వేతన సవరణకు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రేపటి నుంచి రెండ్రోజుల పాటు బ్యాంకు యూనియన్లు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమయ్యాయి. జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీలలో వివిధ బ్యాంకు యూనియన్లు సమ్మెలో పాల్గొంటున్నాయి. ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఇతర PSU బ్యాంకులు ఇప్పటికే తమ కస్టమర్లకు సమ్మెపై హెచ్చరికలు జారీ చేశాయి. కొన్ని బ్యాంకు యూనియన్ల సమ్మె కారణంగా బ్యాంకు కార్యకలాపాలు ప్రభావితమవుతాయని కస్టమర్లకు తెలియజేశాయి.

సమ్మెలో పాల్గొనే యూనియన్లు
తక్షణ వేతన సవరణని డిమాండ్ చేస్తూ 9 బ్యాంక్ యూనియన్ల సమాఖ్య యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ (UFBU) సమ్మెకు పిలుపునిచ్చింది. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంకు వర్కర్స్ (NOBW) తదితర యూనియన్లు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి.

వరుసగా మూడ్రోజులు సెలవు
సమ్మె కారణంగా జనవరి 31 (శుక్రవారం), ఫిబ్రవరి 1 (శనివారం) బ్యాంకులు క్లోజ్ అవుతున్నాయి. ఆదివారం సెలవు రోజు. కాబట్టి బ్యాంకులు వరుసగా మూడు రోజుల పాటు తెరుచుకోవు. ఇప్పటికే జనవరి 8న కొన్ని బ్యాంకు యూనియన్లు భారత్ బంద్‌లో పాల్గొన్నాయి. ఇప్పుడు వేతన సవరణపై మరోసారి సమ్మె నిర్వహిస్తున్నాయి.

20 శాతం హైక్ కోరుతూ..
బ్యాంకు యూనియన్లు 20% హైక్‌తో వేతన సవరణ కోరుతున్నాయి. అదే సమయంలో యాజమాన్యం మాత్రం 12.25 శాతం కంటే ఎక్కువగా ఇచ్చేందుకు సిద్ధంగా లేదు.

ఈ డిమాండ్లు కూడా..
వేతన సవరణతో పాటు మరిన్ని డిమాండ్లు కూడా ఉన్నాయి. 5 రోజుల వర్కింగ్, బేసిక్ శాలరీలో స్పెషల్ అలవెన్స్ విలీనం, కొత్త పెన్షన్ పథకం రద్దు వంటి డిమాడ్లు ఉన్నాయి.

బ్యాంకు సేవలు, ఏటీఎం సేవలకు అంతరాయం
బ్యాంకు యూనియన్ల సమ్మె నేపథ్యంలో సేవలకు అంతరాయం ఏర్పడనుంది. అలాగే వరుసగా మూడ్రోజులు బ్యాంకులు తెరుచుకోవు (రెండు రోజులు సమ్మె, ఒక రోజు సెలవు) ఏటీఎం సేవలకు ఇబ్బందులు ఏర్పడవచ్చు. అయితే నెఫ్ట్ వంటి ఆన్ లైన్ సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయి.


Click it and Unblock the Notifications