ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధన అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం బండ్లు కాకుండా నగదు సమకూర్చాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ డాక్టర్ సి.రంగరాజన్ సూచించారు. 'నిరర్ధక ఆస్తులు-బ్యాంకుల ముందున్న పరిష్కార మార్గాలు' అంశంపై హైదరాబాద్ శివార్లలోని దొంతాన్‌పల్లి ఇక్ఫాయ్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన సదస్సులో ఆయన ప్రధానోపన్యాసం చేశారు.
అలాగే బ్యాంకుల వ్యాపార నిర్ణయాల్లో ప్రభుత్వ జోక్యం ఉండరాదని, అలాగే బ్యాంకులు కూడా ప్రభుత్వం అడుగుజాడల్లో నడవకుండా స్వతంత్రంగా వ్యవహరించాలని చెప్పారు. ఎవరికి అప్పు ఇవ్వాలి, ఎంత అప్పు ఇవ్వాలి అన్నది బ్యాంకుల బోర్డులే నిర్ణయించాలని సూచించారు. రుణ మంజూరు విషయంలో పటిష్టమైన మధింపు ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇంకా ఏమన్నారంటే...

బాండ్లపై వచ్చే వడ్డీ ఏ మూలకు?
దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు దాదాపు రూ.70 వేల కోట్ల మూలధనాన్ని సమకూర్చుతామని కేంద్రంలోని మోడీ సర్కారు ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఆర్‌బీఐ మాజీ గవర్నర్ డాక్టర్ సి.రంగరాజన్ మాట్లాడుతూ.. బాండ్ల రూపంలో బ్యాంకులకు మూలధనాన్ని సమకూర్చితే లాభం ఏముంటుందని ప్రశ్నించారు. ఆ బాండ్లపై వడ్డీ రూపంలో వచ్చే కొద్దిపాటి సొమ్ము ఆయా బ్యాంకుల అవసరాలకు ఏ మూలకు సరిపోతుందని వ్యాఖ్యానించారు. కాబట్టి ఈ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

నాటి నిర్ణయాల్లో నేనూ భాగస్వామినే...
మన దేశంలో 1991లో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయని, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన సంస్కరణలు తీసుకురావలసి వచ్చిందని, నాటి నిర్ణయాల్లో తాను కూడా భాగస్వామినేనని డాక్టర్ రంగరాజన్ అన్నారు. అయితే అప్పట్నించే ఈ నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏ) బెడద మొదలైందని, అది నేటికీ కొనసాగుతూనే ఉండడం ఆందోళన కలిగిస్తోన్న అంశమని వ్యాఖ్యానించారు. మొండి బకాయిల నియంత్రణకు కఠిన నియంత్రణలు అవసరమన్నారు. బ్యాంకుల విలీనంతో ఈ సమస్యకు కొంత వరకు పరిష్కారం లభించే అవకాశం ఉందన్నారు.

స్వతంత్రంగా వ్యవహరించాలి...
బ్యాంకుల్లో ప్రభుత్వానికి మెజారిటీ వాటా ఉన్నప్పటికీ.. వాటి నిర్వహణ, రుణాల మంజూరు, వ్యాపారపరమైన నిర్ణయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని, ఆ విషయాలను బ్యాంకులకే వదిలివేయాలని రంగరాజన్ సూచించారు. బ్యాంకులు కూడా దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే వ్యాపారం చేయాలని, స్వతంత్రంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఎవరికి అప్పు ఇవ్వాలి, ఎంత అప్పు ఇవ్వాలి అనేది బ్యాంకులే నిర్ణయించుకోవాలని తెలిపారు. రుణ మంజూరు విషయంలో కూడా పటిష్టమైన మధింపు ఉండాలన్నారు. అలాగే బ్యాంకుల బోర్డుల్లో డైరెక్టర్ల నియామకం, బ్యాంకుల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు, బోర్డు సభ్యుల నియామకం తదితర అంశాలలో పటిష్టమైన నిబంధనలు పాటించాలని కూడా రంగరాజన్ వివరించారు.

మాంద్యం కాదు.. మందగమనమే...
ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంతో సాగుతోందని, ఇది మందగమనమే తప్ప ఆర్థిక మాంద్యం అయితే కాదని డాక్టర్ రంగరాజన్ విశ్లేషించారు. ‘‘మందగమనం కనిపిస్తోంది.. ఇది వృద్ధి రేటు తగ్గుదలే.. వచ్చే ఏడాది నుంచి ఇది పెరిగే అవకాశం ఉంది.. అధిక వృద్ధి వెంటనే సాధ్యం కాదు.. రెండు మూడేళ్లు గడిస్తేగానీ 7 శాతం వృద్ధి రేటును అందుకోలేం..'' అని చెప్పారు. 2025 నాటికి దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అవుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. అది అంత ఈజీ కాదని, దీనికి కనీసం ఎనిమిదేళ్ల సమయం పడుతుందని రంగరాజన్ అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications