిస్ పాయింట్లు వడ్డీని పెంచి ప్రస్తుతం 5.50 శాతం ఆఫర్ చేస్తోంది. మిగిలిన రెండు మెచ్యూరిటీ కాలాలకు 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటును పెంచింది. ఈ క్రమంలో 180-210 రోజుల కాలానికి తాజా వడ్డీ రేటు 6 శాతంగా ఉండగా.. 211 రోజుల నుంచి ఏడాదిలోపు కాలానికి చేసే పెట్టుబడులపై ఇన్వెస్టర్లకు 6.25 శాతంగా ఉన్నట్లు బ్యాంక్ ప్రకటించింది. అయితే పెరిగిన వడ్డీ రేట్లు మే 15 నుంచి అమలులోకి వచ్చినట్లు వెల్లడించింది.
ఏప్రిల్ 2024లో RBI గవర్నర్ శక్తికాంత దాస్ నిర్వహించిన ద్రవ్య విధాన కమిటీ(MPC) రెపో రేటును వరుసగా ఏడోసారి సైతం 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగించాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా బ్యాంకింగ్ దిగ్గజం వడ్డీ రేట్లలో పెంపును ప్రకటించింది. రెపో రేటు పెంపు విరామానికి ముందు వరకు పలు దఫాల్లో రిజర్వు బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను ఏకంగా 250 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. వరుసగా ఆరుసార్లు వడ్డీ రేట్లను పెంపును ప్రకటించిన సంగతి తెలిసిందే. సాధారణంగా భారత సెంట్రల్ బ్యాంక్ అమెరికా ఫెడ్ ప్రకటనకు అనుగుణంగా మార్పుల్లో సవరణలు చేస్తూ పోతోంది. అయితే వాస్తవానికి రిజర్వు బ్యాంక్ పెంచిన వడ్డీ రేట్లు బ్యాంకు డిపాజిట్ రేట్లలో పూర్తిగా ప్రతిబింబించలేదు. కొన్ని బ్యాంకులు మొదట్లో తమ ఎఫ్‌డి రేట్లను పెంచడంలో ఆలస్యం చేశాయి. అయితే ఆర్‌బీఐ చర్యలకు అనుగుణంగా తన వడ్డీ రేట్లను పెంచుతూ వస్తోంది.


Click it and Unblock the Notifications