రుణాలిచ్చేందుకు నిధులతో సిద్ధంగా ఉన్నాం, మీరే తీసుకోవట్లేదు: కార్పోరేట్లకు SBI చైర్మన్
న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవాలని, ఆ తర్వాత వాటిని పెట్టుబడులుగా పెట్టుకోవాలని దేశీయ వ్యాపార, పారిశ్రామికరంగానికి ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం SBI చైర్మన్ రజనీష్ కుమార్ పిలుపునిచ్చారు. బ్యాంకుల వద్ద నిధులకు కొదువ లేదని, వచ్చే ఏడాది మార్చి ఆఖరుకల్లా మరిన్ని బ్యాంకులు ఆర్థికంగా పరిపుష్టం కానున్నాయన్నారు. ఈ క్రమంలో బ్యాంకుల నుంచి రుణాలు పొంది, ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలన్నారు.

5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా...
శనివారం ఫిక్కీ 92వ వార్షిక సదస్సులో రజనీష్ కుమార్ మాట్లాడారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని పెట్టుబడులు పెడితే రుణ పరపతి పెరుగుతుందన్నారు. భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని అందుకోవాలంటే భారీగా పెట్టుబడులు అవసరమన్నారు. నేడు బ్యాంకింగ్ క్రెడిట్ పరిమాణం రూ.96 లక్షల కోట్లుగా ఉందని, 5 లక్షల కోట్ల డాలర్ల జీడీపీ సాధనకు ఈ పరిమాణం రెట్టింపు కావాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఎస్బీఐ రుణ పరిమితి రూ.8 లక్షల కోట్లు
వివిధ రంగాలకు చెందిన కార్పోరేట్లు రుణాలు తీసుకొని, ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులకు ఊతం ఇవ్వాలని కోరారు. బ్యాంకుల రుణ జారీ పరిమితికి సరిపడా పరిశ్రమ నుంచి గిరాకీ ఉండటం లేదని చెప్పారు. ఎస్బీఐకి ప్రస్తుతం రూ.8 లక్షల కోట్ల రుణ జారీ పరిమితి ఉందని, కానీ ఇప్పటి దాకా రూ.5 లక్షల నుంచి ఆరు లక్షల కోట్ల మేరకే డిమాండ్ కనిపించిందన్నారు.

మేం రుణాలిస్తామంటే మీరే తీసుకోవట్లేదు
తాము నిధులతో సిద్ధంగా ఉన్నామని, కానీ మీరే తీసుకోవడం లేదని రజనీష్ కుమార్ అన్నారు. రుణ ఎగవేతకు అవకాశాలు ఎక్కువ కాబట్టి స్పెక్ట్రమ్ కొనుగోళ్ళకు మాత్రం రుణాలు ఇచ్చే సమయంలో జాగ్రత్తలు అవసరమని చెప్పారు.


Click it and Unblock the Notifications