Bangalore News: ఎలక్ట్రానిక్స్ నగరం బెంగళూరులో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. వేసవి ప్రారంభంతోనే తీవ్ర నీటి సంక్షోభం ఏర్పడింది. ఎండలు మరింత ముదురుతుండడంతో రానున్న రోజులు ఎలా ఉండనున్నాయో అని అందరిలోనూ ఆందోళన నెలకొంది. దీని ప్రభావం విద్యార్థులు, IT ఉద్యోగులపైనా పడింది. దీంతో టెక్కీలు సహా పౌర సమాజం కొత్త డిమాండ్లను తెరపైకి తీసుకొస్తోంది.
నగరంలో ఏర్పడిన నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని పాఠశాలలు, IT కంపెనీల విషయంలో అధికారులు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తులు వెలువెత్తుతున్నాయి. IT ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం, విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులను తిరిగి అమలు చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ మేరకు పౌరులు సహా సామాజికవేత్తలు, న్యాయవాదులు.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

కరోనా విజృంభణ సమయంలో పరిస్థితిని చక్కదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ క్లాస్ లను అమలు చేసింది. కాగా ఇప్పుడు కూడా దరిదాపుల్లో అత్యవసర పరిస్థితి కాచుకుని కూర్చోవడంతో అదే విధానాన్ని ఎందుకు కొనసాగించకూడదని ప్రశ్నిస్తున్నారు. ఇంటి నుంచి పనిచేసే ఆప్షన్స్ ఇస్తే ఇతర రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు తమ స్వస్థలాలకు మళ్లుతారు. తద్వారా నగరంపై నీటి డిమాండ్ భారీగా తగ్గే అవకాశం ఉందని గుర్తు చేస్తున్నారు.
వాతావరణ శాఖ కూడా మార్చి నుంచి మే వరకు సాధారణం కంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయని ముందే హెచ్చరించింది. ఫిబ్రవరిలోనూ వర్షపాతం నమోదు కాలేదు. ఎల్‌నినో, గ్లోబల్ వార్మింగ్ వల్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఇటువంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పర్యవసానాలను లోతుగా అధ్యయనం చేసి సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications