కరోనా వైరస్ కారణంగా గత ఆరు నెలల కాలంలో డిమాండ్ భారీగా తగ్గింది. అన్ని రంగాలపై మహమ్మారి ప్రభావం పడింది. వైరస్ నేపథ్యంలో దేశంలో బ్యాంకు క్రెడిట్ ఆగస్ట్‌లో (28వ తేదీ నాటికి) రూ.54,000 కోట్ల మేర తగ్గి, రూ.102.11 ట్రిలియన్లుగా ఉంది. అంతకుముందు, జూలై 31వ తేదీ నాటికి ఈ క్రెడిట్ ఔట్‌స్టాండింగ్స్ రూ.102.65 ట్రిలియన్లుగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) డేటా ప్రకారం... ఏడాది ప్రాతిపదికన ఆగస్ట్ 28తో ముగిసిన పక్షానికి రుణవృద్ధి 5.5 శాతంగా ఉంది. అంతకుముందు ఆగస్ట్ 14, 2020 పక్షంలోను ఇదే కనిపించింది. అయితే 2019 ఆగస్ట్ 30లో క్రెడిట్ గ్రోత్ డబుల్ డిజిట్‌తో 10.2 శాతంగా ఉంది.

ఎంఎస్ఎంఈల కోసం రుణాలు.. ఐనా రుణవృద్ధి బలహీనం
బలహీనమైన డిమాండ్, మందగమనం బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రభావం చూపించిందని కేర్ రేటింగ్స్ అభిప్రాయపడింది. కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. జూన్ నెల నుండి విడతలవారీగా ఆంక్షలు సడలిస్తోంది. కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కావడంతో పాటు, కరోనా నేపథ్యంలో దెబ్బతిన్న ఎంఎస్ఎంఈలకు ఊరటనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ హామీ స్కీంని ప్రారంభించింది. అయినప్పటికీ రుణవృద్ధి పెరుగుదల బలహీనంగా ఉందని డేటా వెల్లడిస్తోంది.

బ్యాంకు క్రెడిట్స్ సమీపకాలంలోనూ నెమ్మదిగానే..
షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కోణాల్లోను పరిశీలించి రుణాలు అందిస్తున్నాయి. క్రెడిట్ పోర్ట్‌ఫోలియో పట్ల అప్రమత్తంగా ఉన్నాయి. ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా కోలుకుంటున్నప్పటికీ, పూర్వస్థితికి రావడానికి సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో బ్యాంకు క్రెడిట్ సమీపకాలంలో నెమ్మదిగానే ఉండవచ్చునని కేర్ రేటింగ్స్ తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థికసంవత్సరం మొదటి క్వార్టర్ (ఏప్రిల్-జూన్)లో 23.9 శాతం ప్రతికూలత నమోదు చేసిన విషయం తెలిసిందే.

డిపాజిట్స్ తీరు ఇదీ..
ఆగస్ట్ నెలలో బ్యాంకులు రూ.15,000 కోట్ల డిపాజిట్లు అందుకున్నాయి. ఆగస్ట్ 28, 2020తో ముగిసిన పక్షంలో బ్యాంకులకు దాదాపు రూ.96,255 కోట్ల డిపాజిట్లు సాధించగా, అంతకుముందు ఆగస్ట్ 14, 2020తో ముగిసిన పక్షానికి రూ.80,849 కోట్ల మేర క్షీణతను నమోదు చేశాయి. అంటే రూ.15వేల కోట్ల వరకు డిపాజిట్లు వచ్చినట్లు. ఆగస్ట్ 28, 2020 నాటికి ఔట్‌స్టాండింగ్ డిపాజిట్స్ రూ.141.76 ట్రిలియన్లు కాగా, జూలై 31, 2020 నాటికి రూ.141.61 ట్రిలియన్లుగా ఉంది. ఏడాది ప్రాతిపదికన డిపాజిట్ వృద్ధి రేటు 10.9 శాతంగా ఉంది. కానీ అంతకుముందు పక్షంలో ఇది 11 శాతం ప్రతికూలత నమోదు చేసింది. డిపాజిట్ ట్రెండ్ దాదాపు గత ఏడాది లాగే ఉంది.


Click it and Unblock the Notifications