బెంగళూరును ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ.. ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరిక..
దేశంలోని ఐటీ రాజధానిగా పేరుగాంచిన Bengaluru భారీ వర్షాలతో సతమతమవుతోంది. భారత వాతావరణ శాఖ (IMD) తాజాగా నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. రాబోయే రోజుల్లో కూడా వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు కొనసాగుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రీ-మాన్సూన్ ప్రభావం క్రమంగా పెరుగుతుండటంతో కర్ణాటకలోని అనేక జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి.
సోమవారం సాయంత్రం బెంగళూరులో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం నగర జీవనాన్ని పూర్తిగా దెబ్బతీసింది. ప్రధాన రహదారులు నీటితో నిండిపోవడంతో ట్రాఫిక్ భారీగా స్థంభించింది. ముఖ్యంగా మజెస్టిక్, శివాజీనగర్, కేఆర్ మార్కెట్, రాజాజీనగర్, వసంత్ నగర్ వంటి ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని చోట్ల వాహనాలు నీటిలో ఇరుక్కుపోయాయి. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే మార్గాల్లో కూడా ట్రాఫిక్ జామ్‌లు నమోదవడంతో విమాన ప్రయాణికులు ఆలస్యానికి గురయ్యారు. కొన్ని విమాన సర్వీసులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని విమానయాన సంస్థలు ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. బెంగళూరులో ఉష్ణోగ్రతలు 23 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉంది. తేమ శాతం కూడా 45 నుంచి 70 శాతం మధ్య ఉండటంతో వాతావరణం ఉక్కపోతగా మారనుంది. రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని IMD తెలిపింది. ముఖ్యంగా బుధవారం నుంచి గాలుల వేగం మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
కేవలం బెంగళూరుకే కాకుండా కర్ణాటకలోని మైసూరు, మండ్య, హాసన్, కోలార్, చిక్కబళ్లాపుర, శివమొగ్గ, చిక్కమగళూరు, కోడుగు, దక్షిణ కన్నడ, ఉడుపి వంటి అనేక జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన పడే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు. ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా విద్యుత్ అంతరాయాలు, చెట్ల కొమ్మలు విరిగిపడటం, రహదారులపై ట్రాఫిక్ అంతరాయం వంటి సమస్యలు తలెత్తవచ్చని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా నైరుతి రుతుపవనాలు క్రమంగా దక్షిణ భారతదేశం వైపు కదులుతున్నాయని IMD వెల్లడించింది. కేరళలో మాన్సూన్ ప్రవేశానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, దాని ప్రభావం కర్ణాటకపై కూడా కనిపిస్తున్నట్లు తెలిపింది. అందువల్ల రాబోయే రోజుల్లో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, చెట్ల కింద నిలబడవద్దని, విద్యుత్ పరికరాల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications
