adani: అదానీ రుణాలపై బ్యాంక్ ఆఫ్ బరోడా షాకింగ్ నిర్ణయం
adani: అదానీ గ్రూపు విషయంలో రచ్చ కొనసాగుతూనే ఉంది. ఆ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన SBI, LIC వంటి బడా సంస్థలు కోట్లాది రూపాయలు నష్టపోతున్నాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని ఆయా సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. అయితే పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా.. ఇచ్చిన రుణాలను ఎలా రాబట్టాలా అని సతమతమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సరిగ్గా ఇక్కడే ప్రభుత్వ రంగ సంస్థ 'బ్యాంక్ ఆఫ్ బరోడా' చేసిన ప్రకటన యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.

అభ్యంతరమేమీ లేదు:
ఇచ్చిన రుణాలు ఎలా వసూలు చేసుకోవాలా అని పలు బ్యాంకులు మల్లగుల్లాలు పడుతున్న సమయంలో.. అదానీ గ్రూపునకు రుణాలు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. నిబంధనల ప్రకారం ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న అదానీ కంపెనీలకు.. అప్పులు ఇవ్వడానికి తమకేమీ అభ్యంతరం లేదని బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ చద్దా సోమవారం తెలిపారు.

RBI అనుమతుల మేరకే:
ఏవైనా గ్రూపు కంపెనీలకు, బ్యాంకు మూలధన బేస్ లో 25 శాతానికి మించకుండా రుణాలు ఇవ్వడానికి RBI అనుమతిస్తోంది. అయితే అదానీ గ్రూపు రుణాలు 25 శాతంలోపే ఉన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థకు చద్దా తెలిపారు. అందులోనూ అధిక శాతం రుణాలు.. బలమైన కాష్ ఫ్లో, అసెట్ క్వాలిటీ ఉన్న కంపెనీలకే ఇచ్చినట్లు గుర్తు చేశారు. అందువల్ల ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదని అభిప్రాయపడ్డారు. రీఫైనాన్సింగ్ కోసం అదానీ గ్రూపు తమను సంప్రదిస్తే ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటామని ప్రకటించారు.

రుణాల వృద్ధే లక్ష్యంగా..
ఈ ఆర్థిక సంవత్సరానికిగాను 18 శాతం, రాబోయే ఏడాదికి 15 శాతం రుణ వృద్ధిని బ్యాంక్ ఆఫ్ బరోడా లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో అధికభాగం రిటైల్ రంగానికి మిగిలిన భాగం కార్పొరేట్ సంస్థలకు ఇవ్వడానికి నిర్ణయించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో బ్యాంక్ రిటైల్ అడ్వాన్స్‌లు YoY దాదాపు 30 శాతం, కార్పొరేట్ రుణాలు 13 శాతం వృద్ధి చెందాయి. ఇదే సమయంలో దేశీయ డిపాజిట్లు సైతం 15 శాతం మేర పెరిగాయి.


Click it and Unblock the Notifications