నవంబర్ 1, 2025 నుండి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల్లో కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనలు బ్యాంకు కస్టమర్ల ఆర్థిక భద్రతను పెంచడమే కాకుండా, క్లెయిమ్ పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయడానికీ దోహదపడతాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల ప్రకటించిన ఈ మార్పులు బ్యాంకింగ్ రంగంలో ఒక పెద్ద సంస్కరణగా భావించబడుతున్నాయి.
గతంలో, ఒక్కో బ్యాంక్ ఖాతాకు గరిష్టంగా ఇద్దరు నామినీలను మాత్రమే జోడించగలిగే అవకాశం ఉండేది. అయితే కొత్త నియమాల ప్రకారం, నవంబర్ 1 నుండి ప్రతి ఖాతాకు గరిష్టంగా నలుగురు నామినీలను చేర్చుకోవచ్చు. ఇది ఖాతాదారులకు తమ డబ్బు, ఆస్తులపై మరింత నియంత్రణను ఇస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తికి భార్య, పిల్లలు లేదా తల్లిదండ్రులు ఉన్నప్పుడు, వారందరినీ నామినీలుగా చేర్చుకోవడం ఇప్పుడు సాధ్యం కానుంది. ఇది భవిష్యత్తులో క్లెయిమ్ ప్రక్రియలో తగాదాలు లేదా ఆలస్యం జరగకుండా నివారించడంలో సహాయపడుతుంది.

అదనంగా బ్యాంకులు ఇకపై నామినీల మొబైల్ నంబర్, ఇమెయిల్ చిరునామాను కూడా తప్పనిసరిగా నమోదు చేయాలి. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో.. ముఖ్యంగా ఖాతాదారుడు మరణించినప్పుడు, బ్యాంక్ నామినీకి తక్షణ సమాచారాన్ని బ్యాంక్ అందిస్తుంది. ఇది నిధుల బదిలీ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే నామినీలకు సౌలభ్యాన్ని కలిగిస్తుంది.
ఈ మార్పులు బ్యాంకింగ్ చట్టాల (సవరణ) చట్టం, 2025 ఆధారంగా అమలు చేయబడుతున్నాయి. RBI అన్ని షెడ్యూల్డ్ బ్యాంకులకు ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ నిర్ణయం బ్యాంకు వ్యవస్థలో పారదర్శకతను పెంచడంతో పాటు కస్టమర్ సేవల నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, బ్యాంకులు ఇప్పుడు తమ లాకర్ సదుపాయాలకు కూడా కొత్త భద్రతా నియమాలను అమలు చేయబోతున్నాయి. లాకర్ ఒప్పందాలు ఇప్పుడు మరింత స్పష్టంగా ఉండాలి. నామినీ వివరాలు అందుబాటులో ఉంచడం తప్పనిసరిగా ఉంటుంది. దీని వల్ల లాకర్ క్లెయిమ్ ప్రక్రియలోనూ గందరగోళం తగ్గుతుంది.
బ్యాంకింగ్ రంగ నిపుణుల ప్రకారం, ఈ మార్పులు కస్టమర్లకు భద్రతతో కూడిన అనుభవాన్ని అందిస్తాయి. అలాగే, కొత్త నిబంధనలు టెక్నాలజీ ఆధారంగా ఖాతాదారుల సమాచారాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి దోహదపడతాయి. డిజిటల్ బ్యాంకింగ్ విస్తరిస్తున్న ఈ రోజుల్లో ఈ నియమాలు కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని మరింత రక్షణతో ఉంచుతాయని వారు చెబుతున్నారు.
ఏదేమైనా.. November 1 నుండి అమల్లోకి వచ్చే ఈ కొత్త బ్యాంక్ నియమాలు ఖాతాదారులకు మరింత భద్రత, స్వేచ్ఛ, పారదర్శకత, విశ్వాసాన్ని అందిస్తాయి. నామినీల సంఖ్య పెరగడం వల్ల కుటుంబ సభ్యుల ఆర్థిక భద్రత బలపడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో నామినీలకు త్వరగా సమాచారం చేరడం వల్ల ఆలస్యం లేకుండా నిధుల బదిలీ సాధ్యమవుతుంది. ఈ మార్పులు బ్యాంకింగ్ రంగానికి ఒక మైలురాయిగా నిలుస్తాయని, ఖాతాదారుల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడంలో ఇది ఒక సానుకూల అడుగుగా భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications