Bank of Baroda: ప్రస్తుతం దేశంలో ఫైనాన్స్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోంది. ఈ క్రమంలో చాలా కంపెనీల లోన్ బుక్ భారీగానే విస్తరించింది. అయితే ఇటీవల రిజర్వు బ్యాంక్ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కఠిన ఆంక్షలు సైతం తీసుకొచ్చింది.
ఈ క్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా తన మూలధన అవసరాల కోసం అవసరమైన ధనాన్ని సమకూర్చుకునే పనిలో పడింది. అందుకే టైర్-2 డెట్ బాండ్స్ విక్రయం ద్వారా మెుత్తం రూ.5,000 కోట్లను సేకరించాలని నిర్ణయించింది. ఇందులో 10 ఏళ్లకు మెచ్చూర్ అయ్యే రూ.2,000 కోట్లతో పాటు గ్రీన్ షూ ఆప్షన్ ద్వారా మరో రూ.3,000 కోట్లను ఇష్యూ చేస్తున్నట్లు వెల్లడైంది.

అలాగే మరో రూ.10,000 కోట్లను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల విక్రయం ద్వారా సమీకరించాలని బ్యాంక్ ఆఫ్ బరోడా నిర్ణయించింది. ఇందులో ముందుగా ఏడేళ్ల కాలపరిమితితో మెచూర్ అయ్యే రూ.2,000 కోట్ల విలువైన బాండ్లను విక్రయిస్తోంది. అలాగే మిగిలిన రూ.8,000 కోట్లను గ్రీన్ షూ ఆప్షన్ కింద విక్రయించాలని నిర్ణయించింది. సరసమైన గృహాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం నిధులను సేకరించేందుకు బ్యాంక్ అక్టోబర్ 11న ఆమోదించిన తర్వాత ఈ చర్య తీసుకోబడింది.
బ్యాంక్ సెప్టెంబర్ 2023తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభంలో 28% పెరుగుదలతో మెరుగైన పనితీరును ప్రదర్శించింది. సానుకూల ఆర్థిక వార్తలు ఉన్నప్పటికీ.. బ్యాంక్ ఆఫ్ బరోడా స్టాక్ నవంబర్ 17న నివేదించిన ప్రకారం ప్రకటనకు ముందు చివరి ట్రేడింగ్ సెషన్‌లో 0.91% స్వల్ప క్షీణతను చవిచూసింది.


Click it and Unblock the Notifications