Gold: మార్కెట్లోకి వచ్చిన బంగ్లాదేశీ ఫేక్ గోల్డ్! దీన్ని బంగారం షాపులు కూడా గుర్తుపట్టలేవు!
బంగారం అంటే భారతీయులకు ఎంతో సెంటిమెంట్. అందుకే ధర ఎంత పెరిగినా బంగారం (gold) కొనడం మాత్రం ఆపరు. అయితే ప్రజల ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా "బంగ్లాదేశీ రెడ్ గోల్డ్" అనే పేరుతో ఒక నకిలీ బంగారం స్కామ్ కలకలం సృష్టిస్తోంది. ఇది చూడటానికి అచ్చం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంలాగే కనిపిస్తుంది. కానీ, ఇందులో అసలు బంగారం వాటా సున్నా శాతం.

ఏమిటీ బంగ్లాదేశీ రెడ్ గోల్డ్?
ఈ నకిలీ మిశ్రమ ధాతువును రాగి, నికెల్ , జింక్ వంటి చౌకైన లోహాలతో తయారు చేస్తారు. దీనికి పైన వేసే పాలిష్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే.. అనుభవం ఉన్న వారు కూడా గుర్తుపట్టలేనంతగా 22 క్యారెట్ల లేదా 24 క్యారెట్ల మెరుపును కలిగి ఉంటుంది. చివరకు ఈ బిస్కట్లు లేదా న నగలను కట్ చేసి చూసినా, లోపల కూడా బంగారం (gold) రంగులోనే కనిపిస్తుంది. అందుకే సామాన్య ప్రజలు ఇది అసలు బంగారమే అని నమ్మి వేలకు వేలు పోసి కొనుగోలు చేస్తున్నారు.
మోసం చేసే పద్ధతి ఇదే!
సాధారణంగా ఈ నకిలీ బంగారాన్ని లోకల్ మార్కెట్లలో లేదా సోషల్ మీడియా వేదికగా విక్రయిస్తుంటారు. "బంగ్లాదేశ్ నుంచి ఇంపోర్ట్ చేసిన గోల్డ్", "తక్కువ ధరకే దొరుకుతున్న స్మగ్లింగ్ గోల్డ్" లేదా "అత్యవసరంగా డబ్బులు కావాలి కాబట్టి తక్కువకే ఇస్తున్నాం" వంటి మాటలతో కస్టమర్లను ఆకర్షిస్తారు. వీటిపై ఎలాంటి BIS హాల్‌మార్క్ ముద్రలు ఉండవు. పొరపాటున వీటిని కొంటే తిరిగి ఏ బంగారం షాపులోనూ లేదా బ్యాంకులోనూ తనఖా పెట్టలేరు. దీనికి రీసేల్ వాల్యూ అస్సలు ఉండదు. కొన్నాళ్ల తర్వాత ఈ మెటల్ ఆక్సీకరణం చెంది తన రంగును కోల్పోతుంది.
నకిలీని గుర్తించడం ఎలా?
మీరు కొనేది అసలు బంగారమో కాదో తెలుసుకోవడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి..
- అయస్కాంత పరీక్ష (Magnet Test): నిజమైన బంగారానికి అయస్కాంతం అతుక్కోదు. ఒకవేళ మీరు కొన్న బంగారం అయస్కాంతానికి ఆకర్షించబడితే.. అందులో ఇనుము లేదా ఇతర లోహాలు ఉన్నాయని అర్థం.
- నైట్రిక్ యాసిడ్ టెస్ట్: ఒకవేళ యాసిడ్ వేసినప్పుడు ఆ వస్తువు ఆకుపచ్చ రంగులోకి మారితే అది నకిలీ బంగారం. స్వచ్ఛమైన బంగారం రంగు మారదు.
- హాల్‌మార్క్ చెకింగ్: ఎప్పుడూ 6 అంకెల HUID కోడ్ ఉన్న నగలను మాత్రమే కొనండి. ఈ కోడ్‌ను 'BIS Care' యాప్‌లో సెర్చ్ చేస్తే ఆ నగ ఎక్కడిది? దాని స్వచ్ఛత ఎంత? అనేది తెలిసిపోతుంది.
కొనేముందు ఇవి చూసుకోవాలి..
ఎట్టి పరిస్థితుల్లోనూ వీధుల్లో తిరిగే వారి వద్ద లేదా తెలియని వ్యక్తుల వద్ద తక్కువ ధరకే వస్తుందని బంగారం కొనకండి. ధృవీకరించబడిన జ్యువెలరీ షోరూమ్‌లలోనే కొనుగోలు చేయండి. ఒకవేళ మీకు అనుమానం ఉంటే.. జ్యువెలరీ షాపుల్లో ఉండే XRF మిషన్ల ద్వారా పరీక్ష చేయించండి. నకిలీ స్టాంపులు వేసి కూడా మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి, పక్కాగా బిల్లు ఉన్నప్పుడే లావాదేవీలు జరపండి.
ఏదేమైనా కష్టపడి సంపాదించిన డబ్బును నకిలీ బంగారం మీద పెట్టి మోసపోకండి. ధర తక్కువగా ఉంది కదా అని ఆశపడితే, చివరకు చేతిలో మిగిలేది పనికిరాని రాగి ముక్కలే అని గుర్తుంచుకోండి.


Click it and Unblock the Notifications